కేసీఆర్ వాళ్ల ప‌ని ప‌డ‌తార‌ట‌

అవును. నిజ‌మే! తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పుడు మంచి ఫైర్ మీదున్నారు. గ‌త నాలుగురోజుల కింద‌ట కురిసిన వ‌ర్షాల‌తో భాగ్య‌న‌గ‌రం మునిగిపోయింది. దీంతో ఉమ్మ‌డి రాజ‌ధాని ప్రాంతంలోని ప‌లు లోత‌ట్టు ప్రాంతాలు స‌హా కొన్ని అపార్టు మెంట్ల‌లోకి భారీ ఎత్తున వ‌రద చేసింది. ప‌లు ప్రాంతాల్లో ప్ర‌జ‌లు నిరాశ్ర‌యుల‌య్యారు. వారి కొద్దిపాటి దుస్తులు, బియ్యం వంటివి నీటికి కొట్టుకుపోయాయి. దీంతో ఆస‌రాలేక నానాతిప్ప‌లుప‌డ్డారు. అయితే, అదే స‌మ‌యంలో కొంద‌రు తాము ఓట్లు వేసి ఎన్నుకున్న కార్పొరేట‌ర్లు ఏం చేస్తున్నారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. వాస్త‌వానికి వ‌ర్షాలు, భూకంపం వంటి ప్ర‌కృతి వైప‌రీత్యాలు సంభ‌వించిన‌ప్పుడు ప్ర‌భుత్వం క‌న్నా ముందే స్థానిక కార్పొరేట‌ర్లు రంగంలోకి దిగి బాధితుల‌ను ఉదారంగా ఆదుకోవాలి.

అయితే, హైద‌రాబాద్ అల్ల‌క‌ల్లోలం అయిపోయిన‌ప్ప‌టికీ.. ఏ ఒక్క కార్పొరేట‌ర్ కూడా ప్ర‌జ‌ల‌ను ప‌ల‌క‌రించేల‌దు. ముఖ్యంగా జీహెచ్ ఎంసీ ఎన్నిక‌ల్లో గెలిచిన కార్పొరేట‌ర్ల‌లో అధిక భాగం టీఆర్ ఎస్‌కు చెందిన వారే. గ‌తంలోటీడీపీ, కాంగ్రెస్‌ల‌లో ఉన్న‌ప్ప‌టికీ జీహెచ్ ఎంసీ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వ‌చ్చాక మాత్రం వీరంతా కారెక్కేసి, ఆ పార్టీ త‌ర‌ఫున పోటీచేసి విజ‌యం సాధించారు. దీంతో ఇప్పుడు ఆయా కార్పొరేట‌ర్ల‌పై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. భాగ్య‌న‌గ‌రం మునిగిపోతే.. ఈ కార్పొరేట‌ర్లు ఏం చేస్తున్నార‌ని ప్ర‌జ‌లు ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రోప‌క్క‌, టీఆర్ ఎస్ అధినేత‌, సీఎం కేసీఆర్ హైద‌రాబాద్ వ‌ర‌ద‌పై హుటాహుటిన స్పందించి త‌గు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు.

 అంతేకాదు.. ఢిల్లీలో ఉన్న కేసీఆర్ గంట‌కోసారి ప్ర‌భుత్వ చీఫ్ సెక్ర‌ట‌రీ, మంత్రి కేటీఆర్‌, జీహెచ్ ఎంసీ క‌మిష‌న‌ర్‌కు ఫోన్ చేసి వివ‌రాలు తెలుసుకోవ‌డంతోపాటు, వారిని ఎప్ప‌టిక‌ప్పుడు డైరెక్ట్ చేస్తూ.. . హైద‌రాబాద్ వ‌ర‌ద బాధితుల‌కు సాయం అందించాల‌ని ప్ర‌భుత్వానికి బ్యాడ్ నేమ్ రాకుండా చూడాల‌ని కోరార‌ట‌. అయితే, ఆయ‌న కుమారుడు కేటీఆర్ అయితే, దాదాపు 24 గంట‌లూ ప్ర‌జ‌ల్లోనే ఉండి, వ‌ర్షం, వ‌ర‌ద అని లెక్క‌చేయ‌కుండా.. బాధితుల‌ను ర‌క్షించే ప్ర‌య‌త్నాలు చేశారు. కానీ, ప్ర‌జ‌ల‌ను కంటికి రెప్ప‌లా చూసుకోవాల్సిన కార్పొరేట‌ర్లు మాత్రం సైడైపోయారు. కాలనీలు కాలనీలే జలదిగ్బంధంలో చిక్కుకుంటే వారికి చీమ కుట్టినట్లయినా అనిపించ‌లేదు.

 వందమంది కార్పొరేటర్ల గుంపులో కొద్దో గొప్పో సాయం చేసింది ఒకరిద్దరు కూడా లేరంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దీంతో ఆనోటా.. ఈనోటా ఈ కార్పొరేట‌ర్ల విష‌యం గులాబీ బాస్ కేసీఆర్ చెవిలో ప‌డింద‌ట‌. ఇంకేముంది! ఆయ‌న కార్పొరేట‌ర్ల‌పై చ‌ర్య‌ల‌కు దిగేందుకు రెడీ అవుతున్న‌ట్టు స‌మాచారం. ఇదే జ‌రిగితే.. కార్పొరేట్ల గుండెల్లో రైళ్లు ప‌రిగెడుతున్నాయంట‌! మ‌రి ఏం జ‌రుగుతుందో? ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటారో చూడాలి.