లోకేష్‌కు చంద్ర‌బాబు షాక్ త‌ప్ప‌దా..!

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఏ ప‌ని చేసినా.. ప‌ర్య‌వ‌సానాలపై ఒక‌టికి ప‌దిసార్లు ఆలోచించి మ‌రీ అడుగు ముందుకు వేస్తారు.  ఆయ‌న కొన్ని ముఖ్య విష‌యాల్లో తొంద‌ర‌గా నిర్ణ‌యం తీసుకోలేర‌ని వ్యాఖ్య‌లు వినిపించినా.. దాని వెనుక ఆయ‌న తీసుకునే జాగ్ర‌త్త‌లు దాగి ఉంటాయ‌ని గుర్తుంచుకోవాలి.  చంద్ర‌బాబు సుదీర్ఘ‌ రాజ‌కీయ‌ప్ర‌యాణంలో ఈ వైఖ‌రితో ఆయ‌న మంచి ఫ‌లితాలనే సాధించ‌గ‌లిగార‌న్న‌ది రాజ‌కీయ విశ్లేష‌కుల్లో అత్య‌ధికుల అభిప్రాయం. తాజాగా  లోకేష్‌ను మంత్రివ‌ర్గంలోకి తీసుకోవాల‌న్న డిమాండ్  పార్టీ వ‌ర్గాల‌నుంచి గ‌ట్టిగా వ‌చ్చినా చంద్ర‌బాబు అందుకు సుముఖంగా లేర‌ని తేలిపోయిన‌ట్టు విశ్వ‌స‌నీయ స‌మాచారం.

పార్టీలో ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌ద‌వినిచ్చిత‌న‌యుడికి రాజ‌కీయ శిక్ష‌ణ ఇస్తున్న‌చంద్ర‌బాబు… ప్ర‌స్తుతానికి లోకేష్‌ను ప్ర‌భుత్వ‌ ప‌ద‌వుల‌కు దూ రంగా ఉంచ‌డ‌మే మేల‌ని గ‌ట్టి నిర్ణ‌య‌మే తీసుకున్నార‌ట‌. ఈ విష‌యంలో కుటుంబ వ‌త్తిడిని కూడా చంద్ర‌బాబు ఏమాత్రం లెక్క చేయ‌లేద‌ని తెలుస్తోంది. వైఎస్ పాల‌న‌లో జ‌గ‌న్ వ్య‌వ‌హారాల‌పైనా, ప్ర‌స్తుతం తెలంగాణ‌లో కేసీఆర్ కుటుంబ పాల‌న‌పైనా తీవ్రంగా విమ‌ర్శిస్తూ వ‌స్తున్న‌టీడీపీ ఇప్పుడు లోకేష్‌కు మంత్రి ప‌ద‌వినివ్వ‌డం ద్వారా… వారిని విమ‌ర్శించే నైతిక మ‌ద్ద‌తు కోల్పోతుంద‌ని చంద్ర‌బాబు భావిస్తున్నార‌ట‌.  ఈ అంశం పైనే అలిగిన లోకేష్ పార్టీ శిక్ష‌ణ శిబిరానికి తొలి రెండు రోజులు రాలేద‌ని పార్టీవ‌ర్గాల స‌మాచారం.

అయితే ..భుజం నొప్పి కార‌ణంగానే రెండురోజులు స‌మావేశాల‌కు రాలేక‌పోయాన‌ని మూడోరోజు శిక్ష‌ణ శిబిరానికి హాజ‌రై  తేల్చేసిన‌ చినబాబు కూడా చివ‌ర‌కు తండ్రి నిర్ణ‌య‌మే స‌రైన‌ద‌ని డిసైడైపోయార‌ట‌.  అందుకే స్వ‌యంగా పార్టీలో ఒక వ్య‌క్తికి ఒకే ప‌ద‌వి అన్న‌ది పార్టీ విధాన‌మ‌ని త‌న నోటితోనే వెల్ల‌డించార‌న్న‌మాట‌. దీంతో త‌న అనుయాయుల దూకుడును, త‌న అజెండాపై వ‌స్తున్న ఊహ‌గానాల‌ను నిరోధించాల‌న్న‌ది లోకేష్ ప్ర‌య‌త్నంగా తెలుస్తోంది.

సహజంగానే  ఒక వ్య‌క్తికి ఒకే ప‌ద‌వి అనే సూత్రం.. పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు వ‌ర్తించ‌దు. ఆయ‌న పార్టీకి జాతీయ అధ్యక్షుడిగాను, ముఖ్యమంత్రిగానూ కూడా ఉంటారు. లోకేష్‌తోపాటు మిగిలిన‌ అందరికీ ఈ విధానం వర్తించేట్లయితే.. పార్టీలో కీలక బాధ్యతల్లో ఉన్న‌వారికి మంత్రి ప‌ద‌వుల భాగ్యం లేన‌ట్టే. మొత్తానికి కుటుంబ పాల‌న ముద్ర ప‌డ‌కుండా చంద్ర‌బాబు తీసుకుంటున్న జాగ్ర‌త్త‌లు ఏ మేర‌కు స‌త్ఫ‌లితాలు ఇస్తాయో వేచి చూడాల్సిందే.