త‌న తండ్రిని చంపిన‌వారి కోసం న‌యీమ్‌తో మాజీ మంత్రి దోస్తీ!

దాదాపు రెండు నెల‌ల కింద‌ట తెలంగాణ పోలీసుల చేతిలో దారుణంగా హ‌త‌మైన గ్యాంగ్ స్ట‌ర్ నయీముద్దీన్ అలియాస్ న‌యీమ్‌తో కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో మంత్రిగా ప‌నిచేసిన దుద్దిళ్ల శ్రీధ‌ర్‌బాబు చ‌ట్టాప‌ట్టాలేసుకుని, భుజం భుజం రాసుకుని తిరిగారా? త‌న తండ్రి, కాంగ్రెస్ సీనియ‌ర్ నేత దుద్దిళ్ల శ్రీపాద‌రావును దారుణంగా హ‌త్య చేసిన వారిపై క‌క్ష తీర్చుకునేందుకు శ్రీధ‌ర్‌.. న‌యీమ్‌తో చేతులు క‌లిపారా? గ‌్యాంగ్ స్ట‌ర్ క‌నుస‌న్న‌ల్లో మెలిగి.. ఇటు త‌న క‌క్ష‌ను తీర్చుకుంటూ.. అటు న‌యీమ్‌కి స‌హ‌క‌రించారా? అంటే ఔన‌నే చెబుతున్నారు తెలంగాణ‌లోని పెద్దపల్లి జిల్లా మంథని ఎమ్మెల్యే పుట్ట మధు! న‌యీమ్‌తో శ్రీధ‌ర్‌బాబు చెట్టాప‌ట్టాలేసుకుని తిరిగినట్టు త‌న వ‌ద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయ‌ని ఆయ‌న వెల్ల‌డిస్తున్నారు.

మంథ‌నిలో మీడియాతో మాట్లాడిన మ‌ధు.. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ స్పీకర్, శ్రీధ‌ర్ బాబు తండ్రి శ్రీపాదరావు హత్య కేసులో సంబంధాలు ఉన్న వ్యక్తులను హతమార్చేందుకు నయీమ్‌తో  శ్రీధర్ బాబు దోస్తీ చేశారని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఈ క్రమంలోనే, మాజీ మావోయిస్టు జడల నాగరాజు ఆచూకీ లేకుండా పోయాడని తెలిపారు. దీని వెనుక శ్రీధ‌ర్‌బాబు హ‌స్తం ఉంద‌ని విమ‌ర్శించారు. దీనిపై విచార‌ణ జ‌రిపిస్తే.. అస‌లు నిజాలు వెలుగులోకి వ‌స్తాయ‌ని చెప్పారు. ఈ విష‌యంలో స‌హ‌క‌రించేందుకు తాను పూర్తిగా సిద్ధంగా ఉన్నాన‌ని చెప్పిన మ‌ధు.. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్, డీజీపీ అనురాగ్ శర్మకు ఫిర్యాదు చేస్తానన్నారు.

కాగా, మ‌ధు ఆరోప‌ణ‌ల‌ను శ్రీధ‌ర్‌బాబు కొట్టి పారేశారు. పొలిటిక‌ల్ ఇష్యూల‌ను మ‌న‌సులో పెట్టుకునే ఇలాంటి విమ‌ర్శ‌లు చేస్తున్నాడ‌ని, వీటిని ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని అన్నారు. అయితే, మ‌ధు ఆయా విష‌యాలు వెల్ల‌డించ‌డం వెనుక అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. న‌యీమ్ హ‌త‌మై కూడా దాదాపు రెండు మాసాలు పూర్త‌యింది. అదేవిధంగా ఈ కేసులో సిట్ విచార‌ణ కూడా దాదాపు కొలిక్కివ‌స్తోంది. ఈ క్ర‌మంలో ఇప్పుడు ఇంత ఆల‌స్యంగా న‌యీమ్‌తో శ్రీధ‌ర్‌బాబు చెట్టాప‌ట్టాలేసుకుని తిరిగార‌నే విష‌యాన్ని బ‌య‌ట పెట్ట‌డంలో  ఆంత‌ర్యం ఏమిట‌నేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌.

ఈ విష‌యంలో ఇప్ప‌టి వ‌ర‌కు మౌనంగా ఉండి.. ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున ఆందోళ‌న చేయ‌డం, సీఎం, డీజీపీల‌కు ఫిర్యాదు వ‌ర‌కు వెళ‌తాన‌ని మ‌ధు చెప్ప‌డం ప‌లు ప్ర‌శ్న‌ల‌కు తావిస్తోంది. మ‌రోప‌క్క‌, ఇప్ప‌టికే న‌యీమ్‌తో ప‌లువురు టీడీపీ, కాంగ్రెస్‌కి చెందిన నేత‌లు అంట‌కాగార‌నే విష‌యం వెలుగు చూసింది. వీటిలో ఎంత వ‌ర‌కు నిజానిజాలు ఉన్నాయో తెలియాలంటే కొన్నాళ్లు వెయిట్ చేయ‌క‌త‌ప్ప‌దు!