తెలంగాణ నేత‌లు త‌లో దిక్కుకు పోయారు

దాదాపు 60 ఏళ్ల క‌ల సాకారంలో భాగంగా.. తెలంగాణలో కొత్త‌ జిల్లాల ఏర్పాటు.. నేత‌ల‌కు కేరాఫ్ లేకుండా చేసింద‌ట‌! ఇంత‌కుముందు నేత‌ల పేర్లు చెబితే జిల్లాలు, లేదా జిల్లాల పేర్లు చెబితే నేత‌లు చ‌టుక్కున గుర్తొచ్చేవారు. కానీ ఇప్పుడు లెక్క‌కు మిక్కిలి జిల్లాల ఏర్పాటుతో నేత‌ల జిల్లాల స్వ‌రూపం మారిపోయింది. ఒక్కొక్క నేత ప‌రిధి ఒకటికి మించి రెండు మూడు జిల్లాల‌కు చేరిపోయింది దీంతో నేత‌లు త‌లో దిక్కుకు పోయిన‌ట్టు అనిపిస్తోంద‌ట‌! ఫ‌లితంగా ఇప్పుడు తాము ఏజిల్లాకు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నాం అనే విష‌యంలో వారు తీవ్ర గంద‌ర‌గోళానికి గుర‌వుతున్నార‌ట‌.

సాక్షాత్తూ సీఎం కేసీఆర్ విష‌యానికి వ‌స్తే.. ఈయ‌న మెద‌క్ జిల్లా గ‌జ్వేల్ నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. అయితే, మెద‌క్ ఇప్పుడు రెండు జిల్లాలుగా అయిపోయింది. మెద‌క హెడ్ క్వార్ట‌ర్‌గా మెద‌క్ జిల్లా, సిద్దిపేట జిల్లా ఇలా రెండుగా విడిపోయింది. దీంతో గ‌జ్వేల్ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని గజ్వేల్, తూఫ్రాన్, కొండపాక, వర్గల్, ములుగు, జగదేవ్‌పూర్ మండ‌లాలు అటు మెద‌క్‌, ఇటు సిద్దిపేట జిల్లాల్లో ఉన్నాయి. దీంతో సీఎం కేసీఆర్ జిల్లా ఏద‌ని చెప్పాలి? ఆయ‌న రెండు జిల్లాల‌కు చెందిన నేత‌గా ఉంటారు. ఈ ప‌రిస్థితి ఒక్క కేసీఆర్‌కే కాదు… దాదాపు నేత‌లంద‌రికీ వ‌ర్తిస్తోంద‌ట‌!కొంద‌రైతే.. రెండు కాదు మూడు జిల్లాల ప‌రిధిలోకి వెళ్లిపోయార‌ట‌.

ముఖ్యంగా విప‌క్ష కాంగ్రెస్‌కు చెందిన కాక‌లు తీరిన ఎమ్మెల్యేల ప‌రిస్థితీ దీనికి భిన్నంగా ఏమీ లేద‌ని వినిపిస్తోంది. వాళ్ల వాళ్ల నియోజ‌క‌వ‌ర్గాలు ఒక జిల్లా ప‌రిధి నుంచి రెండు, మూడు జిల్లాల‌కు మారింద‌ట‌. దీంతో నేత‌లు ల‌బోదిబో మంటున్నారు. గ‌తంలో ఒక జిల్లాలో ఉన్న‌ప్పుడు త‌మ మాట‌కు ఎదురు లేకుండా పాలిటిక్స్ చేసిన నేత‌లు.. ఇప్ప‌డు రెండు జిల్లాల్లో ఎలా చేయాలో అర్థం కాక త‌లలు ప‌ట్టుకుంటున్నార‌ట‌! కాంగ్రెస్ సీనియర్ నేతలు, మాజీ మంత్రులు.గీతారెడ్డి, డీకే అరుణ ప‌రిస్థితి దీనికి విరుద్ధంగా ఏమీలేద‌ట‌.

ఇక‌, పీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న జ‌హీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం కూడా రెండు  జిల్లాల ప‌రిధిలోకి వెళ్లింది. అటు సంగారెడ్డి, ఇటు కొత్త‌గా ఏర్ప‌డిన జ‌హీరాబాద్ జిల్లాల ప‌రిధిలో ఉంద‌ట‌. దీంతో ఉత్త‌మ్ కు కేరాఫ్ లేకుండా పోయింద‌ట‌. అలాగే, టీడీపీ నుంచి జంప్ చేసి కేసీఆర్ కారెక్కిన ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర‌రావు ప‌రిస్థితి మ‌రీ దారుణంగా ఉంద‌ట‌. ఆయ‌న ఏకంగా జనగామ, వరంగల్ రూరల్, మహబూబాబాద్‌లకు ప్రాతినిధ్యం వహించాల్సి వ‌స్తోంద‌ట‌.

సో.. తెలంగాణ‌లో కొత్త జిల్లాల ఏర్పాటుతో కొత్త నాయ‌క‌త్వం పుట్టుకొచ్చి.. పాలిటిక్స్ మ‌రింత‌గా షార్ప్ అవుతాయ‌ని అంటున్న కేసీఆర్ మాటేమిటో గానీ, ప్ర‌స్తుతం ఉన్న త‌మ‌కు కేరాఫ్ లేకుండా పోయింద‌ని అటు అధికార టీఆర్ ఎస్‌, ఇటు కాంగ్రెస్‌, టీడీపీ నేత‌లు తెగ ఫీలైపోతున్నారు. అయితే, ఎన్నిక‌లు రావ‌డానికి మ‌రో రెండేళ్ల స‌మ‌యం ఉంది కావ‌ట్టి అప్ప‌టిలోగా కుదురుకునే అవ‌కాశం ఉంటుంద‌నేది రాజ‌కీయ విశ్లేష‌కుల మాట‌.