చంద్ర‌బాబు ఫ్రెండ్ అప్పుల అప్పారావ్ అయ్యాడా..!

స‌రిగ్గా  ద‌శాబ్ద కాలం క్రితం… భ‌విష్య‌త్తు మీద ఎన్నో ఆశ‌ల‌తో  మౌలిక వ‌స‌తుల ప్రాజెక్టుల‌పై  పోటీప‌డి మ‌రీ.. దూకుడుగా పెట్టుబ‌డులు కుమ్మ‌రించిన ఇన్‌ఫ్రా కంపెనీలు వ్యాపారం అనుకున్న‌ట్టు లేక‌పోవ‌డంతో ఇప్పుడు పీక‌ల్లోతు అప్పుల్లో మునిగిపోయాయి. ప్ర‌త్యేకంగా చెప్పుకోవ‌ల‌సిందేమిటంటే ఈ ఇన్‌ఫ్రా మేజ‌ర్ కంపెనీల్లో అధిక శాతం తెలుగు రాష్ట్రాల‌కు చెందిన వ్యాపార వేత్త‌ల‌వే.

వీరిలో కావూరి సాంబశివరావు , ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్‌,  నామా నాగేశ్వరరావు వంటి మాజీ ఎంపీలు కూడా ఉన్నారు. వీరి కంపెనీలు ప్ర‌స్తుతం బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు చెల్లించలేక వీధిన పడుతున్నాయి. భారీ ఎత్తున వీరి కంపెనీలు చేపట్టిన ప్రాజెక్టులు సకాలంలో పూర్తికాక  అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. రుణాల విషయంలో బ్యాంకులు – ఆర్థిక సంస్థలు గట్టిగా వ్యవహరిస్తుండడంతో ఈ నేత‌ల‌కు సంబంధించిన కంపెనీల‌న్నీ ప్ర‌స్తుతం.. ఆర్థిక సమస్యలతో విలవిలలాడుతున్నాయి.

కావూరి కుటుంబానికి చెందిన ప్రోగ్రెసివ్ క‌న‌స్ట్ర‌క్ష‌న్స్‌,, ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్‌కు చెందిన ల్యాంకో వంటి వ్యాపార సామ్రాజ్యాలు ఇప్ప‌టికే క‌ష్ట‌కాలంలో ఉండ‌గా.. ఇప్పుడు ఖమ్మం మాజీ ఎంపీ – టీడీపీ నేత నామా నాగేశ్వరరావు కూడా అప్పుల అప్పారావయ్యారు. ఎంపీగా ఉన్న సమయంలో ఎడాపెడా అనుమతులు తెచ్చుకుని చేపట్టిన ప్రాజెక్టులన్నీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా ఉండడంతో బిల్లులు అందక… మరోవైపు తీసుకున్న అప్పులు తీర్చలేక నామా చిక్కుల్లో పడ్డారు.

నామా నాగేశ్వరరావుకు చెందిన మధుకాన్ గ్రూపు దేశ‌వ్యాప్తంగా అనేక ఇన్ ఫ్రా ప్రాజెక్టులను చేపట్టింది.  అయితే ఈ కంపెనీకి కూడా ప్ర‌స్తుతం ఆర్థిక ఇబ్బందులు త‌ప్ప‌డంలేద‌ని తెలుస్తోంది. టీడీపీ అనుకూల ప్రభుత్వమే ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నా కూడా నామాకు కష్టాలు తప్పలేదట‌. పర్యావరణ అనుమతులు సకాలంలో రాకపోవడంతో నామాకు చెందిన కంపెనీ నిర్వ‌హిస్తున్న‌… పవర్ – రోడ్ ప్రాజెక్టులు కొన్ని ముందుకు కదలడంలేదు. వీటి కోసం సుమారు 20 బ్యాంకులు – ఆర్థిక సంస్థల నుంచి నామా రుణాలు తీసుకున్నారు. ఇప్పుడు వాటికి తిరిగి చెల్లింపులు చేయ‌లేక‌పోవ‌డంతో టాటా క్యాపిటల్ – యూనియన్ బ్యాంకు – ఐడీబీఐ – ఎస్బీఐలు కోర్టు మెట్లెక్కినట్టు స‌మాచారం..

ఈ కంపెనీ వ్యవహారంలో బ్యాంకులు ఆస్తుల స్వాధీనం వరకు వెళ్లినట్లు తెలుస్తోంది. మధుకాన్ సంస్థకు అడ్మినిస్ట్రేటివ్ భవనంగా ఉన్న ఢిల్లీలోని ఆయన ఇంటిని స్వాధీనం చేసుకునేందుకు నోటీసులు సైతం వచ్చినట్లు తెలుస్తోంది. అయితే… మధుకాన్ ఎండీగా ఉన్న నామా నాగేశ్వరరావు తమ్ముడు సీతయ్య పేరిట ఈ నోటీసులు జారీ అయ్యాయి.  మొత్తానికి తెలుగు రాష్ట్రాల రాజ‌కీయాల‌ను ధ‌న‌బ‌లంతో శాసించిన  ఈ వ్యాప‌రవేత్త‌ల‌కు ప్ర‌స్తుతం క‌ష్టకాలం న‌డుస్తోంద‌నే చెప్పుకోవాలి మ‌రి.