పవన్‌కళ్యాణ్‌ వచ్చేస్తున్నాడోచ్‌

అతి త్వరలో పవన్‌కళ్యాణ్‌ పొలిటికల్‌ ఎంట్రీ ఉండబోతోందని సమాచారమ్‌. జనసేన పార్టీని 2014 లోనే పవన్‌కళ్యాణ్‌ స్థాపించినప్పటికీ అది రాజకీయ పార్టీగా అవతరించడానికి, విస్తరించడానికి ఇంకా సరైన ముహూర్తం దొరికినట్లుగా లేదు. అందుకే పవన్‌కళ్యాణ్‌ కూడా పలు సాకులు చెబుతూ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళలేదు. పార్టీని నడపడానికి తగినంత ఆర్థిక వనరులు లేవని పవన్‌కళ్యాణ్‌ చెప్పడం అభిమానుల్ని బాగా హర్ట్‌ చేసింది గతంలో. అదలా ఉంచితే సినిమాల్లో బిజీ అయిన పవన్‌కళ్యాణ్‌ ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితుల్ని జాగ్రత్తగా గమనిస్తూనే ఉన్నారట.

ఇప్పుడున్న పరిస్థితులలో రాజకీయంగా తొందరపాటు పనికిరాదనే ఉద్దేశ్యంతో ఆయన ఉన్నారని తెలియవస్తోంది. కాపు ఉద్యమం ఉధృతం కావడంతో తప్పనిసరిగా స్పందించాల్సి ఉన్నప్పటికీ ఆయన ఆచి తూచి వ్యవహరించారు. ఇంకో ఏడాది సమయంలోనే పార్టీని నెమ్మది నెమ్మదిగా పటిష్టం చేసి 2018 నాటికి పూర్తిగా బలోపేతం చేయాలని లక్ష్యంతో ఉన్న పవన్‌కళ్యాణ్‌ ఈలోగా తెలుగుదేశం పార్టీతోగానీ బిజెపితోగానీ ఎలాంటి గొడవలూ పెట్టుకోవాలనుకోవడంలేదట. పవన్‌ రాజకీయ వ్యూహాలపై చంద్రబాబు కూడా ఓ కన్నేశారట. బిజెపి కూడా పవన్‌ రాజకీయంగా వేసే అడుగుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటోంది. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా అనే డిమాండ్‌తో ఎపీ రాజకీయాలపైనే ముందు ఫోకస్‌ పెట్టాలని పవన్‌ అనుకుంటున్నాడని సమాచారమ్‌.