ఆ మంత్రికి – లోకేష్‌కు భారీ గ్యాప్‌

ఏపీ మంత్రుల్లో కొంద‌రి అవినీతి, బంధుప్రీతి వంటివి తార స్థాయికి చేరాయ‌ని పెద్ద ఎత్తున వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలోనే విద్యాశాఖ మంత్రిగా ఉన్న గంటా శ్రీనివాస‌రావుపైనా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. మొన్న‌టికి మొన్న విశాఖ అవ‌స‌రాల‌కు స్థ‌లాలు కేటాయించేందుకు స‌సేమిరా అన్న అధికారులు మంత్రి గంటా ఒత్తిడితో ఫిలింన‌గ‌ర్ సొసైటీకి విశాఖ‌లో స్థ‌లాలు కేటాయించారు. ఇది పెద్ద ఎత్తున వివాదానికి దారితీసింది. కేవ‌లం త‌న కుమారుడి టాలీవుడ్ ప్ర‌మోష‌న్‌లో భాగంగా గంటా ఇలా చేశార‌ని టాక్ వ‌చ్చింది. ఇక దీనికి ముందు కూడా విద్యాశాఖ‌లో చేప‌ట్టిన అనేక కార్య‌క్ర‌మాలు ఆయ‌న‌కు ల‌బ్ధి చేకూర్చాయ‌నే వార్త‌లు వ‌చ్చాయి.

 ఈ క్ర‌మంలో ఆయా ఫిర్యాదులు టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేష్ వ‌ర‌కు వెళ్లాయ‌ని స‌మాచారం. దీంతోనే లోకేష్.. మంత్రి గంటాను దూరం పెడుతున్నార‌ని తెలుస్తోంది. అదేస‌మ‌యంలో టీడీపీ స్థాప‌న నుంచి పార్టీలోనే ఉంటూ అవినీతి ర‌హితునిగా పేరు తెచ్చుకున్న మంత్రి అయ్య‌న్న‌ను లోకేష్ ప్రోత్స‌హిస్తున్నార‌ని కూడా వార్త‌లు వ‌స్తున్నాయి. ఇదిలావుంటే, అవినీతి ఆరోప‌ణ‌లు భారీస్థాయిలో వస్తుండ‌డంతో త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో మంత్రి గంటాకు ఉద్వాస‌న ప‌ల‌కాల‌ని సీఎం చంద్ర‌బాబు డిసైడ్ అయ్యార‌ట‌. ఈ క్ర‌మంలో ఆయ‌న కూడిక‌లు, తీసివేత‌ల‌పై పెద్ద ఎత్తున క‌స‌ర‌త్తు కూడా ముమ్మ‌రం చేశార‌ని తెలిసింది.

దీంతో ఈ విష‌యంపై స‌మ‌చారం అందుకున్న గంటా వియ్యంకుడు, ప‌ట్ట‌ణాభివృద్ధి మంత్రి నారాయ‌ణ రంగంలోకి దిగార‌ని తెలిసింది. వాస్త‌వానికి ఈయ‌న సీఎం చంద్ర‌బాబుకి రైట్ హ్యాండ్‌గా ఉంటున్నారు. రాజ‌ధాని నిర్మాణంలో కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న సీఎంతో భేటీ అయి.. గంటా ఉద్వాస‌నపై చ‌ర్చించార‌ని తెలుస్తోంది. మ‌రోప‌క్క‌, గంటా కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన నేత కావ‌డం, ఈ వ‌ర్గానికి చంద్ర‌బాబుపై ఒకింత అస‌హ‌నం ఉండ‌డం  వంటి కార‌ణాలే మ‌ళ్లీ గంటాపై సీఎం చంద్ర‌బాబు పున‌రాలోచించేలా చేస్తున్నాయ‌ని స‌మాచారం.

 కాపు సామాజిక వ‌ర్గానికి రిజ‌ర్వేష‌న్ క‌ల్పిస్తామ‌ని ఎన్నిక‌ల‌కు ముందు సీఎం హామీ ఇచ్చిన నేప‌థ్యంలో దాని సాధ‌న కోసం ప‌ట్టుబ‌ట్టిన కాపు నేత ముద్ర‌గ‌డ ఈ నెల లో పాద‌యాత్ర‌కు సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ క్ర‌మంలో అదే సామాజిక వ‌ర్గానికి చెందిన గంటాను తొలిగిస్తే.. ప‌రిస్థితి మ‌రింత యాంటీగా మారుతుంద‌ని చంద్ర‌బాబు యోచిస్తున్నార‌ట‌. సో.. ప్ర‌స్తుతానికి గంటా విష‌యంలో ఈ విష‌యాలు భారీగా ప‌నిచేస్తున్నాయ‌ని తెలుస్తోంది. అయితే, ముక్కుసూటిగా వ్య‌వ‌హ‌రించే చంద్ర‌బాబు.. రాబోయే రోజుల్లో ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో వేచి చూడాలి.