ఎమ్మెల్యేలే టీడీపీకి డ్యామేజ్..ప్లాన్ రివర్స్.!

టీడీపీ నేతలే..టీడీపీకి డ్యామేజ్ చేస్తున్నారా? చంద్రబాబు అరెస్ట్ అయిన నేపథ్యంలో ఓ వ్యూహం లేకుండా ముందుకెళ్లడంతో టి‌డి‌పి నేతలు ఫెయిల్ అవుతున్నారా? వైసీపీ ఎత్తుల ముందు తేలిపోతున్నారా? అంటే తాజాగా అసెంబ్లీ సమావేశాల్లో టి‌డి‌పి ఎమ్మెల్యేలు చేసిన కార్యక్రమం చూస్తే అవుననే అనిపిస్తుంది. అసలు అసెంబ్లీలో చర్చ జరగకుండా బాబు అక్రమ అరెస్ట్ అంటూ ప్లకార్డులు పట్టుకుని పోడియం ముందుకెళ్లి హడావిడి చేయడం, అక్కడ స్పీకర్‌ని ఇబ్బంది పెట్టడం, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, అనగాని సత్యప్రసాద్ లాంటి వారు అక్కడ ఉన్న వస్తువులు ధ్వంసం చేసేలా రచ్చ చేయడం..అటు బాలయ్య మీసం తిప్పడం లాంటి చర్యలు వల్ల టి‌డి‌పికే నష్టం జరిగేలా ఉంది.

బి‌ఏ‌సి సమావేశానికి హాజరుకావాలని అచ్చెన్నాయుడుకు పిలుపు వచ్చిన..వెళ్లకుండా అసెంబ్లీలో టి‌డి‌పి ఎమ్మెల్యేలు అంతా కలిసి అసలు చర్చ జరగకుండా గొడవ చేసి..చివరికి సస్పెండ్ అయ్యారు. దీని వల్ల బాబు అరెస్ట్ పై చర్చ జరగలేదని, ఇలా చేయడం కరెక్ట్ కాదని టి‌డి‌పి శ్రేణులు కొందరు అసంతృప్తికి గురయ్యారు. ఇదే సమయంలో ఇంకా వైసీపీ వాళ్ళకు అవకాశం ఇచ్చినట్లు అయిందని, బాలయ్య మీసం తిప్పి వైసీపీ వాళ్ళని రెచ్చగొట్టడంతో వారు కూడా కౌంటర్లు ఇచ్చారని అంటున్నారు.

అంబటి రాంబాబు, బాలయ్య మధ్య జరిగిన మాటల యుద్ధం మరింత ఇబ్బంది కలిగించిందనే చెప్పవచ్చు. మొత్తానికి అసెంబ్లీ సమావేశం జరగకుండా టి‌డి‌పి ఎమ్మెల్యేలు అడ్డుకునే ప్రయత్నం చేయడం కరెక్ట్ కాదని ప్రజలు భావిస్తున్నారు. ఇలాంటి పరిస్తితుల్లో చర్చకు వచ్చి బాబు అరెస్ట్ పై మాట్లాడితే సరిపోయేది అని చెబుతున్నారు. మొత్తానికి ఎమ్మెల్యేలే పార్టీకి ఇంకా మైనస్ చేశారని చెప్పుకోవచ్చు.