చంద్ర‌బాబు చేతికి టీడీపీ న‌ల్ల‌ధ‌న ఎమ్మెల్యేల లిస్టు

ఏపీలో అధికార టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు భారీ గా సంపాదించేశార‌ట‌! ఇక్క‌డ రాష్ట్రంలోనూ, అక్క‌డ కేంద్రంలోనూ అధికారంలో ఉన్న‌ది తామే క‌దా అనుకున్నారో ఏమో.. తాము ఏం చేసినా అడిగేదెవ‌రు అని భావించారో ఏమో.. అడ్డ‌గోలుగా అందిన‌కాడికి దోచేశారు. ముఖ్యంగా కోస్తా జిల్లాల‌కు చెందిన 15 మంది టీడీపీ ఎమ్మెల్యేలు రెండు చేత‌లా సంపాదించేశారు. అందిన‌కాడికి అన్ని ప‌నుల్లోనూ క‌మీష‌న్లు కొట్టేశారు. బెదిరించి, దందాలు చేసి మ‌రీ బ్లాక్ మ‌నీకి పోగేసుకున్నారు. అయితే, వీరంతా ఒక్క‌సారిగా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ బ్లాక్ బ‌స్ట‌ర్‌తో విల విల లాడిపోతున్నార‌ట‌! కోట్ల‌కుకోట్లు కూడ‌బెట్టిన న‌ల్ల‌ధ‌నాన్ని ఏం చేయాలో తెలియ‌క నానా తిప్ప‌లు ప‌డుతున్నార‌ట‌.

డ‌బ్బుండి శ‌ని ప‌ట్టిందేంట్రా అనుకుంటున్నార‌ట‌. మోడీ దెబ్బ‌తో న‌ల్ల‌ధ‌నం బ‌య‌ట‌కు తీయాలంటేనే వీరు భ‌య‌ప‌డిపోతున్నారు. పోనీ.. త‌మ అనుచ‌రులు, బంధువుల‌కు ఇద్దామ‌ని భావించినా.. ఎంత ఇచ్చినా.. ఇంకా డ‌బ్బు ఎక్క‌డా త‌గ్గ‌డం లేద‌ట‌! మ‌రోప‌క్క‌, ఇంత సొమ్ము న‌మ్మి ఇస్తే.. తిరిగి ఇస్తారా? లేదా? అని కూడా త‌ల‌లు ప‌ట్టుకుంటున్నార‌ట‌. ప‌రిస్థితి ఇలా ఉంటే ఈ తెలుగు త‌మ్ముళ్ల అవినీతి దందా అధినేత చంద్ర‌బాబు దృష్టి కి వెళ్లింద‌ట‌. ఆయా ఎమ్మెల్యేలు ఎలా సంపాయించారు? అంత న‌ల్ల డ‌బ్బును ఎలా పోగేసుకున్నారు? ఎక్క‌డెక్క‌డ ఎన్నెన్ని దందాలు చేశారు? వ‌ంటి అన్ని విష‌యాల‌నూ బాబు సేక‌రిస్తున్నార‌ట‌!

వాస్త‌వానికి కోస్తాలో దాదాపు అంద‌రూ టీడీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఒక‌వేళ వైకాపా త‌ర‌ఫున గెలిచినా.. త‌ర్వాత వారంతా చంద్ర‌బాబు ఆక‌ర్ష్ మంత్రంతో టీడీపీ సైకిల్ ఎక్కారు. దీంతో ఒక‌ళ్ల మీద ఒక‌ళ్లు పోటీ ప‌డి మ‌రీ అక్ర‌మ సంపాద‌న‌కు పోగేశార‌ట‌. నియోజకవర్గంలో పనిచేయాలంటే కమిషన్లే.. ఒక్క రాష్ట్రప్రభుత్వ పనులే కాదు.. చివరకు రైల్వే కాంట్రాక్టర్లను కూడా వారు వదిలిపెట్టలేదు. రియల్ ఎస్టేట్ వ్యవహారాలలో వేలుపెట్టారు. బెదిరించి మరీ కమిషన్లు మింగారు. అన్నదమ్ముల మధ్య వచ్చిన ఆస్తి తగాదాలను కూడా క్యాష్‌ చేసుకున్నారు. అన్నదమ్ములకు చెరి కాస్త ముట్టచెప్పి అసలు ఆస్తిని కూడా రాయించేసుకున్న ఘనులు కూడా ఉన్నార‌ట‌.

ముఖ్యంగా ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టిన ఉచిత ఇసుక ఈ ఎమ్మెల్యేల‌కు కోట్లు కురిపించింద‌ట‌. ఇలా అన్నింటిలోనూ వేలుపెట్టి రెండు చేతులా సంపాదించిన కొంతమంది కోస్తాజిల్లాల ఎమ్మెల్యేల పాపం ఇప్పుడు ప్ర‌ధాని మోడీ నిర్ణ‌యంతో పండింద‌ట‌!! ఈ న‌ల్ల డ‌బ్బును బ‌య‌ట‌కు తీస్తే.. పీక‌ల మీద‌కి రావ‌డం ఖాయ‌మ‌ని తెలియ‌డంతో వారు త‌మ‌లో తామే ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నార‌ట‌. పోనీ.. బంగారం కొందామా? అంటే.. దానిపై కేంద్రం నిఘా పెట్టింది. దీంతో ఈ న‌ల్ల‌బ‌కాసురుల‌కు నిద్ర ప‌ట్ట‌డం లేద‌ట‌. ప్ర‌ధాని మోడీ అన్న‌ట్టు నిద్ర కోసం మాత్ర‌లు సైతం మింగుతున్నార‌ట‌.

ఈ ఎమ్మెల్యేల వద్ద నోట్లకట్టలు మూలుగుతున్నాయన్న సంగతి గూఢచారి వర్గాల ద్వారా చంద్రబాబు వరకూ వెళ్లింది. ఆదాయపు పన్నుశాఖ అధికారులు నిఘా వేస్తారని తెలియడంతో ఆ ఎమ్మెల్యేలు కిక్కురుమనడం లేదు. మ‌రి అవినీతిని స‌హించ‌ను అని పెద్ద ఎత్తున ప‌దే ప‌దే చెప్పే.. బాబు ఇప్పుడు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో వేచి చూడాలి!!