జనసేనకి ఇంకో దిక్కేది?

రాజకీయ పార్టీ పెట్టేశాం, వీలున్నప్పుడు గట్టిగట్టిగా మాట్లాడేశాం అంటే సరిపోదు. అభిమానులే కార్యకర్తలని సరిపెట్టుకోడానికీ వీల్లేదు. అవేవీ ఓ సెలబ్రిటీని నాయకుడ్ని చెయ్యలేవు. రాజకీయాల్లో రాణించాలంటే ప్రజల మన్ననలు పొందాలి. కానీ పవన్‌కళ్యాణ్‌ ఇంకా రాజకీయాల్లో చిన్నపిల్లాడిలానే వ్యవహరిస్తున్నట్టున్నాడు. ప్రత్యేక హోదాపై మాట్లాడిన పవన్‌కళ్యాణ్‌కి మద్దతు లభిస్తున్నా, ఆయనపై వ్యతిరేకత కూడా అలాగే వినిపిస్తోంది. చిన్నపిల్లాడిలా పవన్‌ మాట్లాడేసి, మారాం చేస్తే కుదరదని కొందరు రాజకీయ నాయకులు సున్నితంగా విమర్శిస్తే, పవన్‌కళ్యాణ్‌ పిచ్చోడని ఇంకొందరు విమర్శిస్తున్నారు. పవన్‌కళ్యాణ్‌ మాట్లాడినా తప్పే, మాట్లాడకపోయినా తప్పే.

ఎందుకంటే ఆయన రాజకీయాల్లో ఉన్నారు. రాజకీయాల్లోకి వస్తే ఇతర రాజకీయ పార్టీలకు చెందిన నాయకులైనా, ప్రజలైనా ఏ విషయంలో అయినా ప్రశ్నిస్తారు. వారికి సమాధానం చెప్పి, తన వాయిస్‌ని బలంగా వినిపించినప్పుడే నాయకత్వ లక్షణాల్ని చూపించుకన్నట్లవుతుంది. అయితే పవన్‌కళ్యాణ్‌ని వెనకేసుకురావడానికి కూడా ఎవరూ లేరు జనసేన పార్టీ తరఫున. మొన్నటి తిరుపతి సభలో కనిపించిన అభిమానులు కూడా, జనసేన జెండా భుజాన కప్పుకుని ఇతర పార్టీల నుంచి తమపై వస్తున్న విమర్శలకు సమాధనమివ్వలేకపోతున్నారు. పార్టీకి కొన్ని విభాగాలుండాలి, అధికార ప్రతినిథులు ఉండాలి. ఇవేవీ లేకుండా రాజకీయ పోరాటం చేస్తానని పవన్‌ చెప్పడం హాస్యాస్పదంగానే ఉంటుంది.