అక్క‌డ బాబుకు రోజుకో త‌ల‌నొప్పి

విప‌క్షాధినేత జ‌గ‌న్ గ‌తంలో.. చంద్ర‌బాబు ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్ట‌డం త‌న‌కు నిమిషాల‌మీద ప‌ని అంటూ… అహంకారంతోనో.. లేక రాజ‌కీయ అప‌రిక్వ‌త‌తోనో చేసి వ్యాఖ్య‌లు అంద‌రికీ గుర్తుండే ఉంటాయి. అదే స‌మ‌యంలో ఇటు  మిత్ర ప‌క్షంగా ఉన్న బీజేపీ సైతం ఏపీలో సొంతంగా బ‌ల‌ప‌డేందుకు మొద‌లుపెట్టిన ప్ర‌య‌త్నాలు చూశాక.. వారి ప్ర‌య‌త్నాల‌కు ఆదిలోనే గండి కొట్ట‌డ‌మే ల‌క్ష్యంగా … రాజ‌కీయ చాణ‌క్యుడుగా పేరున్న‌ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు.. ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ కార్య‌క్ర‌మానికి తెర లేపారు. ఫ‌లితంగా.. కొద్దిరోజుల్లోనే వైసీపీనుంచి మూడో వంతు శాస‌న‌స‌భ్యులు కారునొదిలి సైకిల్ ఎక్కేశారు. మ‌రోప‌క్క బీజేపీ ఎంతగా ఎదురుచూసినా.. ప్ర‌జాద‌ర‌ణ ఉన్న‌ నాణ్య‌మైన నాయ‌కులెవ‌రూ.. ఆ పార్టీ వైపు క‌న్నెత్తికూడా చూడ‌లేదు. ఇంత‌వ‌ర‌కూ చంద్ర‌బాబు పొలిటిక‌ల్ గేమ్ ఎదురు లేకుండా సాగింద‌నే చెప్పాలి.

ఆ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ విప‌రిణామాలు ఒక్క‌టొక్క‌టిగా ఇప్పుడు అధికార పార్టీ అధినేత‌కు అనుభ‌వంలోకి వ‌స్తున్నాయి. వైసీపీనుంచి ఎమ్మెల్యేలుగా గెలిచి.. ఇప్పుడు టీడీపీ గూటికి చేరిన నాయ‌కుల‌తో స్థానిక టీడీపీ నేత‌ల‌కు ఏమాత్రం పొస‌గ‌డంలేదు. ఎక్క‌డిక‌క్క‌డ‌.. వీరి మ‌ధ్య విభేదాలు భ‌గ్గుమంటున్నాయి.  పార్టీకి త‌ల‌నొప్పిగా మారిన వీరి గొడ‌వ‌ల‌ను అదుపు చేయ‌డం ఎలాగో తెలియ‌క చంద్ర‌బాబు సైతం ప్ర‌స్తుతం త‌ల‌ప‌ట్టుకుంటున్న‌ట్టు తెలుస్తోంది.

ప్ర‌కాశం జిల్లాలో పార్టీ సీనియ‌ర్ నేత క‌ర‌ణం బ‌ల‌రామ‌కృష్ణ‌మూర్తి, ఇటీవ‌లే వైసీపీ నుంచి టీడీపీలో చేరిన గొట్టిపాటి ర‌వికుమార్ కుటుంబాల మ‌ధ్య ద‌శాబ్దాల వైర‌ముంది. ఒకే గూటికి చేరినా వీరి మ‌ధ్య విభేదాలు ఏ మాత్రం త‌గ్గ‌లేదు స‌రిక‌దా.. మ‌రింత పెచ్చ‌రిల్లుతున్నాయి. దీనిపై ఇటీవ‌ల ఆ జిల్లాలో బ‌హిరంగంగానే.. కర‌ణంకు సీఎం చంద్ర‌బాబు మాట‌ల‌తో చుర‌కలు వేసిన సంగ‌తి తెలిసిందే. అయినా ఈ జిల్లాలో ప‌రిస్థితి ఇప్ప‌ట్లో మారేలా ఏమాత్రం క‌నిపించ‌డంలేదు.

ఇక క‌ర్నూల్లో  వైసీపీతో విభేదించి టీడీపీలో చేరిన‌ ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ శిల్పామోహన్‌రెడ్డి వర్గాల మధ్య విభేదాలు ర‌చ్చ‌కెక్కి ప్ర‌స్తుతం తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఇక్క‌డ పార్టీ రెండు వ‌ర్గాలుగా చీలిపోయి ఒకరిపై ఒకరు మాటల తూటాలు విసురుకుంటూ పార్టీ ప‌రువును బ‌జారుకీడుస్తున్నారు.  జనచైతన్య యాత్రలే వేదిక‌గా… భూమా తొలి సభ నుంచే శిల్పాపై విమర్శల దాడికి దిగగా, శిల్పామోహ‌న‌రెడ్డికూడా స‌హ‌నం న‌శించి ఎదురుదాడికి దిగారు.  ఇక్క‌డ భూమాకు మద్దతుగా వైస్‌ చైర్మన్‌ గంగిశెట్టి విజయ్‌కుమార్, శిల్పాకు మద్దతుగా చైర్‌పర్సన్‌ దేశం సులోచన నిలిచి ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు

ప్ర‌త్య‌ర్ఙిపార్టీ నేత‌ల‌ను మించి ఒకే ప‌క్షంలో ఉంటూ  వీరు ఒక‌రిపై ఒక‌రు చేసుకుంటున్న ఆరోప‌ణ‌లు పార్టీకి తీవ్ర న‌ష్టం క‌లిగించే స్థాయికి చేరాయి. వీరు ఒక‌రి వ్యాపారాల‌ను గురించి మ‌రొక‌రు ఆరోప‌ణ‌లు గుప్పిస్తూ తాము ఒకే ఒర‌లో ఇమ‌డ‌టం సాధ్య‌మ‌య్యే ప‌నికాద‌ని తేల్చేస్తున్నారు. ఇక ఉత్త‌రాంధ్ర‌లో ఇదే ర‌క‌మైన విభేదాలు కొంద‌రు నేత‌ల మ‌ధ్య కొన‌సాగుతున్న విష‌యం బ‌హిరంగ ర‌హ‌స్య‌మే.. మ‌రి ఈ ప‌రిస్థితులను టీడీపీ అధినేత ఏ ర‌కంగా అదుపులోకి తెస్తారో వేచిచూడాలి.