అమ‌రావ‌తి మేయ‌ర్ కోసం టీడీపీలో ఫైటింగ్‌

ఏపీ రాజధాని అమరావతి ఉన్న గుంటూరు జిల్లా కేంద్ర‌మైన గుంటూరు న‌గ‌ర పాల‌క సంస్థ ఎన్నిక‌ల వేడి అప్పుడే రాజుకుంది. ఏపీలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌కుండా ఖాళీగా ఉన్న 7 కార్పొరేష‌న్ల‌తో పాటు 4 మునిసిపాలిటీల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం వ‌చ్చే న‌వంబ‌ర్‌లో ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని డిసైడ్ అయ్యింది. ఈ మేర‌కు కోర్టులో కొన్ని మునిసిపాలిటీలు, కార్పొరేష‌న్ల విష‌యంలో ఉన్న అభ్యంత‌రాల‌ను తొల‌గించుకోనుంది.

 చంద్ర‌బాబు సైతం ఈ 11 చోట్ల ఎన్నిక‌లు జ‌రిగాకే ఈ ఎన్నిక‌ల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ప‌నితీరును బ‌ట్టే మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ చేయాల‌ని భావిస్తున్న‌ట్టు కూడా వార్త‌లు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇక రాజ‌ధాని కేంద్ర‌మైన కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఒక్క గుంటూరు న‌గ‌ర‌పాల‌క సంస్థ‌కు మాత్ర‌మే ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. గుంటూరు న‌గ‌రం రాజ‌ధాని కేంద్ర‌మైన అమ‌రావ‌తికి కేవ‌లం 20 కిలోమీట‌ర్ల దూరంలో ఉంది. దీంతో గుంటూరు మేయ‌ర్ అయ్యేవాళ్లు అమ‌రావ‌తి మేయ‌ర్ అన్నంత‌గా పాపుల‌ర్ అవ్వ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో ఇక్క‌డ పాగా వేసేందుకు అధికార టీడీపీ అప్పుడే త‌న ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసింది.

 చంద్ర‌బాబు సైతం ఈ మేర‌కు ఇప్ప‌టికే గుంటూరు టీడీపీ నాయ‌కుల‌కు ఎన్నిక‌ల‌కు రెడీ కావాల‌ని ఆదేశాలు జారీ చేసిన‌ట్టు తెలుస్తోంది. ఎన్నిక‌ల్లో గెలుపోట‌ముల సంగ‌తి ప‌క్క‌న పెడితే టీడీపీ మేయ‌ర్ ఎవ‌రు అన్న‌దానిపై ఇప్ప‌టికే పార్టీలో ర‌క‌ర‌కాల చ‌ర్చ‌లు జ‌రుగుతుండ‌డంతో పాటు ర‌క‌ర‌కాల పేర్లు లైన్లోకి వ‌చ్చాయి. మేయర్ – డిప్యూటీ మేయర్ అభ్యర్థిత్వం కోసం సామాజికవర్గాల వారీగా నేతలు చీలిపోయి రాజకీయాలను వేడెక్కిస్తున్నారు.

 టీడీపీ మేయ‌ర్ అభ్య‌ర్థిగా క‌మ్మ సామాజిక‌వ‌ర్గం నుంచి న‌ర‌సారావుపేట ఎంపీ రాయ‌పాటి సాంబ‌శివ‌రావు త‌న‌యుడు మాజీ మేయ‌ర్ రాయ‌పాటి శ్రీనివాస్ పేరు తెర‌మీద‌కు వ‌చ్చింది. ఇక ఆర్య వైశ్యులు మాత్రం మేయ‌ర్ త‌మ‌కే ఇవ్వాల‌ని ప‌ట్టుబ‌డుతున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో గుంటూరు తూర్పు నుంచి పోటీ చేసి ఓడిపోయిన మ‌ద్దాలి గిరిధ‌ర్‌రావు ఈ మేర‌కు ఇప్ప‌టికే త‌న ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు.

 ఇక గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి మాత్రం మేయ‌ర్ ప‌ద‌వి విష‌యంలో త‌న మాటే చెల్లుబాటు కావాల‌ని పంతానికి దిగుతున్నారు. ఇప్ప‌టికే ఆయ‌న చెప్పిన వ్య‌క్తికి మిర్చి యార్డు చైర్మ‌న్ ఇవ్వ‌లేద‌న్న అసంతృప్తితో ఆయ‌న ఉన్నారు. ఈ నేప‌థ్యంలో క‌నీసం మేయ‌ర్ పోస్టు అయినా తాను చెప్పిన వ్య‌క్తికి ఇప్పించుకోవాల‌ని ఆయ‌న ప‌ట్టుబ‌డుతున్నారు. తాను చెప్పిన వ్య‌క్తికి మేయ‌ర్ ప‌ద‌వి ఇస్తామంటే ఆయ‌న 50 కార్పొరేట‌ర్లును గెలిపించుకు వ‌స్తాన‌ని అధిష్టానం వ‌ద్ద ప్ర‌తిపాద‌న పెట్టిన‌ట్టు స‌మాచారం. మ‌రి ఫైన‌ల్‌గా ఎన్నిక‌ల్లో గెలుపోట‌ములు తేల‌కుండానే టీడీపీలో అప్పుడే గుంటూరు మేయ‌ర్ కోసం జ‌రుగుతున్న ఫైటింగ్ ఆస‌క్తిక‌రంగా మారింది.