జగన్‌కి ఇదే వెపన్‌ అవుతుందా?

వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి చేతిలో భారతీయ జనతా పార్టీ ‘ఆయుధం’ పెట్టేసింది. ప్రత్యేక హోదా ఇవ్వలేమని బిజెపి చెప్పినా టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు ఆచి తూచి స్పందిస్తున్నారు. పూర్తిగా చంద్రబాబు ఆలోచనల్ని ఖండించడానికి లేదు. కేంద్రంతో విభేదాలు ఏ రాష్ట్రానికీ మంచిది కాదనేది ఆయన ఉద్దేశ్యం కావొచ్చు.

అయితే ప్రతిపక్షంగా పోరాడేందుకు పూర్తి అవకాశం ఉన్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు పార్టీ, ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీనీ అలాగే కేంద్రంలో భారతీయ జనతా పార్టీనీ ఇరకాటంలో పడేయడానికి వ్యూహాలను రచిస్తూ ఉంది. ఇందులో భాగంగానే ఆగస్ట్‌ 2న ఆంధ్రప్రదేశ్‌ బంద్‌కి వైఎస్‌ జగన్‌ పిలుపునిచ్చారు. ఈ బంద్‌ తర్వాత, ఢిల్లీకి వెళ్ళేలా వైఎస్‌ జగన్‌ వ్యూహరచన చేసుకున్నారని సమాచారమ్‌. ‘మమ్మల్ని ఢిల్లీకి మీరే తీసుకెళ్ళండి’ అని వైఎస్‌ జగన్‌, చంద్రబాబుపై ఒత్తిడి తేవాలనుకుంటున్నారట. వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు పార్టీ తరఫున వెళ్ళడం కన్నా, ఆంధ్రప్రదేశ్‌ నుంచి అన్ని పార్టీల డెలిగేషన్‌ వెళ్ళడం మంచిదనేది వైఎస్‌ జగన్‌ ఆలోచనగా కనిపిస్తోంది.

కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్‌లో కొంచెం స్తబ్దుగా ఉన్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు పార్టీ శ్రేణులు ఈ ప్రత్యేక హోదా వివాదంతో ఊపిరి తీసుకుంటున్నారు. ఏ పార్టీకి అయినా పోరాటమే ఊపిరి. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్‌కి రాజ్యసభ ద్వారా సంక్రమించిన హక్కు. ఆ హక్కుని నిజం చేయమని మాత్రమే వైఎస్‌ఆర్‌సిపి పోరాడనుంది.