పాల‌కొల్లు అసెంబ్లీ బ‌రిలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..!

సైలెంట్‌గా ఉంటూనే… సంచ‌ల‌నాలు సృష్టించ‌డంలో త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకునే జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కల్యాణ్ త‌ను తీసుకున్న‌ తాజా నిర్ణ‌యంతో  మ‌రోసారి రాష్ట్ర రాజ‌కీయ వ‌ర్గాల్లో వేడిని పుట్టించారు.  ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా ఏలూరులో ప‌వ‌న్‌ ఓటు హ‌క్కును న‌మోదు చేసుకోబోతున్నార‌ని, ఇక్క‌డే నివాసం ఉండేందుకు త‌న‌కు త‌గిన అనువైన ఇంటిని కూడా చూస్తున్నార‌ని…, పవ‌న్ త‌న అభిమాన‌, అనుచ‌ర‌గ‌ణానికి ఆ బాధ్య‌త అప్ప‌గించార‌ని జ‌న‌సేన ప్ర‌తినిధి రాఘవ  సోమ‌వారం విడుద‌ల చేసిన ఒక ప్ర‌క‌ట‌న ఇప్పుడు రాష్ట్ర రాజ‌కీయాల్లో హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఈ వార్త‌లు ప‌శ్చిమ‌లోని ప‌వ‌న్ అభిమానులు, జ‌న‌సేన పార్టీ కార్య‌క‌ర్త‌ల్లో ఎన‌లేని ఉత్సాహాన్నినింపాయి.

నిజానికి ఎన్నిక‌ల‌కు ఇంకా రెండున్న‌రేళ్ల స‌మ‌యం ఉంది. ఇప్ప‌డు  ప‌వ‌న్ హ‌ఠాత్తుగా ప‌శ్చిమగోదావ‌రి రాజ‌కీయాల‌పై అందులోనూ ఏలూరుపై దృష్టి సారించ‌డానికి కార‌ణ‌మేమిటా అని ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా చ‌ర్చ జ‌రుగుతోంది. నిజానికి ప‌శ్చిమ గోదావ‌రి ప‌వ‌న్‌కు సొంత జిల్లా. త‌న తండ్రి ఉద్యోగరీత్యా వారి కుటుంబం ప‌లు ప్రాంతాలు మారినా… సొంత జిల్లా అంటే ప‌వ‌న్‌కు అభిమానం మెండు అని ఆయ‌న ఆంత‌రంగికులు చెపుతారు. ఇక ఉభ‌య గోదావ‌రి జిల్లాలు రాజ‌కీయ చైత‌న్యానికి  పెట్టింది పేరు. ఈ రెండు జిల్లాలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపితే రాష్ట్రంలో అధికారం ఆ వైపున‌కే ఉంటుంద‌న్న‌ది చ‌రిత్ర చెపుతున్న స‌త్యం. ఇక  ప‌శ్చిమ‌ రాజ‌కీయాల్లో సినీ న‌టుల ప్ర‌భావ‌మూ ఎక్కువే.

గ‌తంలో  ఏలూరు పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గంనుంచి సూప‌ర్‌స్టార్ కృష్ణ ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త బోళ్ల బులిరామ‌య్య‌పై పోటీ చేసి గెల‌వ‌గా, న‌ర‌సాపురం నుంచి బీజేపీ అభ్య‌ర్థిగా మ‌రో ప్ర‌ముఖ న‌టుడు కృష్ణంరాజు పోటీ చేసి కేంద్ర‌మంత్రిగా కూడా ప‌నిచేశారు. ఈ నేప‌థ్యంలో జ‌న‌సేన అధినేత తొలిసారిగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏలూరునుంచి బ‌రిలోకి దిగేందుకు వ్యూహం ర‌చిస్తున్నారా..? ప‌వ‌న్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా..?  లేక పార్ల‌మెంటు అభ్య‌ర్థిగా పోటీ ప‌డ‌తారా…? ఇవి రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌లిగిస్తున్న వార్త‌లు.

ఈ జిల్లా రాజ‌కీయాల్లో త‌ల‌పండిపోయిన సీనియ‌ర్లు చెపుతున్న విష‌యమేమిటంటే… జిల్లా కేంద్రం కాబ‌ట్టి  ఏలూరులో ప‌వ‌న్ ఓటు హ‌క్కు న‌మోదు చేయించుకోవ‌డం విచిత్ర‌మేమీ కాదు. కానీ ఆయ‌న  అక్క‌డి నుంచి పోటీ చేసే రిస్క్ చేయ‌క‌పోవ‌చ్చున‌ట‌. దీనికంటే పాల‌కొల్లు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప‌వ‌న్ పోటీకి దిగే అవ‌కాశ‌మే ఎక్కువ‌గా క‌నిపిస్తోంద‌ట‌. దీనికి కార‌ణ‌మేమిటంటే ప్ర‌స్తుతం రాజ‌కీయాల్లో కీల‌కంగా మారిపోయిన సామాజిక వ‌ర్గాల సమీక‌ర‌ణ‌లేనంటున్నారు.

ఏలూరులో ప‌వ‌న్ సామాజిక‌వ‌ర్గ‌మైన కాపు ఓటు బ్యాంక్ బ‌లంగానే ఉన్నా, దానికి దీటుగా ఇక్క‌డ వైశ్య సామాజిక‌వర్గం ఓట్లు 20 వేలు ఉండ‌గా, క‌మ్మ సామాజిక‌వ‌ర్గం ఓట్లు కూడా 20 వేల‌కు పైగానే ఉన్నాయి.  బ్రాహ్మ‌ణ సామాజిక‌వ‌ర్గం ఓటు బ్యాంకు సైతం ఇక్క‌డ భారీగానే ఉంది.  ఇక‌ జిల్లా ప‌రిపాల‌నా కేంద్రం కావ‌డంతో ఉద్యోగ వ‌ర్గాలు కూడా  గెలుపోట‌ముల‌ను ప్ర‌భావితం చేయ‌గ‌లిగిన స్థాయిలో ఉండ‌టం మ‌రో ముఖ్యాంశం.

పాల‌కొల్లులో అయితే ప‌వ‌న్ కు తిరుగులేని మ‌ద్ద‌తుగా నిలుస్తున్న సొంత సామాజిక‌ వ‌ర్గ‌మైన కాపుల‌దే లీడింగ్‌. కాపులు , తూర్పు కాపులు క‌లిస్తే పాల‌కొల్లు నియోజ‌క‌వ‌ర్గంలో 35 వేలకు మించిన సంఖ్య‌లో ఓట‌ర్లు ఉన్నారు. ఆ త‌రువాత సంఖ్యాప‌రంగా ఎక్కువ‌గా ఉన్న‌ శెట్టి బ‌లిజ‌ల్లోనూ ప‌వ‌న్ అభిమాన గ‌ణం ఎక్కువే. దీంతో పాల‌కొల్లు అయితే త‌న‌కు రాజ‌కీయంగా సేఫ్ జోన్‌ అని ప‌వ‌న్ భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ప‌వ‌న్ పాల‌కొల్లులో పోటీ విష‌య‌మై ఇప్ప‌టికే అండ‌ర్ గ్రౌండ్ వ‌ర్క్ స్టార్ట్ చేసిన‌ట్టు జ‌న‌సేన వ‌ర్గాల విశ్వ‌స‌నీయ స‌మాచారం. ఇక్క‌డి వ్య‌వ‌హారాలు ఓ యువ‌కుడికి కూడా అప్ప‌గించిన‌ట్టు తెలుస్తోంది.

వీట‌న్నింటికీ మించి ప‌వ‌న్ పాలకొల్లును ఎంచుకుంటార‌నేందుకు మ‌రో బ‌ల‌మైన కార‌ణ‌మేమిటంటే, ప్ర‌జారాజ్యం అధినేత‌గా ప‌వ‌న్ సోద‌రుడు చిరంజీవి పాల‌కొల్లులో ఎద‌ర్కొన్న ఘోర ప‌రాభ‌వాన్ని ప‌వ‌న్ ఇంకా మ‌ర‌చిపోలేద‌ట‌. అప్ప‌ట్లో అక్క‌డ చిరంజీవి ఓట‌మికి పార్టీకి సంస్థాగ‌తంగా ఉన్న‌లోపాలు, స్థానిక నేత‌ల మ‌ధ్య‌, స‌రైన స‌మ‌న్వ‌యం, వ్యూహ చ‌తుర‌త లేక‌పోవ‌డం కార‌ణాలుగా భావిస్తున్న ప‌వ‌న్‌… జ‌న‌సేన విష‌యంలో ఆ లోపాల‌న్నింటినీ స‌వ‌రించుకుని, అక్క‌డినుంచే పోటీ చేసి తిరుగులేని విజ‌యం సాధించాల‌ని, సొంత జిల్లా నుంచే త‌న స‌త్తా ఏంటో   చాటాల‌ని ఉవ్విళ్ళూరుతున్నార‌ట‌. ఏది  ఏమైనా ప‌వ‌న్ రాజ‌కీయాల్లోనూ  త‌న‌కు మాత్ర‌మే సాధ్య‌మైన‌ విభిన్న‌శైలిని ప్ర‌ద‌ర్శిస్తున్నార‌న‌డంలో సందేహం లేద‌నే చెప్పాలి.