న‌డి రోడ్డుపై ఏపీ మంత్రి ప‌రుగు

అవును మీరు చ‌దివింది త‌ప్పుకాదు. నిజ‌మే! ఏపీ మంత్రి ప‌ల్లె ర‌ఘునాథ రెడ్డే.. న‌డిరోడ్డుపై చెప్పులు వ‌దిలేసి మ‌రీ.. ప‌రుగులెత్తాల్సి వ‌చ్చింద‌ట‌. అదికూడా ఆయ‌న సొంత జిల్లాలోనే ఈ ప‌రిస్థితి త‌లెత్తింద‌ట‌! మ‌రి ఆయ‌న‌కు ఆ ప‌రిస్థితి ఎందుకు వ‌చ్చిందో? ఎవ‌రు క‌ల్పించారో? అప్పుడ‌స‌లు ఏం జ‌రిగిందో? తెలుసుకోవాల‌ని ఉంటే..ఇది చ‌ద‌వ‌క త‌ప్ప‌దు. అనంత‌పురంలోని ప్ర‌భుత్వ బోధ‌నాసుప‌త్రిలో ప‌డ‌క‌ల పెంపు, సిబ్బంది నియామకాలు చేప‌ట్టాల‌న్న డిమాండ్ తో సీపీఎం నేత‌, ఎమ్మెల్సీ గేయానంద్ మూడు రోజులుగా దీక్ష చేస్తున్నారు. అయితే, గేయానంద్ దీక్ష‌ను ప్ర‌భుత్వం లైట్ తీసుకుంది. అదేవిధంగా మంత్రి ప‌ల్లె కూడా పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. దీంతో కామ్రెడ్లు అటు ప్ర‌భుత్వంపైనా ఇటు జిల్లా మంత్రి ప‌ల్లెపైనా క‌సితో ర‌గిలిపోతున్నారు.

అయితే, ఈ విష‌యాన్ని ఊహించ‌ని మంత్రి వ‌ర్యులు.. బుధ‌వారం త‌న ఇంటి నుంచి టీడీపీ కార్యాల‌యానికి ఈ దీక్ష జ‌రుగుతున్న ప్రాంతం మీదుగానే బ‌య‌ల్దేరార‌ట‌. కానీ, మంత్రి గారికోసం ఎదురు చూస్తున్న కామ్రెడ్లు మాత్రం ఈ విష‌యాన్ని ప‌సిగ‌ట్టి.. మూకుమ్మ‌డిగా మంత్రి కాన్వాయ్‌ని చుట్టుముట్టార‌ట‌. కారును చుట్టుముట్టి మంత్రికి నిర‌స‌న‌గా నినాదాలు చేశారు. ఈ క్ర‌మంలో కారు దిగిన ఆయ‌న‌పైకి వామ‌ప‌క్ష కార్య‌క‌ర్త‌లు ప్ర‌శ్నాస్త్రాలు సంధించారు. స‌ద‌రు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు చెప్ప‌లేక గేయానంద్ తోనే మాట్లాడ‌తానంటూ మంత్రి క‌దిలార‌ట‌. మూడు రోజులుగా దీక్ష చేస్తుంటే, ఇప్పుడొచ్చి ప‌ల‌క‌రిస్తామంటే కుద‌ర‌ద‌న్న ఆందోళ‌న‌కారులు మంత్రిని చుట్టుముట్టార‌ట‌.

దీంతో ప‌రిస్థితి విష‌మిస్తోంద‌ని గమ‌నించిన ప‌ల్లె… అక్క‌డి నుంచి త‌ప్పించుకునే య‌త్నం చేశార‌ట‌. ఈ క్ర‌మంలో ఆయ‌న కాలికున్న చెప్పు రోడ్డు డివైడ‌ర్ మ‌ధ్య‌లో ఇరుక్కుపోగా… చెప్పును కూడా అక్క‌డే వ‌దిలేసి మంత్రి ప‌రుగు పెట్టారు. ఇంత‌లో తేరుకున్న ఆయ‌న భ‌ద్ర‌తా సిబ్బంది.. మంత్రిగారిని మ‌రో వాహ‌నంలో అక్క‌డి నుంచి పంపేశారు. అదేస‌మ‌యంలో ఆందోళ‌న కారుల‌పై విరుచుకుప‌డ్డారు. ఏదేమైనా మంత్రి ప‌ల్లెకి సొంత జిల్లాలోనే చేదు అనుభ‌వం ఎదురు కావ‌డం ఇప్పుడు అక్క‌డ హాట్ టాపిక్‌గా మారింది.