టీడీపీలో వేరు కుంపట్ల గోల… ఇలా అయితే అయినట్లే….!

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో వేరు కుంపట్లు ఎక్కువయ్యాయి. ఈసారి ఎలాగైనా సరే అధికారంలోకి రావాలనేది టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యంగా పెట్టుకున్నారు. అదే లక్ష్యంతో ప్రతి ఒక్కరు పని చేయాలని నేతలకు, కార్యకర్తలకు దిశా నిర్దేశం కూడా చేశారు. అయితే తాజాగా పార్టీ నేతల తీరు చూస్తే మాత్రం అధినేత మాటను ఏ మాత్రం లెక్క చేస్తున్నట్లుగా లేదు. ఇందుకు ప్రధాన కారణం… పార్టీలో దాదాపు ప్రతి నియోజకవర్గంలో కూడా వేరు కుంపట్ల గోల ఎక్కువగా వినిపిస్తోంది.

స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్‌లో భారీ అవినీతి జరిగిందని ఆరోపిస్తూ… సీఐడీ అధికారులు చంద్రబాబును అరెస్టు చేశారు. దీంతో ఆయన ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఓ వైపు అధినేత జైలులో ఉంటే… పార్టీ నేతలు మాత్రం.. ఇప్పటి నుంచే టికెట్ల కోసం తన్నుకుంటున్నారు. రాబోయే ఎన్నికల్లో టికెట్ తనకే అని గొప్పగా చెప్పుకుంటున్నారు. దీంతో నియోజకవర్గంలో పార్టీ సూచించిన కార్యక్రమాల్లో కూడా కలిసి కట్టుగా చేయడం లేదు నేతలు. ఎవరికి వారే… యమునా తీరే అన్నట్లుగా వేరు కుంపట్లు పెట్టుకుని ధర్నాలు, నిరసనలు చేస్తున్నారు తప్ప…. కలిసిన దాఖలాలు కూడా లేవు.

శ్రీకాకుళం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవికి గోండు శంకర్ రూపంలో అసమ్మతి ఎదురవుతోంది. తనకు టికెట్ ఇస్తే ఎంతైనా ఖర్చు చేసి గెలుస్తానని.. గొండు శంకర్ ఇప్పటికే పార్టీ పెద్దలకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అదే సమయంలో గుండ పక్కన ఉండే వ్యక్తులు మంత్రి ధర్మాన ప్రసాద్ కోవర్టులుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో సిక్కోలులో గుండ వర్సెస్ గోండుగా పరిస్థితి మారిపోయింది.

ఎచ్చెర్ల నియోజకవర్గంలో కూడా మాజీ మంత్రి కళా వెంకట్రావుకు కలిశెట్టి అప్పలనాయుడు రూపంలో పోటీ ఎదురవుతోంది. టికెట్ కోసం కలిశెట్టి గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. తనకే టికెట్ వస్తుందని కూడా చెప్పుకుంటున్నారు. పైగా నియోజకవర్గంలో కళా, కలిశెట్టి వర్గాలు వేరు వేరుగా రాజకీయాలు చేయడం అధికార వైసీపీకి అనుకూలంగా మారుతోందనే మాట వినిపిస్తోంది.

కొవ్వూరు నియోజకవర్గంలో మాజీ మంత్రి జవహర్ వర్గానికి అచ్చిబాబు వర్గానికి నిప్పు నెయ్యిలా మారిపోయింది పరిస్థితి. నాకే టికెట్ అని జవహర్ గొప్పగా చెబుతున్నప్పటికీ… క్షేత్రస్థాయిలో మాత్రం నో ఛాన్స్ అనేస్తున్నారు కిందిస్థాయి నేతలు. జవహర్‌కు టికెట్ ఇస్తే చేసేది లేదని ఇప్పటికే పార్టీ అధినేతకు తెగేసి చెప్పినట్లుగా తెలుస్తోంది. దీంతో కొవ్వూరు టికెట్ జనసేనకు కేటాయిస్తే ఎలా ఉంటుందనే విషయంపై కూడా టీడీపీ సర్వేలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.

ఇక రాజమండ్రి నగర నియోజకవర్గంలో గోరంట్ల వర్సెస్ ఆదిరెడ్డి అన్నట్లుగా పరిస్థితి తయారైంది. తొలి నుంచి ఆదిరెడ్డి కుటుంబం పెత్తనం ఎక్కువగా ఉందని టీడీపీలో ఓ వర్గం నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే 15 మంది కార్పొరేటర్లు పార్టీ మారిపోయారు కూడా. ఇదే సమయంలో రూరల్ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థి పోటీ చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సిటీ నుంచి ఆదిరెడ్డి వాసును తప్పించి గోరంట్లకు అవకాశం ఇస్తారనే మాట వినిపిస్తోంది. దీంతో ఆదిరెడ్డి వాసు రూరల్ నేతలపై పెత్తనం చేస్తున్నారు. సిటీ పరిధిలోకి వస్తే బాగోదంటూ వార్నింగ్ కూడా ఇస్తున్నారు.

నిడదవోలు నియోజకవర్గంలో కూడా సేమ్ సీన్ కనిపిస్తోంది. టికెట్ కోసం బూరుగుపల్లి శేషారావు, కుందుల సత్యనారాయణ గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. వరుసగా రెండుసార్లు గెలిచిన శేషారావు మరోసారి తనకే టికెట్ అని చెబుతుండగా… తనకు అవకాశం ఇస్తే… ఖర్చు విషయంలో వెనుకాడేది లేదని కుందుల చెబుతున్నట్లుగా సమాచారం. అటు అధిష్టానం కూడా కుందుల వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.