కేసీఆర్ బ్లాక్ మ‌నీతో జీతాలు ఇచ్చారా..!

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ తీసుకున్న పెద్ద నోట్ల ర‌ద్దు నిర్ణ‌యంపై తెలంగాణ ప్ర‌భుత్వం స‌హా సీఎం కేసీఆర్ తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. బ్లాక్ మ‌నీ నిరోధానికి తాము వ్య‌తిరేకం కాద‌ని, అయితే, ఈ క్ర‌మంలో మోడీ తీసుకున్న నిర్ణ‌య‌మే త‌మ ఆదాయాన్ని తీవ్ర‌స్థాయిలో దెబ్బ‌తీసింద‌ని కేసీఆర్ విమ‌ర్శించారు. లెక్క‌ల‌తో స‌హా ఆయ‌న ప‌క్కాగా విమ‌ర్శించారు. రిజిస్ట్రేష‌న్లు నిలిచిపోవ‌డం, రియ‌ల్ దెబ్బ‌తిన‌డం వంటి కార‌ణాల‌తో రాష్ట్రం ఆదాయం కోల్పోయింద‌ని, దీంతో ఉద్యోగుల‌కు జీతాలు కూడా ఇచ్చే ప‌రిస్థితి లేద‌ని కేసీఆర్ త‌న‌ మంత్రి వ‌ర్గం స‌హా ఎంపీల ద‌గ్గ‌ర కూడా వాపోయారు. అదేస‌మ‌యంలో తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు కూడా న‌ల్ల ధ‌నం ర‌ద్దు శాస్త్రీయ‌త‌ను ప్ర‌శ్నించారు.

దీనిపై స్పందించిన తెలంగాణ క‌మ‌లం పార్టీ మాజీ అధ్య‌క్షుడు, ఎమ్మెల్యే జీ కిష‌న్‌రెడ్డి ఇటు సీఎం కేసీఆర్‌, అటు టీ కాంగ్రెస్ నేత‌ల‌పైనా విరుచుకుప‌డ్డారు. అంతేకాదు, అధికార ప‌క్షం డైల‌మాలో ప‌డేలా కిష‌న్ దూకుడు పెంచారు. పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేస్తే.. జీతాలు ఇచ్చేందుకు డ‌బ్బులు లేవంటున్నారంటే.. ఇంత‌కాలం.. బ్లాక్ మ‌నీతోనే జీతాలు ఇచ్చారా? అని కేసీఆర్‌కు క్వ‌శ్చ‌న్ సంధించారు. నల్లధనంతో జరిగే లావా దేవీలతోనే ప్రభుత్వం నడుస్తున్నట్టుగా వ్యవహరిస్తున్నారని తీవ్ర‌స్థాయిలో దుయ్య‌బ‌ట్టారు. పెద్ద నోట్ల ర‌ద్దు విష‌యంలో ప్ర‌జ‌లంతా మోడీని దేవుడి మాదిరిగా భావిస్తున్నార‌ని అన్న కిష‌న్‌.. ఈ విష‌యంలో కేసీఆర్ రెండు నాలుక‌ల ధోర‌ణిని అవ‌లంబిస్తున్నార‌న్నారు.

పెద్ద నోట్ల ర‌ద్దుతో జ‌నాలు పెద్ద ఎత్తున త‌మ కార్పొరేష‌న్ బిల్లులు, ఆస్తిప‌న్నులు, బ‌కాయిలు చెల్లిస్తున్నార‌ని, ఫ‌లితంగా జీహెచ్ ఎంసీకి భారీస్థాయ‌లో ఆదాయం స‌మ‌కూరింద‌ని ఒక ప‌క్క అధికారులు వెల్ల‌డిస్తున్న విష‌యాన్ని కిష‌న్ చెప్పారు. అయితే, దీనికి విరుద్ధంగా ప్ర‌భుత్వం ప్ర‌క‌ట‌న‌లు ఉన్నాయ‌ని ఆయ‌న విమ‌ర్శించారు. నోట్ల రద్దు వల్ల ప్రభుత్వ ఆదాయం పెరిగిందని, తగ్గినట్టు అబద్ధాలు ప్రచారం చేయడం మంచిదికాదన్నారు. ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం, వృథా ఖర్చులు, ఆడంబరాల కోసం ఖజానాను కొల్లగొట్టిన కేసీఆర్.. తన అసమర్థతను ప్రధాని మోదీపై నెట్టడానికి యత్నిస్తున్నాడని విమర్శించారు. అదేస‌మ‌యంలో పెద్ద నోట్ల ర‌ద్దుపై కాంగ్రెస్ చేస్తున్న విమ‌ర్శ‌ల‌ను కూడా కిష‌న్ కొట్టిపారేశారు. బ్లాక్ మ‌నీని ఎలా మార్చుకోవాలో తెలియ‌క కాంగ్రెస్ నేత‌లు త‌లలు ప‌ట్టుకుంటున్నార‌ని, అందుకే ఇలాంటి విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని అన్నారు.