బాబు ఈ డ‌బ్బులు ఏ మూల‌కు ..?

ఏపీకి కేంద్రం ఇచ్చిన ప్ర‌త్యేక ప్యాకేజీతో ఉబ్బిత‌బ్బిబ్బ‌వుతున్నారు ఏపీ సీఎం చంద్ర‌బాబు. పోల‌వ‌రానికి కేంద్రం ఇబ్బడి ముబ్బ‌డిగా నిధులు ఇస్తుంద‌ని ఆయ‌న భావిస్తున్నారు. ఇప్పుడు ఇచ్చింది తీసుకుంటామ‌ని, రావాల్సిన‌వి అడుగుతామ‌ని ఆయ‌న పేర్కొటూ.. ప్యాకేజీకి రెడ్ కార్పెట్ ప‌రిచారు. అయితే, ఈ ప్యాకేజీలోగుట్టు స్టోరీ ఇప్పుడిప్పుడే బ‌య‌ట ప‌డుతోంది. తాజాగా వ‌స్తున్న మీడియా క‌థ‌నాల ప్ర‌కారం కేంద్రం ప్ర‌క‌టించిన ప్యాకేజీ ఏపీకి ఏమూల‌కూ స‌రిపోద‌నే కాకుండా.. ప్యాకేజీ పేరుతో కేంద్రం పెద్ద కుచ్చుటోపీనే పెట్టింద‌ని స‌మాచారం. నిధులు ప్ర‌క‌టించిన‌ట్టుక‌నిపిస్తున్నా.. దానిలో వాస్త‌వం లేద‌ని తెలుస్తోంది. పోల‌వ‌రం ప్రాజెక్టునే తీసుకుంటే దీనిని జాతీ య ప్రాజెక్టుగా గుర్తించ‌డంతో దీనినిర్మాణ బాధ్య‌త కేంద్రమే తీసుకుంది.

అయితే, ఇప్ప‌టికే రాష్ట్ర ప్ర‌భుత్వం రూ.1800 కోట్లు ఖ‌ర్చేచేసింది. దీనిని కేంద్రం ఇవ్వాలి. అయితే, దీనిపై ప్యాకేజీలో ఎక్క‌డా ఎలాంటి ప్ర‌క‌ట‌నా లేదు. ఇక‌, విదేశీ రుణం తెచ్చుకుని రాష్ట్ర ప్ర‌భుత్వ‌మే ప్రాజెక్టుల‌ను పూర్తి చేసుకోవాల‌ని, అయితే, అప్పుమాత్రం తాను చెల్లిస్తాన‌ని చెబుతోంది. అయితే, దీనికి ఎవ‌రు హామీ ఉండాలి? ఎంత వ‌డ్డీకి తేవాలి? అనే విష‌యాల‌పై ప్యాకేజీలో క్లారిటీలేదు. ఈ ప్రకారం మొత్తం 13 ప్రాజెక్టులను 37,770 కోట్ల ఖర్చుతో ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇందులో 26 వేల కోట్లు అప్పు చేస్తుంది. ఈ మొత్తాన్ని అయిదేళ్లలో ఏటా 5 వేల కోట్ల చొప్పున తీసుకోవాలట. పనులనుబట్టి విడుదలవుతాయి గనక ఒకేసారి 13 ప్రాజెక్టులు ప్రతిపాదించారట.

అమరావతికి సంబంధించి 4779 కోట్ల ప్రణాళికలో విదేశీ రుణం 3,324 కోట్లు కాగా ఇందులో 3324 కోట్లు అప్పు. దీంట్లో ప్రపంచ బ్యాంకు నుంచి 60 శాతం అప్పు మాత్రమేతీసుకుంటారట. కారణం దాని వడ్డీ ఎక్కువగా వుంటుందని , మరో 40శాతం ఆసియా ఇన్‌ప్రాస్ట్రక్చర్‌బ్యాంక్‌(ఎఐఐబి) నుంచి తీసుకోవాలని సంకల్పించారు.  పోలవరం ఒక్కదానికే 40వేల కోట్ల లెక్క కనిపిస్తుంటే 13 ప్రాజెక్టులకు కలిపి అదికూడా 26 వేల కోట్ల అప్పుమాత్రమే లెక్క చెబుతున్నప్పుడు వరం ఏమిటో అంత ఆనందం దేనికో అర్థం కాదు.

ఆ లెక్కన చూస్తే పోలవరం పూర్తి రాజధాని నిర్మాణం వంటివి నిజంగా వేగంగా జరిగేందుకు ఈ నిధులు ఏ మూలకు సరిపోయేట్లు? కేంద్రం ఏం బాధ్యత వహిస్తున్నట్టు? ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించే ఇవన్నీ ఒప్పుకున్నా కేంద్రం మాత్రం తన‌దైన స్టైల్లో చాలా చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంద‌ని మీడియా పేర్కొంటోంది. మ‌రి ప్యాకేజీ నిధుల‌తో చంద్ర‌బాబు ఏపీని ఎంత‌మేర‌కు డెవ‌ల‌ప్ చేస్తారో చూడాలి.