ప‌వ‌న్ కొత్త పొలిటిక‌ల్ స్టెప్‌

ప‌వ‌న్‌క‌ల్యాణ్ రాజ‌కీయ రంగ ప్ర‌వేశం అంటే… ఏదో రాజ‌కీయాల్లో అదృష్టం ప‌రీక్షించుకునేందుకు జ‌నాద‌ర‌ణ ఉన్న మ‌రో న‌టుడు ఒక రాయి విసిరి చూసే ప్ర‌య‌త్నంగా ఇప్ప‌టిదాకా లోపాయికారీగా కొంత‌మంది సీనియ‌ర్ నాయ‌కులు కొట్టి పారేస్తూ వ‌స్తున్నారు. అయితే ప‌వ‌న్ అంత‌ ఆషామాషీగా రాజ‌కీయ ఎంట్రీ ఇవ్వ‌డంలేద‌ని.. ప‌క్కా ప్ర‌ణాళిక‌తో ప‌వ‌ర్ స్టార్‌.. ప్ర‌ధాన రాజ‌కీయ ప‌క్షాల‌న్నింటికీ షాక్ ఇవ్వ‌డం ఖాయ‌మ‌ని రానున్న కొద్దిరోజుల్లోనే అందరికీ అర్థం కానుంద‌ని విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం.

తెలుగుదేశం పార్టీపై స‌హ‌జంగానే అధికార‌పార్టీగా ఎంతో కొంత ప్ర‌జ‌ల్లో అసంతృప్తి, వ్య‌తిరేక‌త ఉండ‌టం..,   రాష్ట్రంలో కాంగ్రెస్ ఇప్ప‌ట్లో తిరిగి కోలుకునే ప‌రిస్థితి లేక‌పోవ‌డంతోపాటు.. జ‌గ‌న్‌ను అవినీతి కేసులు వీడ‌ని నీడ‌లా వెంటాడుతుండ‌టంతో… రాష్ట్రంలో పొలిటికల్ వ్యాక్యూమ్ ఉంద‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. అంతేకాదు.. కాంగ్రెస్ అంప‌శ‌య్య‌మీద‌కు చేర‌డంతో ఆ పార్టీనే న‌మ్ముకుని తామూ మునిగిపోయిన చాలామంది సీనియ‌ర్ నేత‌లు అటు టీడీపీలో చేర‌లేక‌.. ఇటు జ‌గ‌న్ వైఖ‌రి న‌చ్చ‌క… ప్ర‌స్తుతం త్రిశంకు స్వ‌ర్గంలో ఉన్నారు. ప‌వ‌న్ రాజ‌కీయ పార్టీ పెడితే త‌మ అండ ఖ‌చ్చితంగా ఉంటుంద‌ని వీరంతా ఆయ‌న‌కు చెప్పిన‌ట్టు తెలుస్తోంది.

ఇంకో తాజా విష‌య‌మేమిటంటే.. రాష్ట్ర విభ‌జ‌న త‌రువాత ఇప్ప‌టిదాకా సైలెంట్‌గా ఉంటు వ‌చ్చిన మాజీ ముఖ్య‌మంత్రి కిర‌ణ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్య‌ల వెనుక సైతం అంత‌రార్థ‌మిదేన‌ని రాజ‌కీయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.  ఇప్ప‌టికే కిర‌ణ్ వ్యాఖ్య‌ల‌కు సంబంధించి ఆయ‌న పొలిటిక‌ల్ కెరీర్‌ సెకండ్ ఇన్నింగ్స్ పై ఊహాగానాలు మొదలయ్యాయి. నిజానికి కిరణ్ కుమార్ రెడ్డిని బీజేపీలో చేర్చుకోవాలని కొంత‌కాలంగా కొన్ని ప్రయత్నాలు జరిగినా ఎందుక‌నో.. అవి సాకారం కాలేదు. ఇక జ‌గ‌న్ ఏక‌ప‌క్ష‌వైఖ‌రి కార‌ణంగా.. ఆ పార్టీలో చేరినా త‌న‌కు ఏమంత గౌర‌వం ల‌భించ‌ద‌ని కిర‌ణ్ భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. అదే ప‌వ‌న్ పార్టీలోనైతే తాను నెంబ‌ర్ టూగా ఉండ‌వ‌చ్చ‌ని, త‌న గౌర‌వానికి హామీ ఉంటుంద‌ని కిర‌ణ్‌కుమార్‌రెడ్డి భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది.  అంతేకాదు.. కిర‌ణ్, ప‌వ‌న్ క‌లిస్తే చిత్తూరు నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు పూర్తిగా మారిపోయే అవ‌కాశ‌ముంటుంది.

అంతేకాదు… కిర‌ణ్ ప‌వ‌న్ పార్టీలోకి ఎంట్రీ ఇస్తే.. ఇంకా ఇత‌ర పార్టీల్లో ఒక వెలుగు వెలిగిన‌ సీనియ‌ర్ నేత‌లు సైతం… అదే బాట‌లో న‌డిచే అవ‌కాశ‌ముంద‌ని రాజ‌కీయ వ‌ర్గాలు విశ్లేషిస్తున్నాయి. అయితే ప‌వ‌న్ త‌న పార్టీని పూర్తిగా కొత్త ర‌క్తంతోనే నింపాల‌ని.. తద్వారా ఏ పార్టీకి చెంద‌ని త‌ట‌స్థుల ఓట్ల‌ను ఆక‌ర్షించాల‌ని భావిస్తున్నార‌ట‌. అయితే అవినీతి ఆరోప‌ణ‌లు లేని రాజ‌కీయ‌నేత‌లను పార్టీలోకి ఆహ్వానించేందుకు ఆయ‌న‌కు ఏమీ అభ్యంత‌రం ఉండ‌ద‌నే భావించవ‌చ్చు. అంత‌కుమించి పార్టీ నిర్వ‌హ‌ణ‌లో వారి అవ‌స‌రం ఆయ‌నకు చాలా ఉంటుంది కూడా. సో.. ప‌వ‌న్ రాజ‌కీయ తొలి అడుగులు బ‌లంగానే ప‌డుతున్నాయ‌న్న‌మాట‌.