రాజ‌మౌళికి ఇక చుక్క‌లే..!

కెరీర్లో  అప‌జ‌యం ఎలా ఉంటుందో కూడా ఎరుగ‌ని ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి. గ‌త ఏడాది.. త‌న మాస్ట‌ర్ పీస్  బాహుబ‌లి ద బిగినింగ్‌తో సినీ ప్ర‌పంచమంతా టాలీవుడ్ వైపు తిరిగి చూసేలా చేశాడీ వెండితెర మాంత్రికుడు. ప్ర‌పంచవ్యాప్తంగా సుమారు 600 కోట్ల రూపాయ‌లు కొల్ల‌గొట్టిన ఈ చిత్రంతో తెలుగు సినిమా స్థాయిని అమాంతం పెంచేశాడు. సినిమా తీయ‌డాన్ని ఒక య‌జ్ఞంలా భావించే ఇత‌డు స‌రేనంటే చాలు.. క‌లిసి సినిమా తీయ‌డానికి టాలీవుడ్ నుంచి బాలీవుడ్ నిర్మాత‌ల‌దాకా ప్ర‌స్తుతం క్యూలో నిలుచుని ఉన్నారంటే అదీ రాజ‌మౌళి స్థాయి.

ప్ర‌స్తుతం అత్యంత‌ ప్ర‌తిష్ఠాత్మ‌కంగా మ‌లుస్తున్న.. బాహుబ‌లి ది కంక్లూజ‌న్.. చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్న‌ రాజ‌మౌళి ఈ చిత్రాన్నివ‌చ్చే వేస‌వికి ప్రేక్ష‌కుల‌ముందుకు తీసుకురావాల‌న్న ప్ర‌య‌త్నంలో అహ‌ర‌హం శ్ర‌మిస్తున్నాడు. బాహుబ‌లిని క‌ట్ట‌ప్ప ఎందుకు చంపాడు..? అంటూ ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల నుంచి ఎదురైన‌  ఆస‌క్తిక‌ర‌మైన‌ ప్ర‌శ్న‌ల‌న్నింటికీ.. ఈ సినిమాలో రాజ‌మౌళి స‌మాధానం ఇవ్వ‌నున్నాడు. ప్రీ బిజినెస్‌లోనే సంచ‌ల‌నాలు సృష్టించే అవ‌కాశ‌మున్న ఈ చిత్రం భార‌తీయ వెండితెరపై కొత్త చరిత్ర‌ను లిఖించే అవ‌కాశ‌ముంద‌న్న‌ది సినీ విశ్లేష‌కుల మాట‌.

కాగా ఈ చిత్రంతో రాజ‌మౌళి రూ. 1000 కోట్ల క‌లెక్ష‌న్ల మైలురాయిపై క‌న్నేశాడ‌ని కొంద‌రు సినీ పండితులు అంటుండ‌గా… అంత‌కుమించి అస‌లు ఈ ప్రాజెక్టు త‌ర్వాత రాజ‌మౌళి ఎంచుకునే ప్రాజెక్టు ఏమిట‌నేది ఎక్కువ‌మంది మ‌దిని తొలుస్తున్న‌ప్ర‌శ్న‌.. రాజ‌మౌళి త‌దుప‌రి ప్రాజెక్టు మ‌రింత భారీగా ఉండ‌బోతోందా… లేక దాదాపు ఐదేళ్లుగా బాహుబ‌లి చిత్రీక‌ర‌ణ‌తో అలిసిపోయిన రాజ‌మౌళి రిలీఫ్ కోసం ఏదైనా చిన్న‌సినిమాను ఎంచుకుం టాడా అన్న‌ది ఆస‌క్తి క‌లిగిస్తోంది.  రాజ‌మౌళి చేతిలో ప‌డ్డాక చిన్న‌సినిమాకూడా భారీగానే మారిపోతుంద‌న్న‌ద వేరే క‌థ.

రాజ‌మౌళి త‌ర్వాతి ప్రాజెక్టుల‌కు మ‌రింత శ్ర‌మించ‌క త‌ప్పక‌పోవ‌చ్చ‌ని.. ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌ను బ‌ట్టి చెప్ప‌క‌త‌ప్ప‌దు.. ఎంత ఎదిగినా ఒదిగి ఉండ‌ట‌మే తెలిసిన రాజ‌మౌళి… త‌న విజ‌యాల వెనుక త‌న బృందంలోని స‌భ్యులంద‌రి కృషీ ఉంద‌ని చెప్పేందుకు ఎప్పుడూ వెనుకాడ‌లేదు.. సోద‌రుడు కీర‌వాణి ఇచ్చిన సంగీతం రాజ‌మౌళి సినిమాల‌ను మ‌రోస్థాయికి తీసుకెళ్ల‌డంలో ప్ర‌ధాన పాత్ర పోషించింద‌ని ఎవ‌రైనా ఒప్పుకోవాల్సిందే.. అలాగే రాజ‌మౌళి సినిమాల్లో సినిమాటోగ్రాఫ‌ర్ సెంథిల్‌, ఫైట్ మాస్ట‌ర్ పీట‌ర్ హెయిన్స్ ద‌ర్శ‌కుడి మ‌న‌సెరిగి వ‌హించే పాత్ర కూడా త‌క్కువేమీ కాదు.

అయితే రాజ‌మౌళికి వీరి స‌హాయం ఇక ఎంతో కాలం ఉండ‌క‌పోవ‌చ్చు. ఎందుకంటే కీర‌వాణి బాహుబ‌లి-2 త‌ర్వాత ఇక రిటైర్మెంట్ తీసుకుంటాన‌ని ప్ర‌క‌టించ‌గా… సెంథిల్‌, పీట‌ర్ హెయిన్స్‌లు ద‌ర్శ‌క‌త్వం వైపు అడుగులు వేయాల‌నుకుంటున్న‌ట్టు తెలుస్తోంది.. సో… రాజ‌మౌళి కొత్త టీమ్‌ను త‌యారు చేసుకోవాల్సిందేన‌న్న‌మాట‌… అయితే బెస్ట్ డైరెక్ట‌ర్ కి మ‌రో బెస్ట్ టీమ్‌ను త‌యారుచేసుకోవ‌డం అసాధ్య‌మేమీ కాద‌నుకోండి..