కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ కు కోటిన్నర ఫైన్.. అంత పెద్ద త‌ప్పు ఏం చేశాడో తెలుసా?

కోలీవుడ్ స్టార్ ద‌ళ‌ప‌తి విజ‌య్ కు రూ. 1.5 కోట్లు ఫైన్ ప‌డింది. అంత భారీ మొత్తంలో ఫైన్ ప‌డ‌టానికి కార‌ణం ఏంటి..? విజ‌య్ ఏం త‌ప్పు చేశాడు..? వంటి విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. విజ‌య్ కెరీర్ లో భారీ అంచ‌నాల న‌డుమ వ‌చ్చిన బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్ గా నిలిచిన చిత్రాల్లో `పులి` ఒక‌టి. ఈ సినిమాకు చింబు దేవన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. శృతి హాసన్, హ‌న్సిక‌, శ్రీ‌దేవి త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.

2015లో విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద ఘోరంగా బోల్తా ప‌డింది. భారీగా న‌ష్టాల‌ను మిగిల్చింది. అయితే పులి రిలీజై ఇన్నేళ్లు అవుతున్నా.. ఇంకా విజ‌య్ ను ఇబ్బంది పెడుతూనే ఉంది. పులి సినిమా ఆదాయం లెక్కల్లోకి చూపించలేదంటూ ఆదాయపు పన్ను శాఖ క‌నుగొంది. 2015-16 ఆర్థిక సంవత్సరానికి విజయ్‌ ఐటీ రిటర్న్‌ దాఖలు చేసినప్పుడు ఆ ఏడాది ఆదాయం రూ.35,42,91,890గా చూపించాడట.

అయితే ఆదాయపన్నుశాఖ విజయ్‌ ఇంట్లో 2015 సెప్టెంబరు 30న సోదాలు జ‌ర‌ప‌గా.. అప్పుడు స్వాధీనం చేసుకున్న పత్రాల్లో పులి సినిమాకు తీసుకున్న రూ.15 కోట్ల ఆదాయాన్ని లెక్కల్లో ఆయ‌న‌ చూపలేదని తేలింది. దాంతో విజ‌య్ కు ఆదాయాన్ని దాచినందుకు రూ.1.50 కోట్లు ఫైన్ వేశారు. ఈ మేర‌కు ఆదాయపన్నుశాఖ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే విజ‌య్ ఆ ఉత్త‌ర్వుల‌ను ర‌ద్దు చేయాల‌ని మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

ఆ పిటిషన్‌ విచారించిన హైకోర్టు ఆదాయపన్నుశాఖ ఉత్తర్వులకు మధ్యంతర నిషేధం విధించ‌డ‌మే కాకుండా.. పిటిషన్‌పై ఆదాయపన్ను శాఖ జవాబు ఇవ్వాలని ఆదేశించింది. ఈ పిటిషన్‌ మంగళవారం విచారణకు రాగా.. ఐటీ శాఖ విజ‌య్ కు ఎందుకు కోటిన్న‌ర ఫైన్ వేయాల్సి వ‌చ్చిందో ప‌క్కా ఆధారాలు చూపించింది. దీంతో కోర్టు ఈ నెల 30కి తదుపరి విచారణను వాయిదా వేసింది. ఇక ఐటీ శాఖ వ‌ద్ద పక్కా ఎవిడెన్స్ ఉండ‌టంతో.. కోర్టు నుంచి విజ‌య్ కు వ్య‌తిరేకంగానే తీర్పు రావ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు.