ఏపీ టీడీపీ నేత‌ల పూజ‌లు ఎందుకో..!

ఇప్పుడు ఏపీలో ఏ ప్ర‌ముఖ దేవాల‌యంలో చూసినా.. చంద్ర‌బాబు కేబినెట్‌లోని మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలే క‌నిపిస్తున్నారు! ఇది జోక్ కాదు నిజ‌మే! అయితే, వారు దేవుడి మీద భ‌క్తి ఉండి వెళ్తున్నారా?  లేక వాళ్ల మ‌న‌సులో ఉన్న కోరిక తీర్చ‌మ‌ని అడిగేందుకు వెళ్తున్నారా?  లేక త‌మకున్న ప‌ద‌వీ గండం త‌ప్పించ‌మ‌ని కోరేందుకు వెళ్తున్నారా? అంటే మాత్రం ఒక్కొక్క‌ళ్ల‌ది ఒక్కో కోరిక అని చెప్ప‌క త‌ప్ప‌దు. సీఎం చంద్ర‌బాబు త‌న మంత్రి వ‌ర్గాన్ని విస్త‌రిస్తాన‌ని గ‌తంలోనే ప్ర‌క‌టించారు. అయితే, దీనికి ఇంకా ముహూర్తం పెట్ట‌లేదు. అయితే, కొంద‌రిచ్చిన స‌మాచారం మాత్రం ద‌స‌రా నాడు చంద్ర‌బాబు కేబినెట్‌ను విస్త‌రిస్తార‌ని తెలుస్తోంది. అయితే, కొందరు మాత్రం త్వ‌ర‌లోనే మునిసిప‌ల్ ఎన్నిక‌లు ఉన్నాయ‌ని అవి కూడా ముగిశాక అప్పుడు విస్త‌ర‌ణ ఉంటుంద‌ని చెబుతున్నారు.

ఈ క్ర‌మంలో ఇప్పుడు టీడీపీ ఆశావ‌హ ఎమ్మెల్యేలు స‌హా తమ ప‌ద‌వుల‌కు గండం ఏర్ప‌డింద‌ని భావిస్తున్న మంత్రులు గుళ్లు గోపురాల చుట్టూ తిరుగుతున్నారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో ఏగుళ్లో చూసిన ద‌స‌రా ఉత్స‌వాలు చేస్తున్నారు. దీంతో మంత్రులు, ఎమ్మెల్యేలు త‌మ మ‌న‌సులోని కోరిక తీర్చాలంటూ ఆయా ఆల‌యాల‌కు క్యూక‌డుతున్నారు. ఇక‌, వీరితోపాటు వైకాపా నుంచి జంప్ చేసి టీడీపీ సైకిల్ ఎక్కిన మ‌రికొంద‌రు ఎమ్మెల్యేలు కూడా బాబు త‌మ‌కు ఛాన్స్ ఇస్తార‌ని భావిస్తూ.. త‌మ ప్ర‌య‌త్నాల్లో తాము ఉన్నారు. క‌ర్నూలుకు చెందిన భూమా నాగిరెడ్డి, విజ‌య‌వాడ‌కు చెందిన జ‌లీల్‌ఖాన్‌, తూర్పుగోదావ‌రికి చెందిన జ్యోతుల నెహ్రూ వంటి వారు కేబినెట్ సీటు కోసం ఎదురు చూస్తున్నారు.

దీంతో వీరు కూడా త‌మ త‌మ దేవుళ్ల‌కు మొక్క‌లు చెల్లించుకుంటున్నారంట‌. ఇదిలావుంటే, తెలంగాణ‌లో జంపు చేసి కారెక్కిన ఎమ్మెల్యేల‌కు సుప్రీంకోర్టు గండం ప‌ట్టుకోవ‌డంతో ఏపీలో జంపింగ్ జిలానీల‌కు కూడా జ్వరం ప‌ట్టుకుంద‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలో   తెలంగాణ బూచిని చూపించి మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌కు బాబు నో అంటాడేమో అనే అనుమానాలు త‌లెత్తుతున్నాయి.

త‌మ‌కు ఆశ‌లు రేపిన చంద్ర‌బాబు చివ‌ర‌కు తూచ్ అంటాడేమోన‌ని ఆశావ‌హులు హ‌డ‌లిపోతున్నారు. మ‌రోవైపు చిన‌బాబు లోకేష్‌కి ఒక్క‌డికే మంత్రి ప‌ద‌వి ఇచ్చి మిగిలిన ఆశావ‌హుల‌కు చంద్ర‌బాబు చెయ్యిస్తాడేమోనని మ‌రికొంద‌రు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఏపీ కేబినెట్ విస్త‌ర‌ణ అంశం స‌ర్వ‌త్రా ఆస‌క్తిగా మారింది. ఏం జ‌రుగుతుందోన‌ని విశ్లేష‌కులు సైతం ఎదురు చూస్తున్నారు. మ‌రి టీడీపీ నేత‌ల పూజ‌లు ఫ‌లిస్తాయో లేదో చూడాలి.