బావ, బావమరదుల మధ్య… కోల్డ్ వార్ నడుస్తోందా!

విజయవాడలో కనకదుర్గగుడి ఈవో నియామక వ్యవహారం ఎమ్మెల్యే బాలకృష్ణకు అవమానం మిగిల్చింది. ఆయన సూచించిన వారి కి కాకుండా, వేరే వారిని ఆ పదవిలో నియమించడం, తాను సిఫారసు చేసిన తర్వాత కూడా ఐఏఎస్‌ను నియమించే పద్ధతికి శ్రీకారం చుట్ట డం బాబు వియ్యంకుడికి మనస్తాపం కలిగించిందని పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది…ఇప్పటి వరకు దుర్గగుడిలో నాన్ ఐఏఎస్ అధికారిని నియమించేవారు… కానీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఒకరు కనకదుర్గ గుడికి సమర్థులు, నిజాయితీపరులు, ఒత్తిళ్లకు లొంగని అధికారికే అవకాశం ఇవ్వాలని, విభజన తర్వాత దేవాలయ ప్రాధాన్యం పెరుగుతున్నందున, తిరుమల మాదిరిగానే కనకదుర్గ దేవాలయానికీ ఐఏఎస్ అధికారినే నియమించాలని సూచించగా, బాబు అందుకు ఆమోదించినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. తిరుమల తర్వాత అంత ప్రాధాన్యం ఉన్న విజయవాడ కనకదుర్గ గుడి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వ్యవహారంలో సీఎం చంద్రబాబునాయుడు.. బాలకృష్ణ సిఫారసును కూడా పట్టించుకోలేదని చెబుతున్నారు. జాయింట్ కమిషనర్ స్థాయిలో పనిచేస్తూ, తనకు కావలసిన ఒక అధికారికి కనకదుర్గ గుడి ఈఓగా పోస్టింగు ఇవ్వాలని బాలకృష్ణ ముఖ్యమంత్రిని కోరినట్లు సమాచారం.అయితే, ఈ విషయంలో ముఖ్యమంత్రి బాలకృష్ణ ఒత్తిడిని పట్టించుకోకుండా, సీసీఎల్‌ఏలో పనిచేసిన ఐఏఎస్ అధికారి సూర్యకుమారిని నియమించడంతో బాలకృష్ణ ఖంగుతినాల్సి వచ్చింది.

ప్రస్తుతం నాన్-ఐఏఎస్ అధికారి మాత్రమే దుర్గ గుడి ఈఓగా వ్యవహరిస్తున్నారు. ఇకపై ఐఏఎస్‌లే ఈఓగా ఉండే విధానానికి శ్రీకారం చుట్టడం ద్వారా, బాబు తన వియ్యంకుడికి పాలసీని సాకుగా చూపించే అవకాశం ఏర్పడిందని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అయితే, తాను చెప్పిన తర్వాత కూడా తాను సూచించిన వారిని కాదని, ఏఏఎస్‌ను నియమించడంపై బాలకృష్ణ తను సన్నిహితుల వద్ద అసంతృప్తి వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.