ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లెక్కలు తేలాయి….

విభజన జరిగిన రెండేళ్ల తర్వాత… రెండు రాష్ట్రాల పంచుకోవలసిన ఆస్తుల లెక్కలు తేలుతున్నాయి. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని పదో షెడ్యూలులో పేర్కొన్న సంస్థల ఆస్తులపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టిన కసరత్తు ఓ కొలిక్కి వచ్చింది. మొత్తం 142 సంస్థల్లో 132 సంస్థల వివరాలను అధికారులు ఇప్పటికే సేకరించారు. మరో 10 సంస్థల నుంచి వివరాలు అందలేదు. భూములు, భవనాలతో కూడిన భూములు, కార్యాలయాల సామగ్రి, వివిధ సంస్థల మెషినరీ సంబంధిత సామగ్రి, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, బ్యాంకు అకౌంట్లు… ఇలా వివిధ రూపాల్లో ఉన్న మొత్తం ఆస్తుల వివరాలను ప్రభుత్వం సేకరిస్తోంది.

ఇప్పటివరకు అందిన వివరాల ప్రకారం.. లెక్కించిన ఆస్తుల విలువ రూ.36,835 కోట్లుగా తేలింది. పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్‌ 2 (హెచ్‌), దాని ఆధారంగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు అమల్లోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాషా్ట్రలు ఈ ఆస్తులను 58:42 నిష్పత్తిలో పంచుకోవలసి ఉంటుంది. అదే జరిగితే తెలంగాణ వాటా కింద రూ.15,471 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌ వాటాకు రూ.21,364 కోట్ల మేరకు ఆస్తులు దక్కుతాయి. మొత్తం ఆస్తుల్లో రూ.31,696 కోట్లు భూములు-భవనాల రూపంలోనే ఉన్నాయి. అందులో మెజారిటీ తెలంగాణలో… ఇంకా నిర్దుష్టంగా చెప్పాలంటే హైదరాబాద్‌లో ఉన్నాయి. తెలంగాణలోని భూములు, భవనాల విలువే రూ.28,046 కోట్లుగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని భూములు, భవనాల విలువ మొత్తం రూ.3,650 కోట్లు. మొత్తం భూములు-భవనాల్లో తెలంగాణలోని ఆస్తుల విలువే 88.5 శాతంగా ఉండటం గమనార్హం. ఒక్క ఎన్‌జీ రంగా అగ్రివర్సిటీ భూముల మార్కెట్‌ విలువే రూ.11 వేల కోట్లకు పైగా తేలింది. భూములు, భవనాలు పోను మిగిలిన ఆస్తులు వస్తు సామగ్రి, డిపాజిట్లు-అకౌంట్ల రూపంలో ఉన్నాయి.ఆస్తుల లెక్క తేల్చడం ఒక ఎత్తయితే… వాటి పంపిణీ అంత సులువగా కనిపించడం లేదు. పంపకం సుదీర్ఘ ప్రక్రియలా కనిపిస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యా మండలి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇచ్చాక కూడా విభజన ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. రెండు రాషా్ట్రలు అంగీకారానికి వస్తే సరే సరి…లేదంటే కేంద్రమే ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆయా రాష్ట్రాలతో చర్చించి సమస్యలను పరిష్కరించాలని సుప్రీం సూచించింది. ఈ తీర్పు తర్వాత సమస్యల పరిష్కారానికి చర్చలకు రావాలని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణకు లేఖ రాసింది. కానీ తెలంగాణ స్పందించకపోవడంతో సుప్రీం కోర్టు తీర్పు అమలు కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. కేంద్రం నుంచీ స్పందన కనిపించడం లేదు. ఉన్నత విద్యా మండలి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం… రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసిన రెండు నెలల్లో ఓ కమిటీని ఏర్పాటు చేయాలి. ఆధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విజ్ఞప్తి చేసిన తర్వాత తాము కేంద్ర హోం శాఖ అదనపు కార్యదర్శి నేతృత్వంలో ఓ కమిటీని నియమించామని, అందులో రెండు రాషా్ట్రలనుంచి ఇద్దరేసి సభ్యులు ఉంటారని ఇటీవలే కేంద్ర మంత్రి ఒకరు పార్లమెంటులో చెప్పారు. అయితే, ఈ కమిటీకి కాలపరిమితి లేదని సమాధానం చెప్పి చేతులు దులిపేసుకున్నారు.