చంద్ర‌బాబు భజన మీడియాకే బోర్ కొట్టిస్తున్నారా

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు, ఆయ‌న పార్టీ టీడీపీకి లాయ‌ల్‌గా ఉన్న మీడియాలో ఆంధ్ర‌జ్యోతి ముఖ్య‌మైంది. పాత ఆంధ్ర‌జ్యోతి ప‌త్రికను కొనుగోలు చేయ‌డానికి ముందు నుంచి ప్ర‌స్తుత ఆంధ్ర‌జ్యోతి ఎండీ టీడీపీకి అనుకూలంగానే ఉండేవారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న హైద‌రాబాద్‌లోని జ‌ర్న‌లిస్టు కాల‌నీలో స్థ‌లాలు, రాయితీలు కూడా పొందారు. ముఖ్యంగా ఆయన ఓల్డ్ ఆంధ్ర‌జ్యోతిని కొనేందుకు చంద్ర‌బాబే మీడియేట‌ర్‌గా ఉన్నార‌నేది ఒక‌ప్ప‌టి టాక్‌. అంతేకాదు, డ‌బ్బుల విష‌యంలోనూ ఆయ‌న సాయం చేశార‌ని అంటారు అప్ప‌టి ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్టులు. దీంతో ఆంధ్ర‌జ్యోతి ప‌త్రిక‌, టీవీ రెండూ కూడా ఏపీసీఎం చంద్ర‌బాబుకు అనుకూలంగా మారిపోయాయి. 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలోను దానికి ముందు చంద్ర‌బాబు పాద‌యాత్ర చేసిన స‌మ‌యంలోనూ ఆంధ్ర‌జ్యోతి ఆయ‌న‌కు ఇచ్చిన క‌వ‌రేజీ అంతా ఇంతాకాదు. దాదాపు రెండు నుంచి మూడు పేజీల క‌థ‌నాల‌ను నిత్యం వండివార్చేది.

ఇక‌, ఇప్పుడు చంద్ర‌బాబు అధికారంలోకి వ‌చ్చాక దాదాపు ఆయ‌న‌కు ద‌శ దిశ చూపుతున్న మీడియాలో రెండో స్థానంలో ఉంద‌ని టాక్‌. చంద్ర‌బాబు ఆ రెండు ప‌త్రిక‌ల‌ను త‌ప్ప వేటినీ విశ్వ‌సించ‌ర‌ని గ‌తంలో విప‌క్షంలో ఉన్న‌ప్పుడు దివంగ‌త సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి కూడా అనేవారు. ఇక‌, ఇప్పుడు అలాంటి ఆంధ్ర‌జ్యోతి చంద్ర‌బాబు గురించి ఓ విచిత్ర‌మైన క‌థ‌నాన్ని ప్ర‌చురింది. అదేంటంటే.. చంద్ర‌బాబు ఇటీవ‌ల నిర్వ‌హిస్తున్న టెలీ కాన్ఫ‌రెన్సుల‌తో అధికారులు బెంబేలెత్తుతున్నార‌నేది దాని సారాంశం. టెలీ కాన్ఫ‌రెన్సుల‌లో స్పెష‌ల్ ఉండ‌డం లేద‌ని, పాడిందే పాడ‌రా.. అన్న‌ట్లు చంద్ర‌బాబు రింగురింగులు వేసుకుని గ‌తంలోకి వెళ్లిపోయి… ఎప్పుడో ఓల్డ్ సీడీల‌ను వెలికితీసి మ‌రీ త‌న పాల‌న‌, త‌న స్టైల్ గురించి గంట‌ల త‌ర‌బ‌డి ఫోన్ల‌లోనే వాయించేస్తూ.. అధికారుల‌ను చంపేస్తున్నార‌ని క‌థ‌నం దుయ్య‌బ‌ట్టింది.

 దీంతో అధికారులు హ‌డ‌లి పోతున్నార‌ని, టెలీ కాన్ఫ‌రెన్స్ అన‌గానే అమృతాంజ‌నం, జండూబామ్ వంటి లేప‌నాల‌తో వ‌స్తున్నార‌ని ప‌రోక్షంగా ఎద్దేవా చేసింది. అంతేకాదు, ఈ క‌థ‌నానికి బ‌లం చేకూరుస్తూ.. ప‌లువురు అధికారుల మ‌నోభావాల‌ను, మాన‌సిక బాధ‌ల‌ను సైతం వారి పేర్ల‌నుచెప్ప‌కుండా వెల్ల‌డించ‌డం నిజంగా చంద్ర‌బాబుకు మైనస్సే. వాస్త‌వానికి ఇలాంటి క‌థ‌నాలు వైకాపా అధ్య‌క్షుడి మీడియాలో వ‌చ్చి ఉంటే అంద‌రూ కొట్టిపారేసేవారు. అవ‌న్నీ.. కేవ‌లం విమ‌ర్శించ‌డానికే రాశార‌ని టీడీపీ నేత‌లు విమ‌ర్శించేవారు. కానీ, ఇప్పుడు ఈ క‌థ‌నం టీడీపీ మాన‌స పుత్రిక వంటి ప‌త్రిక‌లో రావ‌డంతో అంతా సైలెంట్ అయిపోవ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఇప్ప‌టికైనా చంద్ర‌బాబు త‌న స్టైల్ మార్చుకుంటారో లేదో చూడాలి.