చంద్రబాబుకి ముద్రగడ బంపర్‌ ఆఫర్‌.

మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రత్యేక హోదా కోసం నిరాహార దీక్ష చేయాలని అభిప్రాయపడ్డారాయన. చంద్రబాబు నిరహార దీక్ష చేస్తే ప్రత్యేక హోదా వస్తుందని ముద్రగడ చెప్పారు. తనకూ అవకాశం కల్పిస్తే చంద్రబాబుతో కలిసి దీక్షలో పాల్గొంటాననీ, ఇది ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాల కోసమేనని ముద్రగడ వివరించారు. కాపు ఉద్యమం మలిదశను ప్రారంభించేందుకోసం కాపు ప్రముఖులతో ముద్రగడ సమావేశమవుతున్నారు. దాసరి నారాయణరావుతో సమావేశమైన ముద్రగడ, ఉద్యమ కార్యాచరణను వివరించినట్లుగా తెలియవస్తోంది.

అయితే కాపు ఉద్యమం పేరుతో ముద్రగడ పద్మనాభం కాపుల్లోనే ఐక్యతను తీసుకురాలేకపోయారు. ఆయన చేసిన నిరాహార దీక్షలు కూడా హాస్యాస్పదమయ్యాయే తప్ప ప్రభుత్వాన్ని కదిలించలేకపోయాయి. ప్రత్యేక హోదా పేరుతో కూడా ముద్రగడ పద్మనాభం ఆందోళనలు చేయగలిగితే కొంతవరకు ఆయనకు రాజకీయంగా మద్దతు లభించే అవకాశం ఉంటుంది. అందుకే ఆయన అన్నీ ఆలోచించి, చంద్రబాబుని ఇరకాటంలో పడేస్తూనే బంపర్‌ ఆఫర్‌ ప్రకటించారు. కానీ చంద్రబాబు, ముద్రగడ ఆఫర్‌ని అంగీకరించలేరు. ఎందుకంటే చంద్రబాబు గనుక నిరాహార దీక్షలు వంటివి చేస్తే కేంద్రం నుంచి ప్రతిస్పందన తీవ్రంగా, ఘోరంగా ఉంటుంది.