ఏపీలో శ‌త్రువు… తెలంగాణ‌లో మిత్రువా..!

త‌న మాట‌ల మాయాజాలంతో తెలంగాణ ప్ర‌జ‌ల‌ను క‌ట్టిప‌డేస్తూ, తిరుగులేని రాజ‌కీయ వ్యూహాల‌తో ప్ర‌తిప‌క్షాల‌ను నిర్వీర్యం చేసేస్తూ టీఆర్ఎస్‌ను తెలంగాణ‌లో తిరుగులేని రాజ‌కీయ శ‌క్తిగా మార్చిన టీ ముఖ్య‌మంత్రిని స‌మ‌ర్థంగా ఎదుర్కోవ‌డానికి తెలంగాణ‌లోని ప్ర‌తిప‌క్షాల‌న్నీ ఒక్క‌టొకటిగా ఏక‌మ‌వుతున్నాయి. ఇప్ప‌టిదాకా ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న కాంగ్రెస్‌, టీడీపీ ఎవ‌రికివారుగా అధికార టీఆర్ఎస్‌పై పోరు సలుపుతుండ‌గా…ఒక‌ప్పుడు తెలంగాణ‌లో బ‌లంగా ఉండి ప్ర‌స్తుతం ప్రాబ‌ల్యం కోల్పోయిన సీపీఎం గ‌త వైభ‌వం సాధించాల‌న్న గట్టి ప‌ట్టుద‌ల‌తో  ఇప్పుడు రంగంలోకి దిగింది.

తెలంగాణ ప్ర‌జ‌ల‌కు సంబంధించి, ప‌లు స‌మ‌స్య‌ల‌ను,  వివిధ అంశాలను ప్రస్తావిస్తూ సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం రాష్ట్రవ్యాప్తంగా మహా పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఈనేప‌థ్యంలో కీలక ప్రతిపక్షమైన టీడీపీ సైతం వేగంగా తన సమీకరణలు మార్చుకుంటోంది. సీపీఎం త‌ల‌పెట్టిన పాద‌యాత్ర‌కు తెలుగుదేశం పార్టీ అధికారికంగా మద్దతిచ్చింది. ప్రజాసమస్యలపై ఎవరు పోరాడినా వారికి మద్దతును ఇవ్వాలని టీడీపీ విధానపరమైన నిర్ణయం తీసుకుందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి – రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ రేవంత్ రెడ్డి ఈ సంద‌ర్భంగా వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం.

కేసీఆర్  అర‌చేతిలో స్వ‌ర్గం చూపిస్తూ తెలంగాణ ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్నార‌ని, కేసీఆర్ కుటుంబం త‌ప్ప తెలంగాణ‌లో ఎవ‌రూ సంతోషంగా లేర‌ని టీడీపీ నేతలు దుయ్య‌బ‌ట్టారు.తమ్మినేని వీరభద్రం పాదయాత్రకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని కూడా టీడీపీ నేత‌లు వెల్ల‌డించారు. తమ్మినేని పాదయాత్ర కొనసాగే గ్రామాలలో  టీడీపీ శ్రేణులు కూడా కూడా త‌మ్మినేనికి స్వాగ‌తం ప‌లికేందుకుదు సిద్దం కావాలని, ఆయ‌న పాద‌యాత్ర జ‌య‌ప్ర‌ద‌మ‌య్యేలా కృషి చేయాల‌ని టీడీపీ నేత‌లు  పిలుపునిచ్చారు.

సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం పాదయాత్రకు మద్దతుగా  హైదరాబాద్ నుంచి నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలానికి బయలుదేరిన సందర్భంగా రావుల – రేవంత్ టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలు పెరిగిపోతున్నాయని-  టీఆర్ఎస్‌ ప్ర‌భుత్వం అన్ని రంగాలలో ప్రభుత్వం విఫలమైందని , కేసీఆర్ కు వ్యతిరేకంగా – ప్రజాసమస్యలపై గళం విప్పిన నేతలను అణచివేయడానికి చేసే కుట్ర‌ల‌కే ముఖ్య‌మంత్రి ఎక్కువ స‌మ‌యం కేటాయిస్తున్నార‌ని టీడీపీ నేత‌లు ఆరోపించారు.

ఇది ఇలాఉండ‌గా తెలంగాణ‌లో అధికార పార్టీకి వ్య‌తిరేకంగా టీడీపీ, సీపీఎం చేతులు క‌ల‌ప‌డం బాగానే ఉందికాని, ఏపీలో మాత్రం అదే సీపీఎం అధికారంలో ఉన్న‌టీడీపీపై కారాలు, మిరియాలు నూరుతుండ‌టం గ‌మ‌నార్హం. ఇక్క‌డ చంద్ర‌బాబు ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా అవినీతి ఆరోప‌ణ‌లున్న వైఎస్ జ‌గ‌న్ పార్టీతో భుజం భుజం క‌లిపి న‌డిచేందుకు ఆ పార్టీ ప్ర‌య‌త్నిస్తోంది. మ‌రి క‌మ్యూనిస్టులు త‌మ సిద్ధాంతాల‌న్నీఏ మూల‌న‌ప‌డేశారో తెలియ‌దుగాని… ఈ అవ‌కాశ‌వాద రాజ‌కీయాల్ని చూసి జ‌నం ముక్కున వేలేసుకుంటున్నార‌నేది మాత్రం నిజం.