చంద్ర‌బాబు డైలాగ్ జోకుల‌కే పెద్ద జోకు

ఏపీ సీఎం చంద్ర‌బాబు పాల‌నా ప‌రంగా పెద్ద హిట్‌! ఈ విష‌యంలో విప‌క్ష నేత‌లు సైతం ఆఫ్ ది రికార్డ్ అంగీక‌రించే విష‌యం. ఆయ‌నెప్పుడూ సీరియ‌స్‌గానే ఉంటారు. ఆయ‌న ముఖంలో చూద్దామ‌న్నా న‌వ్వు క‌నిపించ‌దు. అలాంటి చంద్ర‌బాబు నిన్న చెప్పిన ఓ డైలాగ్‌.. పెద్ద జోక్‌గా మారిపోయింది. బుధ‌వారం నుంచి విజ‌య‌వాడ‌లో క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సు జ‌రుగుతోంది. దీనిలో అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్లు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా వారిని ఉద్దేశించి ప్ర‌సంగించిన సీఎం చంద్ర‌బాబు.. ఓ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య చేశారు. విజ‌య‌వాడ దుర్గాఘాట్‌లో ఏర్పాటు చేసిన క‌మాండ్ కంట్రోల్ రూంకి తానే చీఫ్‌న‌ని అక్క‌డి నుంచే అన్నీ ప‌ర్య‌వేక్షిస్తాన‌ని ప్ర‌క‌టించారు. దీంతో స‌ద‌స్సుకు హాజ‌రైన అధికారులు కిసుక్కున న‌వ్వుకున్నారు.

అదేంటి.. రాష్ట్రం మొత్తానికి ఈయ‌నే కదా చీఫ్‌.. మ‌రి త‌న‌ను తాను క‌మాండ్ కంట్రోల్ రూంకే ప‌రిమితం చేసుకుంటున్నారేంటి? అని త‌మ‌లో తామే ప్ర‌శ్నించుకోవ‌డం క‌నిపించింది. వాస్త‌వానికి క‌మాండ్ కంట్రోల్ రూం అనేది పోలీస్ విభాగానికి సంబంధించిన విష‌యం. రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లు స‌హా ప‌లు విష‌యాల‌ను నియంత్రించ‌డం కోసం పోలీసులు ఈ రూంను ఏర్పాటు చేసుకుంటారు. ఇదే క్ర‌మంలో ఏపీలోనూ క‌మాండ్ కంట్రోల్ రూం ఏర్పాటైంది. ఇది కృష్ణా పుష్క‌రాల స‌మ‌యంలో గ్రేట్ స‌ర్వీస్ చేసింది. దీనికిబాగానే గుర్తింపు కూడా వ‌చ్చింది. దీంతో చంద్ర‌బాబు ప‌లు మార్లు ఈ క‌మాండ్ కంట్రోల్ రూంకి వెళ్లి.. పుష్క‌ర ఘాట్ల‌లో ప‌రిస్థితుల‌ను స‌మీక్షించారు.

అక్క‌డి నుంచే అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు. మీడియా స‌మావేశం కూడా నిర్వ‌హించారు. ఇంత వ‌ర‌కు బాగానేఉంది. అయితే, బుధ‌వారం క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సులో మాత్రం ఆ క‌మాండ్ కంట్రోల్‌కి తానే చీఫ్‌న‌ని ప్ర‌క‌టించుకుని పెద్ద జోక్ సృష్టించారు. దీనిపై క‌లెక్ల‌ర్ల‌లో పెద్ద ఎత్తున చ‌ర్చ‌సాగిన‌ట్టు స‌మాచారం. బాధ్యతను పంచి..పర్యవేక్షణ చేయాలి కానీ…ఎవరికీ  పేరు రాకూడదు…అన్నీ తానే చేయాలనే తపనతో చంద్ర‌బాబు చేస్తున్న రూలింగ్‌ గాడితప్పుతోందని..పెట్టాల్సిన వాటిపై కాకుండా ఫోకస్ పక్కదారి పడుతోందని వారు చర్చించుకుంటుండ‌డం గ‌మ‌నార్హం. మొత్తానికి చంద్ర‌బాబు చెప్పిన డైలాగ్ పెద్ద జోకై హ‌ల్‌చ‌ల్ చేసింది.