ఈ సారైనా స్మార్ట్ సిటీ దక్కేనా…

రెండో దఫా స్మార్ట్‌ సిటీలో తిరుపతికి చోటుదక్కుతుందోలేదోనన్న ఎదురుచూపులు ఎక్కువవుతున్నాయి. కేంద్రమంత్రి పదవిలో కొలువుదీరిన వెంకయ్యనాయుడు ఈ సారైనా కరుణిస్తారోలేదోనని నగరవాసులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.వంద నగరాల్లో మొదటి దఫా 20 నగరాలను ఎంపికచేసినా.. అందులో తిరుపతికి చోటుదక్కని సంగతి తెలిసిందే. 40 నగరాలతో రెండో జాబితాను ప్రకటించాల్సి ఉండగా కొన్ని కారణాలచేత 13 నగరాలను ఎలాంటి ఎంపిక ప్రతిపాదనలు లేకుండానే ఈ ఏడాది మేలో ప్రకటించారు. మిగిలిన 27 నగరాలను ఆగస్టు 15లోపు ప్రకటించాల్సి ఉంది.

ఈ నేపథ్యంలో కార్పొరేషన్‌ కమిషనర్‌ వినయ్‌చంద్‌ రెండో జాబితాలో టాప్‌–1లో నిలబెట్టేందుకు సర్వం సిద్ధం చేసి నివేదికను కేంద్రానికి అందజేశారు. గత లోపాలను సరిదిద్ది భారీ మార్పులతో స్మార్ట్‌ ప్రణాళికలను రూపొందించారు.రెండో జాబితాలో తిరుపతిని స్మార్ట్‌ సిటీగా నిలబెట్టేందుకు కార్పొరేషన్‌ కమిషనర్‌ తీవ్రంగానే శ్రమించారు. ఇందులో భాగంగా ఇప్పుడున్న నిర్మాణాలను ఉన్నచోటే(వెట్రోఫిట్టింగ్‌) అభివృద్ధిచేసేలా తీర్మాణం చేశారు. అందుకనుగుణంగా డీపీఆర్‌ను సిద్ధం చేశారు. తొలి విడత పోటీలో రూ.2,650 కోట్ల వ్యయంతో ప్రణాళికలను రూపొందించారు. దీనిపై కేంద్రం నుంచి నిధులు ఎలా సమకూర్చుకుంటారనే ప్రశ్నలు ఎదురయ్యాయి.

ఇలాంటి లోపాలు లేకుండా రెండు డీపీఆర్‌లో మార్పుచేస్తూ రూ.1,610 కోట్లకు పరిమితం చేశారు. స్మార్ట్‌ సిటీమిషన్‌ నుంచి రూ.1,010 కోట్లు, కేంద్ర, రాష్ట్ర పథకాల నుంచి మరో రూ.300 కోట్లు, పీపీపీ పద్ధతిన చేపట్టనున్న మరో 300 కోట్లు వెరసి రూ.1,610 కోట్లు సమకూర్చుకుంటాయనే అంచనాతో డీపీఆర్‌ను సిద్ధం చేశారు.ఫ్రాన్స్‌లో అద్భుతమైన టౌన్‌ప్లానింగ్, శానిటేషన్, టెక్నాలజీ అమల్లో ఉంది. ఆ టెక్నాలజీ, ప్లానింగ్‌ను తిరుపతికి అనుకరిస్తూ అభివృద్ధి చేసేలా అక్కడి ఓ సంస్థతో కార్పొరేషన్‌ అధికారులు సంప్రదింపులు జరిపారు. స్మార్ట్‌ కిరీటం దక్కించుకొని అభివృద్ధికి అడుగులు పడితే తిరుపతికి ఫ్రాన్స్‌ టెక్నాలజీ దోహదపడనుంది.