కేసీఆర్ నిఘా నీడ‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

పార్టీలోను, ప్ర‌భుత్వం లోను జ‌రిగే త‌ప్పులు చూసీ చూడ‌న‌ట్టుగా వ‌దిలేస్తే రేపు అవే ప్ర‌త్య‌ర్థుల చేతిలో అస్త్రాలుగా మారే ప్ర‌మాదం ఉంద‌న్న ఆలోచ‌న‌తో కేసీఆర్ పార్టీ నేత‌ల ప‌నితీరుపై కాస్త సీరియ‌స్‌గానే దృష్టి పెట్టార‌ట‌. వాస్త‌వాలు ఎలా ఉన్నా  త‌న మాట‌ల‌తోనే క‌ళ్ల‌ముందు  సుప‌రిపాల‌న‌ను ఆవిష్క‌రింప‌జేయ‌గ‌ల టీఆర్ ఎస్ అధినేత తాజా నిర్ణ‌యం వెనుక గ‌ట్టి కార‌ణ‌మే ఉంది.

గ్యాంగ్‌స్టర్ నయూముద్దీన్‌తో పలు వురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే అంటకాగి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలే ఇటీవ‌ల వెల్లువెత్త‌డంతో… పార్టీ ప్రతిష్ఠ దెబ్బ తిన‌కుండా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పనితీరుపై తెలంగాణ ముఖ్య‌మంత్రి నిఘా పెంచిన‌ట్టు తెలుస్తోంది.  మంత్రుల‌ పీఏలు, పీఎస్‌ల పనితీరు, మంత్రుల ఛాంబ‌ర్ల‌కు ఎవరొచ్చి వెళున్నారనే దానిపై ముఖ్యమంత్రి క‌న్నేసి ఉంచాల‌ని ఆదేశాలు ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది.

అవినీతికి అస్కారం లేని పరిపాలన అందించాలన్నదే ల‌క్ష్య‌మ‌ని చెపుతున్న కేసీఆర్‌, మంత్రివర్గ సహచరులకు ఈవిషయమై ఇప్పటికే పలుమార్లు మంత్రివర్గ సమావేశాల్లో హెచ్చరికలు కూడా జారీ చేసిన‌ట్టు స‌మాచారం.  ఉపముఖ్యమంత్రి రాజయ్య ఉదంతం త‌ర్వాత‌, కేసీఆర్ మ‌రింత జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నా.. కొంద‌రు నాయ‌కుల‌ కార‌ణంగా చెడ్డ‌పేరు వ‌స్తోంద‌ని  వారి తీరు మార్చుకోవాల‌ని కేసీఆర్ గ‌ట్టిగానే చెప్పిన‌ట్టు స‌మాచారం.

కొంతమంది ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు వినిపిస్తుండడంతో వారి పనితీరు, వ్యవహారశైలిపై ముఖ్యమంత్రి వివిధ మార్గా ల ద్వారా నివేదికలు తెప్పించుకుంటున్నారు. అవినీతి ఆరోపణలు ఎదు ర్కొంటున్న ఎమ్మెల్యేల పట్ల కఠినంగా వ్యవహరించాలని గులాబీ దళపతి భావిస్తున్నారు. అవినీతి ఆరోపణలున్న ఎమ్యెల్యేల‌కు వ‌చ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్ లభించడం దాదాపు అసాధ్యమేనని పార్టీవర్గాలంటున్నాయి.