నాగార్జున‌కు చంద్ర‌బాబుకు గ్యాప్ ఎందుకు..!

అక్కినేని నాగార్జున ఇంట్లో త్వర‌లోనే పెళ్లి సంద‌డి మొద‌ల‌వ‌నుంది. చిన్న కొడుకు అఖిల్ నిశ్చితార్థం డేట్ ఫిక్స‌యిపోయింది. దీంతో అంద‌రినీ ఆహ్వానించే ప‌నిలో బిజీ అయిపోయాడు నాగ్‌. ఇప్ప‌టికే తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఆయ‌న స్వ‌యంగా వెళ్లి క‌లిసి ఆహ్వానించారు. ఇక‌, ఏపీ సీఎం చంద్ర‌బాబు మిగిలారు. వాస్త‌వానికి చంద్ర‌బాబుతో నాగ్‌కి అంత స‌న్నిహిత సంబంధాలు లేవు. దీంతో ఆయ‌న‌ను ఆహ్వానిస్తారా? లేదా అనేది ఉత్కంఠ‌గా మారింది. అయితే, ఏపీకి సీఎం కాబ‌ట్టి.. త‌ప్ప‌కుండా ఆహ్వానిస్తాడ‌ని స‌మాచారం. అంతేకాకుండా నాగ్‌తో వియ్యం అందుకునేది జీవీకే కాబ‌ట్టి.. ఆయ‌న‌కు ఏపీలో పెద్ద ఎత్తున కాంట్రాక్టులు ఉన్నాయి.

ఈ క్ర‌మంలో ఆయ‌న ద్వారా అయినా నాగ్ చంద్ర‌బాబుతో భేటీ అయి ఆహ్వానిస్తార‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికైతే మాత్రం నాగ్‌కి నేరుగా బాబుతో సత్సంబంధాలు మాత్రం లేవు. అదే సమయంలో ఇండ‌స్ట్రీలో నంద‌మూరి బాల‌య్య‌తోనూ నాగ్‌కి ఫ్రెండ్ షిప్ లేద‌నే చెప్పాలి. గ‌తంలో అక్క‌నేని నాగేశ్వ‌ర‌రావుకు ఓ స‌న్మానం జ‌రిగిన‌ప్పుడు అంద‌రినీ ఆహ్వానించిన నాగ్‌.. బాల‌య్య‌ను పిల‌వ‌లేద‌ట‌. దీంతో బాల‌య్య చిన్న‌బుచ్చుకున్నాడ‌ని అప్ప‌ట్లో పెద్ద టాక్‌. ఇంకో మాటేమిటంటే.. నాగేశ్వ‌ర‌రావుని బాల‌య్య బాబాయి అని సంబోధిస్తారు. మ‌రి అలాంటి సంబంధం క‌లుపుకొన్న బాల‌య్య‌ను నాగ్ పిల‌వ‌క‌పోవ‌డం పెద్ద ఎత్తున చ‌ర్చ‌కు దారితీసింది.

అయితే, త‌న త‌ప్పు తెలుసుకున్న నాగ్‌.. మ‌రుస‌టి రోజు వెళ్లి బాల‌య్య‌తో మాట్లాడి వ‌చ్చాడు అయితే, ఆ త‌ర్వాత ఏం జ‌రిగిందో తెలీదు. ఇక‌, ఇప్పుడు మాత్రం అక్కినేని వారింట పెళ్లి బాజా మోగుతున్న క్ర‌మంలో బాబును ఆహ్వానించే విష‌యం స‌ర్వ‌త్రా ఆస‌క్తిగా మారింది. బాబుకు నాగ్‌కి గ్యాప్ ఎందుకు వ‌చ్చింద‌నే టాక్ కూడా న‌డుస్తోంది. బాబు అధికారంలో లేన‌ప్పుడు వైఎస్‌తో నాగ్ స‌న్నిహితంగా ఉండ‌డ‌మే బాబు కు న‌చ్చ‌లేదా అని కూడా అనుకుంటుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఈ క్ర‌మంలో మ‌రో 20 రోజుల్లోనే నాగ్ ఇంట్లో జ‌రిగే కార్య‌క్ర‌మానికి బాబుకు ఎప్పుడు ఆహ్వానం ఇస్తారో చూడాలి.