టీడీపీ వాళ్ళనూ వదలొద్దు:బీజేపీ

ఏపిలో పార్టీని శరవేగంగా విస్తరించేందుకు బిజెపి తన రోడ్‌మ్యాప్‌ను ఖరారు చేసింది.ఆరుగంటల పాటు ఢిల్లీలోని ఏపి అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు నివాసంలో జరిగిన కోర్ కమిటీ భేటీలో, పార్టీ భవిష్యత్తు కార్యాచరణ ఖరారు చేశారు. ”రాష్ట్రంలో ఏ పార్టీ నాయకులు వస్తామన్న వద్దనకండి. చేర్చుకోండి. చివరికి టిడిపి వాళ్లనైనా వదలవద్దు. పార్టీ తలుపులు బార్లా తెరవండి. బిజెపిని బలోపేతం చేయ్యండి” అని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా రాష్ట్ర నేతలకు సూచించారు. శుక్రవారం నాడిక్కడి బిజెపి కేంద్ర కార్యాలయంలో ఆపార్టీ ఆంధ్రప్రదేశ్‌ కోర్‌ కమిటీ సమావేశం జరిగింది. దాదాపు మూడు గంటల సేపు సుదీర్ఘంగా జరిగిన సమావేశంలో పార్టీ బలోపేతం, సభ్యత్వం తదితర అంశాలపై చర్చించారు.

రాష్ట్రంలో బిజెపిని పటిష్టపరచడానికి ఫిరాయింపులను ప్రోత్సహించాలని సంకేతాలి చ్చారు. బిజెపిలో ఏవరు చేరుతామని వస్తున్నా… అడ్డుకోవద్దు. అందరిని చేర్చుకోండని ఆదేశిం చారు. దీంతో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కలుగజేసుకొని, టిడిపితో మిత్ర పక్షంగా ఉన్నాం. కనుక ఆపార్టీకి చెందిన నాయకులను చేర్చుకోవడం మంచిది కాదని చెప్పేలోపే…అమిత్‌ షా జోక్యం చేసుకొని, టిడిపి వాళ్లనైనా వదలొద్దు అని నిర్దేశించారు. రాష్ట్రంలో దేవాలయాల కూల్చి వేత సందర్భంలో సరిగా స్పందించ లేదని అసం తృప్తి వ్యక్తం చేశారు. ఈ ఏడాదిలో ఆంధ్రప్రదేశ్‌లో పార్టీకి సంబంధించి నాలుగు కీలక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. కడపలో బహిరంగ సభ, వైజాగ్‌లో మండల స్థాయి పదాధికారుల సమావేశం, పశ్చిమ గోదావరిలో రైతు సదస్సులకు అమిత్‌ షా హాజరుకానున్నారు.

విజయవాడలో ఇటీవల జరిగిన గుళ్ల కూల్చివేత, అందులో బిజెపి ప్రభుత్వాన్ని విమర్శించిన విజయవాడ తెదేపా ఎంపి కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వ్యవహారశైలి చర్చకు వచ్చింది. రాష్ట్రంలో మిత్రపక్షంగా ఉన్న తమపై టిడిపి అణచివేత వైఖరి ప్రదర్శిస్తోందని, పార్టీలో చేరిన వారిపై కేసులు పెట్టించడం, చౌకదుకాణాలు తొలగించడం, భూములు దున్నించటం, ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించడం వంటి అరాచకాలకు పాల్పడుతుంటే ఇక పార్టీ ఎలా పటిష్టపడుతుందని కోర్ కమిటీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవైపు ఏపికి నిధులు ఇవ్వలేదని ఆరోపిస్తున్న టిడిపి నేతలు, తాము రాష్ట్రానికి ఏం చేశామో చెబుతుంటే, తమపై వ్యక్తిగత దాడులకు దిగుతున్నారని చర్చించారు.

తమను టిడిపి నేతలు తిట్టిన తర్వాత సీఎం చంద్రబాబు ఇకపై బిజెపిని విమర్శించవద్దని చెబుతున్నారని, ఇలాంటి వ్యూహంతో వెళుతున్న టిడిపిపై, ఏవిధంగా వ్యవహరించాలో అమిత్‌షా వద్ద స్పష్టత తీసుకోవాలని చర్చించారు. ఇప్పటివరకూ పట్టణప్రాంతాలకే పరిమితమైన పార్టీని, ఇక గ్రామాలకూ విస్తరించాలని నిర్ణయించారు. రైతులను పార్టీ వైపు మళ్లించుకోవాలన్న వ్యూహంతో వెళ్లనున్నారు. అందులో భాగంగా అమిత్‌షాతో ఏలూరులో భారీ రైతుసభ నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిసింది. అదేవిధంగా ఇకపై బూత్‌కమిటీపై దృష్టి సారించాలని, ప్రతి బూత్‌కు కమిటీలు ఏర్పాటుచేయాలని కోర్ కమిటీ నిర్ణయించింది.