అమ‌రావ‌తిలో స్పీడ్ యాక్సెస్ క‌థేంటో తెలుసా

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిని ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత న‌గ‌రాల్లో ఒక‌టిగా చేయాల‌ని సీఎం చంద్ర‌బాబు భావిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఆయ‌న రాజ‌ధాని నిర్మాణం విష‌యంలో ప‌క్కాగా ముందుకు పోతున్నారు. ముఖ్యంగా ప్ర‌భుత్వం లోటు బ‌డ్జెట్‌లో ఉన్న నేప‌థ్యంలో రాజ‌ధాని అభివృద్ధి చెందాలంటే.. పెట్టుబ‌డులు అవ‌స‌ర‌మ‌వుతాయి. అయితే, ఈ పెట్టుబ‌డులు రావాలంటే రాజ‌ధాని ప్రాంతంలో మౌలిక స‌దుపాయాలు బాగుండాలి. వాటిలో ముఖ్యంగా రోడ్ల వ్య‌వ‌స్థ బాగుంటేనే విదేశాల నుంచి పెట్టుబ‌డుల వ‌ర్షం కురుస్తుంది. దీనిని గ‌తంలోనే గుర్తించిన చంద్ర‌బాబు హైద‌రాబాద్‌లోని హైటెక్ సిటీ రోడ్ల‌ను పెద్ద ఎత్తున ప‌టిష్టంగా నిర్మించారు. ఫ‌లితంగా అక్క‌డ అనేక విదేశీ కంపెనీలు కొలువుదీరాయి. ఇప్పుడు ఇదే ప్లాన్‌ను అమ‌రావ‌తిలోనూ ఆయ‌న అమ‌లు చేస్తున్నారు.

అమ‌రావ‌తిలోని అన్ని గ్రామాల‌నూ క‌లుపుతూ.. ఎంత వేగాన్న‌యినా త‌ట్టుకోగ‌లిగే, భ‌ద్ర‌త‌గా ఉండే రోడ్ల‌ను నిర్మిస్తున్నారు. అంతేకాదు, ఈ ఒక్క‌రోడ్డు మీద ప్ర‌యాణించ‌డం ద్వారా మొత్తం రాజ‌ధాని ప్రాంతాన్ని చుట్టివ‌చ్చే ఛాన్స్ ఉంటుంది. మొత్తం 215 కోట్ల‌తో ఈ స్పీడ్ యాక్సెస్ రోడ్డుకు చంద్ర‌బాబు రూప‌క‌ల్ప‌న చేశారు. ఇప్ప‌టికే ప‌నులు కూడా ప్రారంభ‌మ‌య్యాయి. నాగార్జున క‌న్‌స్ట్ర‌క్ష‌న్ కంపెనీ ఈ ర‌హ‌దారిని ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తోంది. రాజ‌ధాని ప్రారంభ‌మ‌య్యే ఉండ‌వ‌ల్లి నుంచి రాజ‌ధాని చివ‌రి ప్రాంతం దొండ‌పాడు వ‌ర‌కు ఈ రోడ్‌ను నిర్మిస్తున్నారు.

ఉండ‌వ‌ల్లి, పెనుమాక‌, తాళ్లాయ‌పాలెం, పెనుమాక‌, ఉద్దండ‌రాయ‌పాలెం, లింగాయ‌పాలెం, అబ్బురాజుపాలెం, రాయ‌పూడి, దొండ‌పాడుల వ‌ర‌కు ఈ రోడ్డును నిర్మిస్తున్నారు. కృష్ణాన‌ది క‌ర‌క‌ట్ట‌కు స‌మాంత‌రంగా క‌ర‌క‌ట్ట నుంచి 1500 మీటర్ల దూరంలో దీనిని నిర్మిస్తున్నారు. వ‌చ్చే ఏడాది ఏప్రిల్ నాటికి పూర్త‌వుతుంద‌ని భావిస్తున్న ఈ ర‌హ‌దారి మొత్తం దూరం 18.27 కిలో మీట‌ర్లు. ప్ర‌స్తుతానికి నాలుగు వ‌రుస‌లుగా నిర్మించే ఈ అతిపెద్ద ర‌హ‌దారి.. చంద్ర‌బాబు క‌ల‌ల‌కు అనుగుణంగా త‌యార‌వుతోంది. ఇంకుడుగుంతల టైపులో రోడ్డు మార్జిన్ల‌లో ఇంకుడు ప్లాంట్ల‌ను ఏర్పాటు చేస్తున్నారు.

దీనివ‌ల్ల ఎంత పెద్ద వ‌ర్షం వ‌చ్చినా.. రోడ్డుపై చుక్క కూడా నీరు నిలిచే ఛాన్స్ ఉండ‌దు. అంతా కూడా రోడ్డు మార్జిన్ల‌లోని ఇంకుడు ప్రాంతాల్లోకి వెళ్లిపోయింది. దీంతో భూగ‌ర్భ జ‌ల‌మ‌ట్టం పెరిగేందుకు ఈ రోడ్డు ఉప‌యోగ‌ప‌డుతుంది. అదేవిధంగా భ‌విష్య‌త్తు అవ‌స‌రాల‌ను బ‌ట్టి రోడ్డును విస్త‌రించుకునేలా కూడా ప్లాన్ సిద్ధం చేశారు. మొత్తానికి స్థానికుల‌ను స‌హా విదేశీయుల‌ను సైతం ఈ రోడ్డు అమితంగా ఆక‌ర్షిస్తుంద‌ని భావిస్తున్నారు. ఇక్క‌డ మ‌రో విశేషం ఏంటంటే.. ఈ రోడ్డుకు ఎక్క‌డా మ‌లుపులు ఉండ‌వు! దీంతో ఈ రోడ్డు ఎక్కితేచాలు .. ర‌య్య్ మంటూ ఎలాంటి అవాంత‌రం లేకుండా రాజ‌ధానిని చుట్టిరావొచ్చు. ఇదే స్పీడ్ యాక్సెస్ రోడ్డు.