జగన్‌ పట్టువదలని విక్రమార్కుడు.

ప్రత్యేక హోదా రాదని కేంద్రం స్పష్టంగా పేర్కొన్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కూడా ప్యాకేజీతో సరిపెట్టుకున్నప్పటికీ, ప్రతిపక్షం వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు పార్టీ మాత్రం ససేమిరా అంటోంది. ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేననే నినాదంతో ఆంధ్రప్రదేశ్‌ అంతటా వైఎస్‌ జగన్‌ పోరాటాన్ని ఉధృతం చేస్తున్నారు. ముందుగా యువతలో ప్రత్యేక హోదాపై చైతన్యం కలిగిస్తున్నారాయన. ఓ వైపు పార్టీ వేదికలపైనా, ఇంకో వైపు ప్రజల్లోకి వెళ్ళడం ద్వారా, ఇవి కాకుండా తన మీడియా సంస్థల ద్వారా సమాజంలోని అన్ని వర్గాల్లోనూ చైతన్యం తీసుకొచ్చేందుకు వైఎస్‌ జగన్‌ చేస్తున్న కృషి నిజగానే అభినందనీయం. అయితే ఈ సందట్లో వైఎస్‌ జగన్‌, తాను ముఖ్యమంత్రి కావాలనుకుంటున్న విషయాన్ని తన మద్దతుదారులతో చెప్పిస్తుండడమే కొంచెం అభ్యంతరకరంగా ఉంది.

రాజకీయ నాయకులు రాజకీయాలే చేస్తారుగానీ, దానికీ ఓ సందర్భం, సమయం ఉంటాయి. ప్రత్యేక హోదా ఆవశ్యకత మీదనే జగన్‌ దృష్టిపెడితే, చిత్తశుద్ధిగల నాయకుడిగా మన్ననలు అందుకుంటారు. లేదూ, ముఖ్యమంత్రి పదవి కావాలనే ఉద్దేశ్యాన్ని పదే పదే బహిర్గతం చేస్తే మాత్రం ప్రత్యేక హోదా ఉద్యమం నీరుగారిపోతుంది. దానికి ఆయనే బాధ్యత వహించవలసి ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుని ఎండగట్టే క్రమంలో జగన్‌, ఎక్కువగా చంద్రబాబు మీద ఫోకస్‌ పెడుతుండడమూ శోచనీయమే. ఇక్కడ టార్గెట్‌ చేయాల్సింది ప్రధాని నరేంద్రమోడీని మాత్రమే. ఏదేమైనా పట్టువదలని విక్రమార్కుడిలా జగన్‌ చేస్తున్న పోరాటాన్ని అభినందించకుండా ఉండలేం.