ప్రకాశం ‘ఫ్యాన్’ వార్..సాయిరెడ్డి ముందే రచ్చ.!

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అధికార వైసీపీలో అంతర్గత పోరు ఏ మాత్రం తగ్గడం లేదు. ముందు నుంచి అక్కడ కీలక నేతలైన బాలినేని శ్రీనివాస్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డిల మధ్య విభేదాలు ఉన్న విషయం తెలిసిందే. ఈ విభేదాలు నేపథ్యంలోనే బాలినేని..ఈస్ట్ రాయలసీమ కో ఆర్డినేటర్ పదవిని సైతం వదిలిపెట్టారు. ఇప్పుడు ఆ బాధ్యతలని విజయసాయి రెడ్డి తన భుజాన వేసుకున్నారు.

దీంతో మొదట ప్రకాశం జిల్లాలోనే రచ్చకు బ్రేకులు వేసేందుకు సమావేశాలు పెడుతున్నారు. అయినా సరే సమావేశాల్లోనే వైసీపీ నేతలు కుమ్ములాటలకు దిగుతున్నారు. తాజాగా సంతనూతలపాడు నేతల మధ్య రచ్చ లేచింది. సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబు, నాగులుప్పాడు ఎంపీపీ అంజమ్మ భర్త శేషారెడ్డి వర్గాల మధ్య గొడవ జరిగింది. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న అంజమ్మని ఎమ్మెల్యే అనుచరుడు నెట్టేసేందుకు ప్రయత్నించగా, అంజమ్మ…ఎమ్మెల్యే అనుచరుడు చెంప వాయించింది. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది.

అటు మార్కాపురం నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి, వైసీపీ నేత సూర్యప్రకాశ్ రెడ్డి వర్గాల మద్య గొడవ జరిగింది. ఇటు గిద్దలూరులో ఎమ్మెల్యే అన్నా రాంబాబుకు వ్యతిరేకంగా కొందరు నేతలు నినాదాలు చేశారు. అటు కొండపి ఇంచార్జ్ అశోక్ బాబుకు వ్యతిరేకులు గళం విప్పారు. అటు కనిగిరిలో అదే పరిస్తితి. ఇలా ప్రకాశంలో వైసీపీ నేతల మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. ఈ పరిణామాలని చక్కదిద్దే సాయిరెడ్డి ముందే ఈ రచ్చ జరిగింది.

మరి వాటిని సాయిరెడ్డి ఎలా చక్కదిద్ది..ప్రకాశంలో వైసీపీని బలోపేతం చేస్తారో చూడాలి.