ఆ ఏపీ మంత్రికి నాలుగు డీ గ్రేడ్లు

చంద్ర‌బాబు కేబినెట్‌లో కీల‌క శాఖ‌లు చూస్తున్న ఓ మ‌హిళా మంత్రి ఫ్యూచ‌ర్ క్లోజ్ అయిన‌ట్టేనా? ప‌ద‌విని అడ్డం పెట్టుకుని ఇష్టానుసారంగా వ్య‌వ‌హ‌రించిన ఫ‌లితంగా స‌ద‌రు నేత ఇక‌ ఇంటి ముఖం ప‌ట్టాల్సిందేనా?  మ‌రికొద్ది రోజుల్లో జ‌రుగుతుంద‌ని భావిస్తున్న ఏపీ కేబినెట్ విస్త‌ర‌ణ‌లో ఆ మ‌హిళా మంత్రిగారు త‌న సీటును ఖాళీ చేయాల్సిందేనా? అంటే ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. ఇటీవ‌ల టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల‌కు విజ‌య‌వాడ‌లోని కేఎల్ యూనివ‌ర్సిటీలో మూడు రోజుల‌పాటు శిక్ష‌ణ త‌ర‌గ‌తులు నిర్వ‌హించారు. రెండు రోజుల శిక్ష‌ణ త‌ర్వాత మూడో రోజు.. ఆయా ఎమ్మెల్యేలు, మంత్రులు గ‌డిచిన రెండున్న‌రేళ్ల‌లో సాగించిన ప‌నితీరు, ప్ర‌జల్లో వారికి ఉన్న ఆద‌ర‌ణ, వీరు ప్ర‌జ‌ల‌తో ఎలా ఇంట‌రాక్ట్ అవుతున్నారు వంటి అంశాల‌పై నిర్వ‌హించిన కాన్ఫిడెన్షియ‌ల్ స‌ర్వే తాలూకు ఫ‌లితాల‌ను ఎవ‌రికి వారికి వైట్ క‌వ‌ర్ల‌లో పెట్టి మ‌రీ అందించారు.

ఈ సంద‌ర్భంగా వారి వారి ప‌నితీరు ఆధారంగా గ్రేడులు కూడా కేటాయించారు. ఈ క్ర‌మంలో రాష్ట్రంలో కీల‌క శాఖ‌లు చూస్తున్న ఓ మ‌హిళా మంత్రికి కూడా వైట్ క‌వ‌ర్ అందింది. ఈ క‌వ‌ర్‌లో ఆమె ప‌నితీరు, శాఖ‌ల‌ను నిర్వ‌హించిన విధానం, ఆమెపై వ‌చ్చిన ఆరోప‌ణ‌లు, ఫిర్యాదులు స‌హా అన్నీ ఉండే స‌రికి ఒక్క‌సారిగా ఆమె ఖంగుతిన్నారు. అంతేకాదు, ఆమె చేసిన మంచి ప‌నుల క‌న్నా దందాలు, క‌మీష‌న్ల వ్య‌వ‌హారాలే ఎక్కువ‌గా క‌నిపించే స‌రికి ఉక్కిరిబిక్కిర‌య్యారు. ఇక‌, ఈ క్ర‌మంలో త‌న‌కు పార్టీ అధినేత ఎలాంటి గ్రేడ్ ఇచ్చారో చూసుకున్న ఆమె నోట మాట‌, కంటి చూపు కూడా కోల్పోయిన ప‌రిస్థితి క‌నిపించింది. ఆమెకు చంద్ర‌బాబు డీ గ్రేడ్ కేటాయించ‌డంతో ఆమె షాక్ అయిపోయార‌ట‌.

ఇక‌, ఈ డీ గ్రేడ్ కూడా ఒక‌టి కాదు.. నాలుగు డీ గ్రేడ్‌లు ఇచ్చార‌ట చంద్ర‌బాబు. వాస్త‌వానికి బాగా పనిచేసిన వారికి ‘ఎ’ గ్రేడ్‌ ఇవ్వగా, మధ్యస్తంగా పనిచేసిన వారికి ‘బి’ గ్రేడ్‌, అంతంత మాత్రం పనిచేసిన వారికి ‘సి’ గ్రేడ్‌ అధమంగా పనిచేస్తున్న వారికి ‘డి’ గ్రేడ్‌ ఇచ్చారు. మరి సదరు మంత్రిగారికి ‘నాలుగు ‘డి’ గ్రేడ్‌లు వచ్చాయట. అంతేకాదు, గత రెండున్నర సంవత్సరాలుగా ఆమె నిర్వహించిన ఆర్థిక లావాదేవీలు, బదిలీలు, పోస్టింగ్‌లు ఇతర వ్యవహారాలు దానిలో పూసగుచ్చినట్లు ఉన్నాయట. ఆ నోట్‌ను చదువుకున్న సదరు మంత్రి తన రాజకీయ భవిష్యత్‌ ముగిసినట్లేనని భావిస్తున్నారట…! మంత్రి పదవి ఎప్పుడు ఊడిపోతుందో తెలియక తెగ టెన్ష‌న్ ప‌డుతూ.. బీపీ పెంచుకున్నార‌ట‌!

త‌న సీటుకు మూడింద‌ని క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యార‌ట‌. కొస‌మెరుపేంటంటే.. ఇంత దారుణమైన గ్రేడ్ టీడీపీలో ఎవరికీ ఇవ్వలేదట. కేవలం ఆమెకు మాత్రమే ఇటువంటి గ్రేడింగ్‌ వచ్చిందట. అతిక‌ష్టం మీద రాజ‌కీయాల్లోకి వ‌చ్చినా.. చంద్ర‌బాబు ఆమెకు మంత్రి ప‌ద‌విని ఇచ్చి గౌర‌వించారు. అయితే, ఆమె మాత్రం దొరికిన ఛాన్స్‌ని ఇలా సొంతానికి వాడుకున్న ఫ‌లితంగా రేపో మాపో సీటును పోగొట్టుకోవడంతోపాటు 2019 ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యే టికెట్ పొంద‌డం కూడా క‌ష్ట‌మేన‌నే టాక్ విన‌వ‌స్తోంది. ఊరికేనే అన్నారా… చేసుకున్న వాళ్ల‌కి.. చేసుకున్నంత అని!