క‌మ్యూనిస్టుల వైభ‌వం.. గ‌త చ‌రిత్రేనా..?

ఒక‌ప్పుడు రాష్ట్రంలో క‌మ్యూనిస్టుల‌కు రాజ‌కీయంగా చెప్పుకోద‌గిన స్థాయిలో ప‌ట్టుండేది. అధికారం చేజిక్కించుకోగ‌ల స్థాయిని ఏనాడూ చేరుకోలేక పోయినా… నిరంత‌రం ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాడుతూ త‌మకంటూ కొంత ఓటు బ్యాంకును స్థిరంగా నిలుపుకోగ‌లిగేవారు. ప్ర‌ధాన పార్టీల‌తో స‌మయానుకూలంగా పొత్తుల‌తో చ‌ట్ట స‌భ‌ల్లో త‌మ ప్రాతినిధ్యం ఉండేలా.. త‌మ వాయిస్ గ‌ట్టిగా విన‌ప‌డేలా చూసుకునేవారు.

అయితే ప్రాంతీయ పార్టీల హ‌వా పెర‌గ‌డం.., వాస్త‌వ ప‌రిస్థితుల‌ను గ్ర‌హించ‌లేక పోవ‌డం.., కాలం చెల్లిన విధానాల‌ను, పిడివాదాన్ని న‌మ్ముకోవ‌డంతో క‌మ్యూనిస్టుల బ‌లం త‌రిగిపోతూ వ‌చ్చింది. దేశ‌వ్యాప్తంగానూ వామ‌ప‌క్ష‌ పార్టీల ప‌రిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీలేదు..  ద‌శాబ్దాల‌పాటు ప‌శ్చిమ బెంగాల్‌లో తిరుగులేని విధంగా అధికారం చెలాయించిన సీపీఎం వైభ‌వం నేడు చ‌రిత్ర‌కి మాత్ర‌మే ప‌రిమిత‌మైపోయింది. అక్క‌డ ఆ పార్టీ తిరిగి పుంజుకుంటుందా అన్న‌ది పెద్ద ప్ర‌శ్న‌గానే క‌నిపిస్తోంది.

ఒక‌ప్పుడు విశాలాంధ్ర కోసం పోరాడిన క‌మ్యూనిస్టులు.. తెలంగాణ పోరాటానికి మ‌ద్ద‌తివ్వ‌డంలోని సైద్దాంతిక నిబ‌ద్ధ‌త ఏమిటో జ‌నానికి ఓ ప‌ట్టాన కొరుకుడుప‌డ‌దు. సీపీఎం తాము విభ‌జ‌న‌కు వ్య‌తిరేక‌మ‌ని స‌న్నాయి నొక్కులు నొక్కినా దానిని గట్టిగా వ్య‌తిరేకించ‌నూ లేదు. అంతేకాదు.. ఏపీలో చంద్ర‌బాబును విమ‌ర్శించేందుకు ఒంటికాలిపై లేచే వామ‌ప‌క్ష నేత‌ల‌కు… తెలంగాణ‌లో కేసీఆర్‌ను ఆ స్థాయిలో విమ‌ర్శించేందుకు నోరు పెగ‌ల‌దు. దీనికి కార‌ణ‌మేమిటో వారికే తెలియాలి.

ఇక రాష్ట్రంలో అయిన‌దానికి కానిదానికి ఇత‌ర పార్టీ నేత‌ల‌పై నోరు పారేసుకుంటూ, వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేస్తూ సీపీఐ పార్టీ నేత నారాయ‌ణ త‌మ ఉనికిని కాపాడుకునేందుకు చేస్తున్న ప్ర‌య‌త్నాలు ప్ర‌జ‌ల‌కు హాస్యాన్ని మాత్ర‌మే పంచుతున్నాయి.   కాగా రాష్ట్రంలో తిరిగి బ‌ల‌ప‌డేందుకు క‌మ్యూనిస్టులు అవినీతి ముద్ర ఉన్న వైసీపీతోనూ అంట‌కాగేందుకు సిద్ధ‌మ‌వుతున్నారంటూ గతంలో వార్త‌లు వ‌చ్చాయి. అంటే ప్ర‌స్తుత రాజ‌కీయాల్లో మ‌న‌గ‌ల‌గాలంటే సిద్ధాంతాల‌తో ప‌ని లేకుండా కాస్తా కూస్తో జ‌నంలో ఉన్న‌బ‌లం ఉన్న‌పార్టీల‌తో క‌లిసి వెళ్ల‌క త‌ప్ప‌ద‌న్న స్థితికి ఆ పార్టీలు వ‌చ్చాయ‌న్న‌మాట‌.. అయితే ఇది వారి స్వ‌యంకృతాప‌రాధ‌మేన‌ని చెప్పాలి.

అయితే ఇటీవ‌ల ప‌వ‌న్ క‌ల్యాణ్ కాకినాడ స‌భ‌లో క‌మ్యూనిస్టుల‌పై సానుకూల వైఖ‌రితో మాట్లాడాక వామ‌ప‌క్ష నేత‌ల్లో కొత్త ఆశ‌లు చిగురించిన‌ట్టే క‌నిపిస్తోంది. అందుకే ప‌వ‌న్ ఎంత త్వ‌ర‌గా ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి అడుగుపెడ‌తారా… ఆయ‌నతో పొత్తు పెట్టుకుని తాము రాజ‌కీయంగా గ‌త వైభ‌వం దిశ‌గా అడుగులు వేస్తామా.. అని ఆ పార్టీ నేత‌లు ప్ర‌స్తుతం ఎదురుచూస్తున్నారు. ఒక‌ప్పుడు జాతీయ స్థాయిలో చ‌క్రం తిప్పిన వామ‌ప‌క్షాల దుస్థితి చూస్తే ఓడ‌లు బ‌ళ్లు… బ‌ళ్లు ఓడ‌లు.. సామెత గుర్తుకు వ‌స్తోంది క‌దూ..!