ఆ ఎమ్మెల్యేలు డ‌మ్మీలుగా మారారా..!

ఎవ‌రు అవున‌న్నా కాద‌న్నాఇపుడు తెలంగాణ‌కు కేసీఆర్ మ‌హారాజు.. రాష్ట్రంలో ఆయ‌న‌కు గట్టిగా ఎదురుచెప్పే సాహ‌సం మాట దేవుడెరుగు… ఆయ‌న పాల‌న‌లోని లోపాల‌ను వెదికేందుకూ ఎవ‌రికీ ధైర్యం చాలడంలేదు. ఆఖ‌రికి మీడియా సైతం ఆయ‌న అడుగుల‌కు మ‌డుగులొత్తాల్సిందే..  అవ‌స‌ర‌మైతే తెలంగాణ ప్ర‌జ‌ల సెంటిమెంటు అస్త్రాన్ని ఇప్ప‌టికీ ఎప్పుడు ఎలా వాడుకోవాలో… ఏ మోతాదులో ఉప‌యోగించాలో.. ఆయ‌నకు తెలిసినంత‌గా మ‌రెవ‌రికీ  తెలియ‌క‌పోవ‌డ‌మే కేసీఆర్ అస‌లు బ‌ల‌మ‌ని ఇక్క‌డ గుర్తించాలి.

ప్ర‌స్తుతం కేసీఆర్ ప్ర‌భుత్వంలో ఆయ‌న కుటుంబ స‌భ్యులు త‌ప్ప మిగిలిన నేత‌లంతా డ‌మ్మీలుగా మారిపోయార‌న్న‌విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. మంత్రివ‌ర్గ స‌భ్యుల‌దీ ఇదే ప‌రిస్థితైనా… ఎమ్మెల్యేల స్థితి మ‌రీ అధ్వానంగా ఉంద‌ట..   శాసనసభ్యుల మాటకు అధికారులు ఏ మాత్రం విలువ‌నివ్వ‌డంలేద‌ని, ముఖ్య‌మైన ప‌నుల్లో సైతం త‌మ‌ను ప‌క్క‌న పెడుతున్నార‌ని శాస‌న‌స‌భ్యులు వాపోతున్న‌ట్టు తెలుస్తోంది.  నియోజకవర్గంలో ఏ ఒక్క అభివృద్ధిపనులు జరగడం లేదన్న విమర్శలు… అధికార, ప్రతిపక్షపార్టీలకు చెందిన ఎమ్మెల్యేలందరినుంచీ ఒకేలా వినిపిస్తుండ‌టం ఇక్క‌డ క‌నిపిస్తున్న విచిత్రం. అయితే ఇక్క‌డ ఒక తేడా ఉంది. అధికార పార్టీ ఎమ్మ‌ల్యేలున్న చోట్ల అభివృద్ధి ప‌నులు జ‌రుగుతున్నాఆ క్రెడిట్ ప్ర‌భుత్వానికి త‌ప్ప ..త‌మ‌కు ఏ మాత్రం రావ‌డం లేద‌న్న‌ది వారి బాధ‌.

ఇక ప్రతిపక్ష ఎమ్మెల్యేల పరిస్థితి మరింత దయనీయంగా మారింద‌నే చెప్పాలి. ఆ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో  రెండేళ్లుగా  అభివృద్ధి పనులు నిలిచిపోయాయ‌న్న‌ది వారి ఆక్రోశం. నియోజకవర్గ అభివృద్ధి నిధుల కేటాయింపుల్లో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర వివక్ష ప్రదర్శిస్తోందని  ప్రతిపక్ష ఎమ్మెల్యేలు బ‌హిరంగంగానే ఆరోపిస్తున్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలున్న చోట్ల‌ అధిక మొత్తంలో నిధులు కేటాయించి విప‌క్షాలు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న‌ నియోజకవర్గాలకు నామ్‌కే వాస్తేగా  నిధులు కేటాయించి.. ప్ర‌భుత్వం చేతులు దులుపుకుంటోంద‌న్న‌ది వారి ఆవేద‌న‌.

అయితే ఇవ‌న్నీ త‌మ‌లో తాము లోపాయికారీగా చెప్పుకుని బాధ‌ప‌డ‌ట‌మే  కేసీఆర్‌ను విమ‌ర్శిస్తూ త‌వ వాయిస్‌ను  గ‌ట్టిగా వినిపించేందుకు మాత్రం ఎవ‌రికీ ధైర్యం చాలడం లేదు. ఎందుకంటే త‌న మాట‌ల‌గార‌డీతో తెలంగాణ ప్ర‌జ‌ల‌ను కేసీఆర్ ఇప్ప‌టికీ క‌ట్టిప‌డేయ గ‌లుగుతున్నారు. ఆయ‌న‌తో పెట్టుకుంటే  ప‌ర్య‌వ‌సానం ఎలా ఉంటుందో త‌న చ‌ర్య‌ల ద్వారా విప‌క్ష‌నేత‌ల‌కు ఇప్ప‌టికే రుచి చూపించారు కూడా… ఇక సొంత పార్టీ ఎమ్మెల్యేలొక లెక్కా..? మ‌ర‌దే.. ఆయ‌న మార్కు పాల‌న‌… కేసీఆరా మ‌జాకా…!