ఇలా అయితే బాబుకు సీఎం పోస్టు క‌ష్ట‌మే..!

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ఫ్యూచ‌ర్‌పై ఆశ‌లు అంత‌గా నెర‌వేరేలా క‌నిపించ‌డం లేదు! ఏపీలో రానున్న రెండు ట‌ర్మ్‌ల వ‌ర‌కు టీడీపీనే అధికారంలో ఉండాల‌ని, తానే సీఎంగా పాలించాల‌ని చంద్ర‌బాబు ప‌క్కా ప్ర‌ణాళిక‌ల‌తో ముందుకు దూసుకుపోతున్న విష‌యం తెలిసిందే. ముఖ్యంగా 2019లో ఎట్టి ప‌రిస్థితిలోనూ గెలిచి తీరాల‌నే క‌సితో ఉన్న బాబు.. దానికి త‌గిన‌ట్టుగా పార్టీని క్షేత్ర‌స్థాయి నుంచి బ‌లోపేతం చేయ‌డం, త‌న పాల‌న‌కు మెరుగులు పెట్టుకోవ‌డం, నిరంతరం ప్ర‌జ‌ల్లో ఉండేలా ఏవో ఒక కార్య‌క్ర‌మాలు రూపొందించుకోవ‌డం జ‌రుగుతున్నాయి. అయితే, ఇవి నాణేనికి ఒక‌వైపు మాత్రమే! మ‌రో ప‌క్క చూస్తే మాత్రం చంద్ర‌బాబు ఆశ‌లు అంత తేలిక‌గా నెర‌వేరేలా క‌నిపించ‌డం లేద‌నే ప‌రిస్థితి తెలుస్తోంది.

వాస్త‌వానికి త‌న పాల‌న‌పై తానే అనేక స‌ర్వేలు చేయించుకుంటుంటారు చంద్ర‌బాబు. స్వ‌యంగా త‌న ప‌నితీరు, మంత్రి వ‌ర్గం ప‌నితీరు స‌హా ఎమ్మెల్యేల ప‌నితీరుపై అంత‌ర్గ‌త స‌ర్వేలు నిర్వ‌హిస్తుంటారు. ఆయా స‌ర్వేల్లో వ‌చ్చిన ఫ‌లితాల ఆధారంగా ప‌నితీరును మెరుగుప‌చుకుంటుంటారు. ఇదే క్ర‌మంలో టీడీపీ అంతర్గ‌తంగా నిర్వ‌హించిన ఓ స‌ర్వే చంద్ర‌బాబు కు షాక్ ఇచ్చి.. మైండ్ బ్లాంక్ అయ్యేలా చేసింది. ఇప్ప‌టికిప్పుడు ఏపీలో ఎన్నిక‌లు జ‌రిగితే టీడీపీ భ‌విష్య‌త్తు ఏంట‌నే విష‌యంపై  సాగిన ఈ స‌ర్వేలో కొన్ని చేదు నిజాలు బ‌య‌ట‌ప‌డ్డాయ‌ట‌! చంద్ర‌బాబు ఆయ‌న మిత్ర‌ప‌క్షం బీజేపీకి టోకుగా 57 సీట్ల‌కు మించి రావ‌ని ఈ స‌ర్వే కుండ‌బ‌ద్ద‌లు కొట్టింది.

వాస్త‌వానికి ఈ స‌ర్వే ఎవ‌రు చేశారు? ఎందుకు చేశారు? అని ఎక్క‌డా బ‌య‌ట‌కు పొక్క‌కుండా అత్యంత జాగ్ర‌త్త‌గా కేవ‌లం చంద్ర‌బాబు ప్ర‌భుత్వ ప‌నితీరు, ఇప్పుడు ఎన్నిక‌లు వ‌స్తే మీ ఓటు ఎవ‌రికి? అనే ఈ రెండు అంశాల‌పైనే ఈ స‌ర్వే సాగిన‌ట్టు తెలిసింది. ఈ స‌ర్వేలో మొత్తంగా ప్ర‌జ‌లు చంద్ర‌బాబుపై వ్య‌తిరేక‌త‌ను వెళ్ల‌గ‌క్క‌డం విశేషం. రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాలుండ‌గా  ఇప్పుడు ఎన్నిక‌లు వ‌స్తే.. టీడీపీ, బీజేపీ కూట‌మికి కేవ‌లం 57 సీట్లే ప్ర‌జ‌లు క‌ట్ట‌బెట్ట‌నున్నార‌ని స‌ర్వే వెల్ల‌డించింది. ఈ ప‌రిణామం చంద్ర‌బాబును హ‌తాశుడిని చేసింద‌ని స‌మాచారం. కాలికి బ‌ల‌పం క‌ట్టుకుని అమ‌రావతి అభివృద్ధి కోసం తాను తిరుగుతున్నాన‌ని, ఏపీ ప్ర‌జ‌ల‌కు ఏం క‌ష్టం వ‌చ్చినా తీరుస్తున్నాన‌ని అయినా ఇలాంటి ఫ‌లితం ఏంట‌ని ఆయ‌న వాపోతున్న‌ట్టు స‌మాచారం.

అయితే, ప్ర‌జ‌ల్లో మాత్రం..  ఇచ్చిన హామీలు సరిగా అమలు చేయకపోవడం, రాజధాని అంశం పూర్తిగా గందరగోళంగా మారడం, అవినీతి తారాస్థాయికి చేరడం.. కరువు పరిస్థితులు.. ఇవన్నీ బాబు పాలనపై వ్యతిరేకతను పెంచుతున్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యం సైలెంట్ కిల్ల‌ర్ మాదిరిగా టీడీపీని ఇరుకున‌పెట్టే ప్ర‌మాదం ఉంద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. మ‌రి ఇలాంటి వాతావ‌ర‌ణ‌మే మ‌రో రెండేళ్లు కంటిన్యూ అయితే, వ‌చ్చే 2019 ఎన్నిక‌ల్లో టీడీపీ గెలుపు అంత తేలిక కాద‌నేది స్ప‌ష్ట‌మ‌వుతోంది. మ‌రి ఇలా అయితే బాబు మ‌రోసాఇ సీఎం అయ్యే ప‌రిస్థితి ఉండ‌ద‌నేది విశ్లేష‌కుల మాట‌!