కుక్క కాటుకి చెప్పుదెబ్బ

పాకిస్తాన్‌కి భారతదేశం తరఫున ప్రధాని నరేంద్రమోడీ ఇచ్చిన షాక్‌ అంతర్జాతీయంగా చర్చనీయాంశం అవుతోంది. పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌ ఎప్పటినుంచో స్వాతంత్య్రం కోసం పోరాడుతోంది. ఇప్పుడు అక్కడి ప్రజలు, భారత ప్రధాని నరేంద్రమోడీకి విజ్ఞప్తి చేస్తున్నారు. బంగ్లాదేశ్‌కి పాకిస్తాన్‌ నుంచి విముక్తి కలిపించినట్లుగా తమకూ పాకిస్తాన్‌ నుంచి స్వేచ్ఛ కల్పించాల్సిందిగా వారు చేస్తున్న విజ్ఞప్తి పట్ల ప్రపంచ దేశాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి.

పాకిస్తాన్‌ దశాబ్దాలుగా భారతదేశంపై తీవ్రవాదాన్ని ఉసిగొల్పుతూనే ఉంది. ఈ క్రమంలో స్వదేశంలో తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌, ఆ తీవ్రవాదాన్ని ఒక్కోసారి తమ దేశ పౌరులపైన కూడా ప్రయోగిస్తూ వస్తుంది. బలూచిస్తాన్‌ ఒక్కటే కాదు, పాకిస్తాన్‌ ఆక్రమిత కాశ్మీర్‌లో కూడా ప్రజలు పాకిస్తాన్‌ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ విషయాలు అంతర్జాతీయ సమాజం ముందుకు వెళ్ళాయి. భారతదేశంలోని జమ్మూకాశ్మీర్‌ పట్ల పదే పదే పాకిస్తాన్‌ ఆశ ప్రదర్శిస్తున్న విషయాన్నీ అంతర్జాతీయ సమాజం ఇప్పుడు అర్థం చేసుకుంది. కాశ్మీర్‌ అంశం ఎజెండాగా చర్చలకు రావాలని పాకిస్తాన్‌ ఆహ్వానం పంపగా, దాన్ని భారత ప్రభుత్వం తిప్పికొట్టింది.

పాకిస్తాన్‌ తన దేశంలోని అసంతృప్తిని చల్లార్చుకోవాలని, జమ్మూకాశ్మీర్‌ గురించి పాకిస్తాన్‌తో చర్చించడానికి ఏమీలేదని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. జమ్మూకాశ్మీర్‌లో ఏ సమస్య తలెత్తినా అది భారత అంతర్గత సమస్య అనీ, అలాగే పాకిస్తాన్‌ తన అంతర్గత సమస్యలను చూసుకోవడం మంచిదని భారత ప్రభుత్వం చెప్పింది. ఇంకో వైపున బలూచిస్తాన్‌లో స్వాతంత్య్ర కాంక్షతో ఆందోళనలు ఆకాశాన్నంటుతున్నాయి. కాశ్మీర్‌పై పాకిస్తాన్‌ పెత్తనం కోసం ప్రయత్నిస్తున్న వేళ, పాకిస్తాన్‌లో పరిణామాలు కుక్క కాటుకి చెప్పుదెబ్బలాగానే భావించాలి.