టీడీపీ ఎమ్మెల్యే కాలేజ్‌లో నోట్ల క‌ట్ట‌లు

టీడీపీ ఎమ్మెల్యే కాలేజీలో 500 రూపాయ‌లు, 1000 రూపాయ‌ల నోట్ల క‌ట్ట‌లు కుప్ప‌లు తెప్ప‌లుగా ద‌ర్శ‌న‌మిచ్చాయి. ఎంత తోడుతుంటే అంత అన్న‌ట్టుగా తీసిన‌కొద్దీ క‌ట్ట‌లు బ‌య‌ట‌ప‌డ్డాయి.! ఆశ్చ‌ర్యంగా అనిపించినా ఇది నిజం! నిన్న‌గాక మొన్న టీడీపీ గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల రెడ్డి సంస్థ‌ల‌పై బెంగ‌ళూరులో ఐటీ అధికారులు దాడి చేశార‌నే వార్త సంచ‌ల‌నం రేపి 24 గంట‌లు కూడా గ‌డ‌వ‌క‌ముందే అదే తెలుగు దేశం పార్టీకి చెందిన చిత్తూరు ఎమ్మెల్యే డీ కే స‌త్య‌ప్ర‌భ‌(టీడీపీ సీనియ‌ర్ నేత‌, దివంగ‌త డీకే ఆదికేశ‌వుల నాయుడు భార్య‌)కు చెందిన బెంగ‌ళూరులోని వైదేహీ వైద్య క‌ళాశాలల‌పై ఐటీ(ఇన్‌కం టాక్స్‌) దాడులు చేసి లెక్క‌కు అంద‌ని, సంస్థ లెక్క‌లు చెప్ప‌ని దాదాపు 43 కోట్ల రూపాయ‌ల‌ను స్వాధీనం చేసుకోవ‌డం అటు క‌ర్ణాట‌క‌, ఇటు ఏపీల్లో తీవ్ర సంచ‌ల‌నం సృష్టించింది.

 వాస్త‌వానికి ఇంత భారీ మొత్తంలో డ‌బ్బును స్వాధీనం చేసుకోవ‌డం దేశంలో ఇది రెండో సారి. ఎక్క‌డ చూసినా డ‌బ్బు అన్న విధంగా క‌ళాశాల‌లోని ప్ర‌ధాన చాంబ‌ర్‌లో లాక్ చేసి ఉన్న ఓ గ‌దిని అధికారులు బ‌ల‌వంతంగా తెరిపించారు. ఈ గ‌దిలో పెద్ద పెద్ద బాక్సుల్లో ప్యాకింగ్ చేసిన నోట్ల క‌ట్ట‌లు వెలుగు చూశాయి. తొలుత వీటిని వైద్య విద్యార్థుల ఆన్స‌ర్ ప‌త్రాలుగా క‌ళాశాల అధికారులు ఐటీ అధికారుల‌కు న‌మ్మించే ప్ర‌య‌త్నం చేశారు. అయితే, ఎందుకో అనుమానం వ‌చ్చిన అధికారులు అయితే, ఈ ప్ర‌శ్న ప‌త్రాల‌ను ఎవ‌రు చెబితే ఇక్క‌డ భ‌ద్ర ప‌రిచారంటూ ప్ర‌శ్నించడంతో పాటు వాటిలో  ఒక దానిని తెరిచే ప్ర‌య‌త్నం చేయ‌గా .. తొలుత 500 నోట్ల క‌ట్ట‌లు, ఆ త‌ర్వాత 1000 రూపాయ‌ల నోట్ల క‌ట్ట‌లు వెలుగు చూశాయ‌ని స్థానిక మీడియా విశేషంగా ప్ర‌చురించింది.

ఇదే విష‌యంపై ఢిల్లీలోని ఐటీ విభాగం హుటా హుటిన స్పందించి ఢిల్లీ నుంచి ఉన్న‌తాధికారుల‌ను బెంగ‌ళూరుకు పంపిన‌ట్టు స‌మాచారం.వీరంతా గురువారం మ‌రింత లోతుగా విచారించి వైదేహీ యాజ‌మాన్యంపై చ‌ర్య‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్నారు. వాస్త‌వానికి టీడీపీ ఎంపీగా ఉన్న స‌మ‌యంలో దివంగ‌త ఆదికేశవులు ఈ సంస్థ‌ను స్థాపించారు. వైద్య విద్య‌ర్థుల‌కు సేవ పేరుతో ఆయ‌న వైదేహీ సంస్థను నెల‌కొల్లి పేద విద్యార్థుల‌కు ఉచితంగా కూడా విద్య‌ను చేరు వ చేశారు. అలాగే, రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేశారు. అయితే, ఆయ‌న మ‌ర‌ణానంత‌రం, డీకే కుమార్తె క‌ల్ప‌జ ఈ కాలేజీని స్వాధీనం చేసుకుని నిర్వ‌హిస్తున్నారు.

ఈమె హ‌యాంలో ఎన్ ఆర్ ఐ సీట్లు స‌హా ఎంబీబీఎస్ సీట్ల‌ను కోట్ల‌కొద్దీ రూపాయ‌ల‌కు అమ్ముకున్నారు. అదేస‌మ‌యంలో ఐటీ లెక్క‌లు చూప‌కుండా బ్లాక్ మ‌నీ నిల్వ చేశారు. దీనిపై ఎప్ప‌టి నుంచో ఈ కాలేజీపై ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ క్ర‌మంలో ఐటీ దాడులు చేసి.. ఇంత భారీ మొత్తం స్వాధీనం చేసుకోవ‌డం సంచ‌ల‌నం రేపింది. ఇక‌, ఈ వేడి పొలిటిక‌ల్‌గా టీడీపీ అధినేత చంద్ర‌బాబును ఇరుకున పెట్టే ఛాన్స్ ఉంద‌ని అంటున్నారు పొలిటిక‌ల్ విశ్లేష‌కులు. మ‌రి ఏమ‌వుతుందో చూడాలి.