టీ కాంగ్రెస్‌లో స‌డెన్‌గా ఇంత మార్పు ఏంటో

పాలిటిక్స్‌లో ఎప్పుడు ఎలాంటి మార్పులు వ‌స్తాయో? ఎప్పుడు నేత‌లు ఎలా మార‌తారో చెప్ప‌డం క‌ష్టం! ఇప్పుడు ఇదంతా ఎందుకనుకుంటున్నారా?  తెలంగాణ కాంగ్రెస్‌లో ఇప్పుడు ఇలాంటి మార్పులే జ‌రుగుతున్నాయి మ‌రి! అందుకే ఈ స్టోరీ. టీ కాంగ్రెస్‌లో నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఒక‌రి ముఖాలు ఒక‌రు చూసుకునేందుకు సైతం సీనియ‌ర్ నేత‌లు త‌ప్పించుకుని తిరిగారు. ఇక‌, మూకుమ్మ‌డిగా అధికార పార్టీ టీఆర్ ఎస్ స‌హా సీఎం కేసీఆర్‌పై విమ‌ర్శ‌ల దండ‌యాత్ర చేద్దామ‌న్నా క‌లిసొచ్చిన నేత క‌రువ‌య్యాడు. అలాంటి ప‌రిస్థితి ఇప్పుడు ఒక్క‌సారిగా మారిపోయింద‌ట‌! నేత‌లు అంద‌రూ క‌లిసి వ‌స్తున్నార‌ట‌. స్టేట్ కాంగ్రెస్ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డికి స‌హ‌క‌రించేందుకు సిద్ధ‌మ‌య్యార‌ట‌. మ‌రి ఇంత స‌డెన్‌గా ఎందుకు ఇలా జ‌రిగింద‌ని అనుకుంటున్నారా? అక్క‌డే ఉంది ట్విస్టంతా!

టీ కాంగ్రెస్ అధ్య‌క్ష ప‌ద‌విని చేప‌ట్టిన ఉత్త‌మ్ కుమార్ రెడ్డికి మొద‌ట్లో అంతా యాంటీ ఎట్మాస్ఫియ‌రే క‌నిపించింది. ఎక్క‌డ బై పోల్స్‌లో పోటీ చేసినా ఎదురు దెబ్బలే త‌గిలాయి. దీంతో అంద‌రూ ఉత్త‌మ్‌పై ప‌రోక్షంగా, ప్ర‌త్య‌క్షంగా విరుచుకుప‌డ్డారు. ఇక‌, కేసీఆర్ ఆక‌ర్ష్ దెబ్బ‌కి కాంగ్రెస్ నేత‌లు క్యూ క‌ట్టి మ‌రీ కారెక్కేశారు. వాళ్ల‌ని నిలువ‌రింప చేయ‌డంలోనూ ఉత్త‌మ్ ఉత్త‌ర కుమారుడిపాత్ర పోషించార‌ని పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలో ఉత్త‌మ్ లీడ‌ర్ షిప్ బాగోలేద‌ని పెద్ద ఎత్తున ఆందోళ‌న బ‌య‌లుదేరింది. విషయాన్ని కొంద‌రు సీనియ‌ర్లు కాంగ్రెస్ అధిష్టానానికి కూడా చేర‌వేశార‌ట కూడా.

అంతేకాకుండా ఉత్త‌మ్ సీటును ఆశించిన కొంద‌రు ఆయ‌న‌కు అస్స‌లు క‌లిసిరాక‌పోగా, పొగ‌పెట్టేందుకు ప్ర‌య‌త్నించారు.  ఎవ్వ‌రూ త‌న‌తో క‌లిసిరాక‌పోవ‌డం, త‌న మాట విన‌క‌పోవ‌డం, మ‌రోప‌క్క కేసీఆర్ దూకుడికి అడ్డుక‌ట్ట వేయ‌లేక‌పోవ‌డం వంటి కార‌ణాల‌తో చిర్రెత్తుకొచ్చిన ఉత్త‌మ్‌.. నా వ‌ల్ల‌కాదు మ‌హాప్ర‌భో అంటూ త‌న సీటును వ‌దులుకునేందుకు రెడీ అయిపోయారు. ఇదే విష‌యాన్ని కాంగ్రెస్ అధిష్టానానికి వివ‌రించారు కూడా. అయితే, అధిష్టానం మాత్రం ఆయ‌న‌ను మార్చేందుకు ఇష్ట‌ప‌డ‌క‌పోగా.. ఉత్త‌మ్‌ని మార్చే ప్ర‌స‌క్తి లేద‌ని గ‌ట్టి సంకేతాలే పంపించింద‌ట‌!

ఈ ప‌రిణామంతో కంగుతిన్న కాంగ్రెస్ సీనియ‌ర్లు.. ఇప్పుడు ఉత్త‌మ‌మైన ఉత్త‌మ్ బాట ప‌డుతున్నారు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఇంటికే ప‌రిమిత‌మైన కొంద‌రు పెద్ద త‌ల‌కాయ‌లు కూడా ఇప్పుడు కాంగ్రెస్ కార్యాల‌యం బాట ప‌డుతున్నారు. కేసీఆర్ పై పోరుకు రెడీ అవుతున్నారు.  ఫీజు రీయంబ‌ర్స్‌మెంట్‌, రైతు రుణ‌మాఫీ, నిజాం షుగ‌ర్స్ ప్యాక్ట‌రీ మూసివేత త‌దిత‌ర అంశాల‌పై పోరాడేందుకు రంగంలోకి దిగారు. దీంతో ఉత్త‌మ్ సేన బ‌లప‌డింది. సో.. ఇలా అధిష్టానం దెబ్బ‌కి టీ కాంగ్రెస్‌లో స‌డెన్‌గా మార్పు వ‌చ్చింద‌న్న మాట‌.