ఆ ఇద్ద‌రు మంత్రుల‌కు డీ గ్రేడ్ ఇచ్చిన బాబు

ఏపీ ప్ర‌భుత్వంలో మంత్రులు ఇప్పుడు విచిత్ర ప‌రిస్తితిలో కొట్టుమిట్టాడుతున్నారు. త‌మ‌కు తిరుగులేదు.. అని గుండెల నిండా గాలి పీల్చుకుని తిరిగిన నేత‌లు ఇప్పుడు ఒక్క‌సారిగా కుంగిపోతున్నారు. దీనంత‌టికీ కార‌ణం ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. సీఎం చంద్ర‌బాబు చేయించిన స‌ర్వేనే! ఆ స‌ర్వేలే ఇప్పుడు మంత్రులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. స‌ర్వేలో భాగంగా మంత్రుల ప‌నితీరు, ప్ర‌జ‌లు, అధికారుల‌తో ఇంట‌రాక్ష‌న్‌, స‌మీక్ష‌లు వంటి వివిధ ప‌నుల ఆధారంగా చంద్ర‌బాబు వారికి గ్రేడ్‌లు నిర్ణ‌యించారు. అధికారంలోకి వ‌చ్చి రెండున్న‌రేళ్లు పూర్త‌వుతున్న సంద‌ర్భంగా.. విజ‌య‌వాడ స‌మీపంలోని కేఎల్ యూనివ‌ర్సిటీలో ఇటీవ‌ల నిర్వ‌హించిన మూడు రోజుల పార్టీ శిక్ష‌ణా శిబిరం ముగింపు సంద‌ర్భంగా స‌ర్వే బాంబు పేల్చిన చంద్ర‌బాబు.. మంత్రులు, ఎమ్మెల్యేల‌కు క‌నీసం ఆరు పేజీల‌కు త‌క్కువ కాకుండా వారి వారి జాత‌కాల‌ను చేతిలో పెట్టార‌ట‌.

దీంతోపాటు వారికి వ‌చ్చిన గ్రేడ్‌ల‌ను కూడా పేర్కొన్నార‌ట‌. వీటిని ర‌హ‌స్యంగా చూసుకోవాల‌ని స‌మ‌చారం ఎవ‌రితోనూ పంచుకోరాద‌ని కూడా చంద్ర‌బాబు హెచ్చ‌రించారు. దీంతో మొద‌ట్లో దీనిని అంత‌గా సీరియ‌స్‌గా ప‌ట్టించుకోని మంత్రులు ఆ త‌ర్వాత నివేదిక‌లు చూసుకున్నాక హ‌డ‌లి పోయార‌ట‌. ఇప్పుడు ఈ జాబితాలో గుంటూరు కు చెందిన మంత్రులు ప్ర‌త్తిపాటి ప‌ల్లారావు, రావెల కిశోర్‌బాబులు చేరిపోయారు. వీరిద్ద‌రికీ చంద్రాబాబు డీ గ్రేడ్ క‌ట్ట‌బెట్టార‌నే ప్ర‌చారం సాగుతోంది. వాస్త‌వానికి ప‌నితీరు, ప్ర‌జ‌ల్లో ప్ర‌మోష‌న్ ఆధారంగా గ్రేడ్ ఇచ్చిన చంద్ర‌బాబు.. బాగా ప‌నిచేసిన వారికి ఏ, ఓ మాదిరి వాళ్ల‌కి బీ, ఫ‌ర్వాలేదు అనుకున్న‌వారికి సీ, నాసిర‌కం అనుకున్న‌వారికి డీ గ్రేడ్ ఇచ్చారు.

ఇప్పుడు ఈ మంత్రులు ఇద్ద‌రికీ ఇచ్చిన గ్రేడ్‌ల‌ను బ‌ట్టి వీరిని నాసిర‌కంగానే భావించాల్సి వ‌స్తోంది. రావెల త‌న‌యులే ఆయ‌న కొంప‌కు ఎస‌రు పెట్టార‌ని తెలుస్తోంది. ఓ కుమారుడు హైద‌రాబాద్‌లో ఓ మ‌హిళ చెయ్యిప‌ట్టుకోవ‌డం పెద్ద వివాదాస్ప‌ద అయింది. మ‌రో కుమారుడు గుంటూరులోని మ‌హిళా హాస్ట‌ల్లోకి అర్ధ‌రాత్రి ప్ర‌వేశించి దొరికిపోయారు. దీంతో రావెల ప‌రువు పాయే టైపు అయిపోయింది. ఆక‌, మంత్రి ప్ర‌త్తి పాటి పుల్ల‌రావు ఫ్యామిలీ పెత్త‌నం  ఎక్కువైపోయింద‌ట‌. ప్ర‌తిదానికీ అమ్మ‌గారి పెత్త‌న‌మేన‌నే స్థాయిలో చ‌ర్చించుకునే ప‌రిస్థితి వ‌చ్చిందంటే ప్ర‌త్తిపాటి స‌తీమ‌ణి వ్య‌వ‌హారం ఎలా ఉందో అర్ధ‌మ‌వుతుంది.

వీట‌న్నింటినీ స‌ర్వే ద్వారా తెప్పించుకున్న చంద్ర‌బాబు త‌న‌దైన శైలిలో వీరికి డీ గ్రేడ్ కేటాయించిన‌ట్టు తెలుస్తోంది. మ‌రో మాట ఏంటంటే.. త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌బోయే మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో వీరిద్ద‌రికీ ఉద్వాస‌న ప‌లుకుతార‌ని స‌మ‌చారం అందుతోంది. ఈ విష‌యంలో త‌న త‌ప్పులేద‌ని, ఎంత చేసుకున్న‌వారికి అంత ఫ‌లితం అనే విధంగా చంద్ర‌బాబు ఎవ‌రికి వాళ్ల‌కే తెలిసి వ‌చ్చేలా వాళ్ల త‌ప్పుల‌ను గ్రేడ్ ల రూపంలో వెలువ‌రించార‌ని చెబుతున్నారు. సో.. ఇప్పుడు ఆ ఇద్ద‌రు మంత్రులు త‌మగ్రేడ్ లు చూసుకుని బాధ‌ప‌డుతూ.. ఎప్పుడు త‌మ ప‌ద‌వికి ఎస‌రు వ‌స్తుందోన‌ని కుమిలి పోతున్నార‌ట‌!