రామ్ చ‌ర‌ణ్ కెరీర్ లో 1000 రోజులు ఆడిన ఏకైక సినిమా ఏదో తెలుసా?

ఇటీవల కాలంలో ఒక సినిమా నెల రోజులు థియేటర్స్ లో ఆడటం ఎంత గ‌గనం అయిపోయిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. అద్భుతమైన టాక్ వస్తే సినిమాను మూడు లేదా నాలుగైదు వారాలు ఉంచుతున్నారు. ఒకవేళ టాక్ అటు ఇటుగా వస్తే రెండు వారాలకే ఎత్తేస్తున్నారు. కొన్ని కొన్ని సినిమాలైతే వారం రోజులు కూడా ఆడ‌ట్లేదు. అలా వ‌చ్చి ఇలా వెళ్లిపోతుంటాయి.

కానీ ఒకప్పుడు వంద‌, రెండు వంద‌లే కాకుండా వెయ్యి రోజులు ఆడిన సినిమాలు కూడా ఉన్నాయి. అలాంటి సినిమానే మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లో కూడా ఉందండోయ్. మరి ఆ సినిమా మ‌రేదో కాదు.. ద‌ర్శ‌కధీరుడు రాజ‌మౌళి రూపొందించిన `మ‌గధీర‌`. ఈ చిత్రంలో కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్ గా న‌టిస్తే.. శ్రీ‌హ‌రి, దేవ్ గిల్‌, రావు ర‌మేష్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించాడు. ఎంఎం కీరవాణి స్వ‌రాలు అందించారు.

గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై దాదాపు రూ. 45 కోట్ల బ‌డ్జెట్ తో అల్లు అరవింద్ నిర్మించిన ఈ చిత్రం.. 2009లో విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షం కురిపించింది. దాదాపు రూ. 150 కోట్ల రేంజ్ లో వ‌సూళ్ల‌ను సాధించింది. అప్ప‌టి వ‌ర‌కు ఉన్న తెలుగు సినిమా రికార్డుల‌న్నీ తిర‌గ‌రాసేసింది. అంతేకాదు, క‌ర్నూలులోని ఓ థియేట‌ర్ లో మ‌గ‌ధీర‌ సినిమా 1002 రోజులు ఆడి రికార్డుల్లోకి ఎక్కింది. 1000 రోజులు ఆడిన తెలుగు సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది.