సోలో క్రెడిట్‌ వైఎస్‌ జగన్‌దే

ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక హోదా బంద్‌ విజయవంతమైంది. దాదాపుగా అన్ని జిల్లాల్లోనూ ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొనడంతో వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు పార్టీ ఇంకా ఉత్సాహంగా బంద్‌ని విజయవంతం చేసింది. ముందస్తుగా పార్టీ నాయకుల్ని సమాయత్తం చేసిన వైఎస్‌ జగన్‌, ఈ బంద్‌ని సంపూర్ణంగా విజయవంతం చేసి కేంద్రానికి, ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ప్రత్యేక హోదా కోసం ఉంత ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారో తెలియజేశారు.

తద్వారా ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆవేదన కేంద్రానికి అర్థమయ్యేలా చేయడంలో వైఎస్‌ జగన్‌ విజయం సాధించగలిగారని చెప్పడం నిస్సందేహం. ఈ బంద్‌లో కాంగ్రెసు నాయకులు, వామపక్షాలకు చెందిన నాయకులు కూడా పాల్గొన్నప్పటికీ క్రెడిట్‌ పూర్తిగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు పార్టీ ఖాతాలోకి వెళ్ళింది. అలాగని కాంగ్రెస్‌, వామపక్షాల పోరాటాన్ని తక్కువగా అంచనా వేయలేం.

కొన్ని చోట్ల వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు పార్టీ నాయకులు అరెస్ట్‌ అయినప్పుడు అక్కడ వామపక్షాలు, కాంగ్రెస్‌ నాయకులే ముఖ్య భూమిక పోషించారు. వ్యాపార వర్గాలు, విద్యా సంస్థలు కూడా ఈ బంద్‌లో పాల్గొని, బంద్‌ని విజయవతం చేయడం అభినందించదగ్గది. ఈ బంద్‌ నేపథ్యంలోనే ‘ఆంధ్రప్రదేశ్‌ని ఆదుకోవడానికి తగిన కార్యాచరణను రూపొందిస్తున్నాం’ అని కేంద్రం లోక్‌సభలో ప్రకటించగలిగిందిగానీ అది పూర్తిగా నమ్మదగినది కాదు.