జనాలకి ఎరుపుకలలు చూపించిన బాబు కేసీర్

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వద్దన్నవే ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ముద్దు అవుతున్నవిచిత్రం తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తోంది. తెలంగాణలో టిఆర్ఎస్, ఏపిలో టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరినయితే వ్యతిరేకించాయో, ఇప్పుడు ఆ రెండు పార్టీలు అధికారంలోకి వచ్చిన తరువాత అవే కంపెనీలు దర్జాగా రెండు రాష్ట్రాల్లోనూ వెలిగిపోతున్న వైనం రెండుపార్టీల నేతల్లోనూ విస్మయానికి గురిచేస్తోంది. తెలంగాణ ప్రాజెక్టుల పనులన్నీ ఆంధ్రా పెట్టుబడిదారులకే అప్పగించి, సీమాంధ్ర పాలకులు తెలంగాణను దోపిడికి గురి చేస్తున్నారని, తెరాస ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆరోపించింది. ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన తెరాస, ఆంధ్రా కంపెనీల స్థానంలో తెలంగాణ కంపెనీలకు పట్టం కడుతుందని ఉద్యమవాదులు, తెరాస నేతలు ఆశించారు. కానీ గత రెండేళ్లలో జరుగుతున్న వివిధ సాగునీటి ప్రాజెక్టుల పనులన్నీ, మెజారిటీ శాతం ఏపికి చెందిన కంపెనీలకే కట్టబెడుతున్నారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, పాలమూరు-రంగారెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టు పనులలో 70 శాతం పనులు సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు చేసిన కంపెనీల్లో ప్రధానంగా మూడు కంపెనీలే సింహభాగాన్ని చేపడుతున్న వైనాన్ని తెలంగాణ ఉద్యమవాదులు, సంఘాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. మొత్తం 84వేల కోట్ల రూపాయల విలువైన టెండర్లు పిలవగా, అందులో 76వేల కోట్ల రూపాయల విలువైన పనులను ఏపికి చెందిన కంపెనీలే చేజిక్కించుకున్నాయి. వీటిలో మెగా ఇంజనీరింగ్, పిఎల్‌ఆర్, నవయుగ, ఎస్‌ఈడబ్ల్యు, జియంఆర్‌లు ఎక్కువ మొత్తంలో పనులను దక్కించుకున్నాయి. పాలమూరు ప్రాజెక్టులో 45 వేల కోట్ల టెండర్లు పిలిస్తే అందులో 40 వేల కోట్ల పనులు ఏపి కంపెనీలే దక్కించుకోగా, మిగిలిన 5 వేల కోట్లు స్థానిక కంపెనీలతోపాటు, మహారాష్ట్ర కంపెనీలు దక్కించుకున్న వైనాన్ని తెలంగాణ ఉద్యమవాదులు గుర్తు చేస్తున్నారు. ‘తెలంగాణ వచ్చినా ఏపికి చెందిన ఆ రెండు కంపెనీలు (మెగా ఇంజనీరింగ్, పిఎల్‌ఆర్) చెప్పిన ప్రకారమే పనులు నడుస్తున్నాయి. అవి ఎవరికి పనులు ఇవ్వమంటే వారికే ఇస్తున్నారు. ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీలేమయ్యాయి’ అని ఓ ఉద్యమ ప్రముఖుడు వ్యాఖ్యానించారు.

ఏపి కాంట్రాక్టర్లు తీసుకున్న పనుల్లో తమ ప్రాంతానికి చెందిన వారికి సబ్ కాంట్రాక్టర్లు ఇస్తున్నారని, కిందిస్థాయి నేతలకు జేసీబీ, ఇతర పనులు అప్పగిస్తుండటంతో ఎవరూ మాట్లాడలేకపోతున్నారని తెరాస నేతలు అసలు విషయం వెల్లడిస్తున్నారు. పనులు తీసుకున్న కంపెనీలు ఏ స్థాయి ఉన్న వారిని ఆ స్థాయిలో సంతృప్తి పరుస్తుండటంతో, ప్రతిపక్షాలు కూడా దీనిని పట్టించుకోవడం లేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

అటు ఏపిలో కూడా ఇలాంటి పరిస్థితే నెలకొంది. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ కంపెనీల మీదయితే ఆరోపణలు గుప్పించామో, అధికారంలోకి వచ్చిన తర్వాత అదే కంపెనీలు కొనసాగుతున్నాయంటే తమ అధినేత చంద్రబాబు చెప్పినట్లు ‘తాము ఎటుపోతున్నామో అర్థం కావడం లేదని’ తెదేపా నేతలు వాపోతున్నారు. కాకినాడ సెజ్‌ను ఒక కంపెనీకి అక్రమంగా కట్టబెట్టారని ఆరోపిస్తూ, స్వయంగా బాబు ఆధ్వర్యంలో విపక్షంలో ఉన్నప్పుడు ధర్నా నిర్వహించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేస్తామన్నారు. అయితే అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా, అదే కంపెనీ కొనసాగుతున్న వైనాన్ని తెదేపా నేతలు ప్రస్తావిస్తున్నారు.

అదే విధంగా మరో కంపెనీ మెగా ఇంజనీరింగ్ అప్పటి వైఎస్ ఆత్మబంధువైన కెవిపి బినామీదని, రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులూ సదరు ఆత్మకు చెందిన బినామీలకే ఇస్తున్నారని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి సంగతి చూస్తామని ముద్దుకృష్ణమనాయుడు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మీడియా భేటీలో హెచ్చరించారు. కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టిసీమ ప్రాజెక్టును అదే కంపెనీకి ఇవ్వడంతో పార్టీ నేతలు ఖంగుతినాల్సి వచ్చింది. విశాఖ బాక్సైట్‌ను వైఎస్ సన్నిహితుడికి అక్రమంగా కట్టబెట్టారని, తాము వాటిని రద్దు చేస్తామని చెప్పిన తమ పార్టీ ఇప్పటికే అదే కంపెనీని కొనసాగిస్తోందని గుర్తు చేస్తున్నారు. వైఎస్ హయాంలో ఏ కంపెనీలయితే వెలిగిపోయాయో, తాము ఏ కంపెనీల మీదయితే పోరాటం చేశామో ఇప్పుడు తమ పాలనలోనూ అవే కంపెనీలు వెలిగిపోతున్నాయని, అదే కాంట్రాక్టర్లు ఇప్పుడు సీఎం వద్ద కనిపిస్తున్నారని చెబుతున్నారు.