ఓడిపోయే నేతలకే మరోసారి టికెట్లు… ఇలా అయితే ఎలా సార్….!?

రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే గట్టి పట్టుదలతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ నేతలు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతమున్న ప్రాంతీయ పార్టీల్లో టీడీపీ మోస్ట్ సీనియర్. 40 ఏళ్లు పూర్తి చేసుకున్న పార్టీ గెలుపు కోసం నానా పాట్లు పడాల్సి వస్తోంది. ఇంకా చెప్పాలంటే.. ఈ ఎన్నికల్లో ఓడితే… పార్టీ మనుగడే కష్టమంటునే మాట కూడా వినిపిస్తోంది. అటు సీఎం జగన్ కూడా ఇదే మాట వైసీపీ నేతలకు పదే పదే చెబుతున్నారు. రాబోయే ఎన్నికల్లో గెలిస్తే చాలు… రాబోయే 30 ఏళ్ల పాటు తామే అధికారంలో ఉంటామని జగన్ చెబుతున్నారు. ఇందుకు ప్రధానంగా చంద్రబాబు వయస్సును ప్రస్తావిస్తున్నారు. అందుకే రాబోయే ఆరు నెలలు పార్టీకి అత్యంత కీలకమని… ప్రతి ఒక్కరు కష్టపడి పని చేయాలని సూచిస్తున్నారు. ఇదే సమయంలో గెలిచే వారికే టికెట్ అని కూడా జగన్ ప్రకటించేశారు. ప్రస్తుత సిట్టింగ్‌లలో సుమారు 50 మందికి టికెట్లు లేవని కూడా జగన్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు. అయితే పార్టీ గెలుపు కోసం పని చేసిన ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం కల్పిస్తామన్నారు జగన్.

గెలుపు గుర్రాలకే టికెట్ అని ఓ వైపు జగన్ ప్రకటిస్తుంటే… మరోవైపు తెలుగుదేశం పార్టీ మాత్రం… పాత చింతకాయ పచ్చడి మాదిరిగానే ఆలోచిస్తోంది. పలు నియోజకవర్గాల్లో వరుసగా ఓడిపోతున్న నేతలకే టికెట్లు ఇచ్చేందుకు టీడీపీ అధిష్ఠానం రెడీ అవుతోంది. దీంతో ఆయా నియోజకవర్గాల్లో మరోసారి పార్టీ గెలుపు కష్టమనే మాట బలంగా వినిపిస్తోంది. ఉదాహరణకు సర్వేపల్లి నియోజకవర్గం నుంచి 1994, 1999 ఎన్నికల్లో వరుసగా రెండు సార్లు గెలిచిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి…. ఆ తర్వాత 2004 నుంచి వరుసగా నాలుగు ఎన్నికల్లో ఓడిపోతూనే ఉన్నారు. రెండుసార్లు ఆదాల ప్రభాకర్ రెడ్డి చేతుల్లో, మరో రెండు సార్లు ప్రస్తుత మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి చేతుల్లో సోమిరెడ్డి ఓడిపోయారు. అయితే 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ… సోమిరెడ్డిని మంత్రిని చేయడం కోసం ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది. వరుసగా నాలుగు సార్లు ఓడిన సోమిరెడ్డి… మరోసారి కూడా ఓడిపోతాడని సర్వే రిపోర్టులు చెబుతున్నాయి. అయినా సరే చంద్రబాబు మాత్రం మరోసారి సోమిరెడ్డి వైపే మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది.

మరో నియోజకవర్గం తుని.. అక్కడ నుంచి టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుటుంబం పెత్తనం చేస్తోంది. 2004 నుంచి యనమల కుటుంబం ఓడిపోతూనే ఉంది. 2004లో రామకృష్ణుడు ఓడిపోగా… తర్వాత మూడు సార్లు ఆయన సోదరుడు కృష్ణుడు పరాజయం పొందారు. అయినా సరే… మరోసారి రామకృష్ణుడు కుమార్తె దివ్యను పార్టీ ఇంఛార్జ్‌గా నియమించారు. వాస్తవానికి కృష్ణుడుని కాదని దివ్యను నియమించడంపై ఇప్పటికే అంతర్గత విభేదాలు భగ్గుమంటున్నాయి. పరిస్థితి ఇలాగే ఉంటే… మరోసారి టీడీపీ ఓటమి ఖాయమనే అంటున్నారు సొంత పార్టీ నేతలు.

ఇక మార్కాపురం నియోజకవర్గంలో కూడా పరిస్థితి సేమ్ టూ సేమ్. 1999 నుంచి జరిగిన ఎన్నికల్లో మార్కాపురం నియోజకవర్గంలో కేవలం 2009లో మాత్రమే టీడీపీ గెలిచింది. వరుసగా జరిగిన 5 ఎన్నికల్లో నాలుగు సార్లు మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి పోటీ చేశారు. ఇందులో కేవలం 2009లో మాత్రమే కందుల గెలిచారు. వరుసగా రెండు సార్లు ఓడిన కందులపైన నియోజకవర్గంలో కావాల్సినంత వ్యతిరేకత ఉందనే మాట వాస్తవం. పదవిలో ఉన్నప్పుడు, పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కందుల సోదరులు నియోజకవర్గంలో పెత్తనం చెలాయించారని… భూ కబ్జాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. దీంతో మార్కాపురంలో కందుల పట్ల పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అయినా సరే… మరోసారి కందులకే టికెట్ ఇస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. దీంతో రాబోయే ఎన్నికల్లో మరోసారి కందుల ఓటమి ఖాయమనే మాట బలంగా వినిపిస్తోంది.