తెలంగాణ‌లో 34వ జిల్లా కోసం మ‌రో ఎమ్మెల్యే దీక్ష‌

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు జిల్లాల ఏర్పాటు త‌ల‌నొప్పి ఇప్పుడిప్పుడే వ‌ద‌లేలాలేదు! ఏ టైం చూసుకుని ఆయ‌న జిల్లాల ప్ర‌క‌టన చేశారో కానీ, ఆయ‌న‌కు ఇంటా బ‌య‌టా కూడా పెద్ద ఎత్తున త‌ల‌నొప్పి ప్రారంభ‌మైంది. త‌మ‌కు జిల్లా కావాలంటే త‌మ‌కు కావాలంటూ అధికార పార్టీ టీఆర్ఎస్ స‌హా విప‌క్ష కాంగ్రెస్ నేత‌లు రోడ్ల మీద‌కి వ‌చ్చి పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లు చేప‌ట్టారు. గ‌ద్వాల్ ఎమ్మెల్యే డీకే అరుణ త‌న ప‌ద‌వికి రాజీనామా అస్త్రం సంధించారు. దీంతో దిగివ‌చ్చిన కేసీఆర్ ఇక‌, ఈ విష‌యంలో ప‌ట్టుద‌ల‌గా ఉంటే లాభం లేద‌ని భావించి కొరుకున్న వాళ్ల‌కి కోరుకున్న జిల్లా అని ప్ర‌క‌టించేశారు. ఈ క్ర‌మంలో తాను గ‌డిచిన నాలుగు నెల‌లుగా వ్య‌తిరేకిస్తున్న జ‌న‌గామ‌, సిరిసిల్ల‌, ఆసిఫాబాద్‌, గ‌ద్వాల‌ల‌ను జిల్లాలు చేసేందుకు ప‌చ్చ‌జెండా ఊపారు.

ఇంత‌టితో ఈ స‌మ‌స్య స‌మ‌సి పోతుంద‌ని ఆయ‌న భావించారు. అయితే, ఇక్క‌డే మ‌రో త‌ల‌నొప్పి మొద‌లైంది. గ‌ద్వాల్ ఎమ్మెల్యే డీకే బాట‌లో న‌డిచైనా స‌రే జిల్లాలు సాధించుకోవాల‌ని కొంద‌రు ఎమ్మెల్యేలు సిద్ధ‌మైపోయారు. ఈ క్ర‌మంలో మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా నారాయ‌ణ‌పేట టీఆర్ ఎస్‌ ఎమ్మెల్యే రాజేంద‌ర్ రెడ్డి.. త‌న ప్రాంతాన్ని జిల్లాగా ప్ర‌క‌టించాల‌ని డిమాండ్ చేస్తున్నారు. కేసీఆర్ త‌న డిమాండ్‌కు ఒప్పుకోక‌పోతే నిరాహార దీక్ష‌కు దిగుతాన‌ని ప్ర‌క‌టించి సంచ‌ల‌నం రేపారు. ఇక‌, కేసీఆర్ మంత్రివ‌ర్గంలో ఉన్న వరంగ‌ల్ జిల్లాకు చెందిన మంత్రి చందూలాల్ కూడా తన నియోజకవర్గం ములుగు కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

దీంతో తొలుత ఫిక్స‌యిన‌ట్టు 31 కాదు 33 జిల్లాలు చేయాల్సి వ‌స్తుంద‌ని అధికార యంత్రాగం భావిస్తున్న త‌రుణంలో తామేం త‌క్కువ తిన్నామంటూ.. కామ్రెడ్లు కూడా జిల్లాల పోరులో ఎర్ర‌జెండా ఎగ‌రేశారు. ‘‘అంతగా ప్రాధాన్యం లేని ప్రాంతాలను జిల్లా కేంద్రాలుగా ప్రకటిస్తున్న నేపథ్యంలో ఎంతో ప్రాధాన్యం ఉన్న భద్రాచలం నియోజకవర్గాన్ని జిల్లాగా ఎందుకు ప్రకటించకూడదు. . భద్రాద్రిని జిల్లాగా ప్రకటించండి’’ అంటూ.. భద్రాద్రి ఏజెన్సీ వాసులు ముక్తకంఠంతో డిమాండ్‌ చేస్తున్నారని భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య తాజాగా త‌న డిమాండ్ ను బ‌య‌ట పెట్టారు.

అంత‌టితో ఆగ‌ని ఆయ‌న .. ‘ప్రజలు ఎలా చెప్తే.. అలా చేస్తాం’ అని చెప్పే సీఎం కేసీఆర్.. భద్రాచలం వాసుల కోరికను ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. భద్రచాలం నియోజకవర్గాన్ని జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ.. గురువారం నుంచి తాను ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్నట్లు ప్ర‌క‌టించారు. సో… సున్నం తాజా డిమాండ్ నేప‌థ్యంలో కేసీఆర్ ఏం చేస్తారో చూడాలి. సున్నం డిమాండ్‌ను ఒప్పుకుంటే.. తెలంగాణలో 34 జిల్లాల‌ను ఖ‌చ్చితంగా ఏర్పాటు చేయాల్సిన ప‌రిస్థితి వ‌స్తుంద‌ని అధికారులు అంటున్నారు. ఇదిలావుంటే, జిల్లాల ఏర్పాటుకు గ‌డువు తీరేలోగా.. మ‌రెన్ని కొత్త డిమాండ్లు బ‌య‌ట‌కు వ‌స్తాయో? ఇంకెంత‌మంది దీక్ష‌ల‌కు దిగుతామ‌ని బెదిరిస్తారో చూడాలి!