ఖమ్మంలో కారుకు ఆ ఇద్దరి దెబ్బ..రివర్స్.!

ఉమ్మడి ఖమ్మం జిల్లా అంటే అధికార బి‌ఆర్‌ఎస్ పార్టీకి పెద్దగా కలిసిరాని జిల్లా అని చెప్పవచ్చు. తెలంగాణలో మిగిలిన 9 ఉమ్మడి జిల్లాలు ఒక ఎత్తు అయితే..ఈ ఖమ్మం జిల్లా మరొక ఎత్తు. బి‌ఆర్‌ఎస్ పార్టీకి ఏ మాత్రం పట్టు లేని జిల్లా. 2014, 2018 ఎన్నికల్లో జిల్లాలో బి‌ఆర్‌ఎస్‌కు గట్టి దెబ్బ తగిలింది. అయితే 2018 ఎన్నికల్లో కాంగ్రెస్, టి‌డి‌పిల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలని బి‌ఆర్‌ఎస్ లోకి తీసుకున్నారు.

అలాగే పలువురు కీలకమైన నేతలని బి‌ఆర్‌ఎస్ లోకి తీసుకున్నారు. దీంతో ఖమ్మంలో బి‌ఆర్‌ఎస్ హవా ఉన్నట్లు కనిపించింది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అవుతుంది. ప్రధానంగా తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బలమైన నాయకులు బి‌ఆర్‌ఎస్ పార్టీ వదలడం పెద్ద మైనస్ అవుతుంది. ఇప్పటికే పొంగులేటి కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయారు. ఇటు తుమ్మల సైతం కాంగ్రెస్ లోకి వెళ్ళేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. పొంగులేటితో పాటు నాలుగైదు నియోజకవర్గాల్లో కీలక నేతలు కాంగ్రెస్ లోకి వచ్చారు. ఇప్పుడు తుమ్మలతో పాటు కొందరు కీలక నేతలు కారు దిగేస్తారు.

ఈ దెబ్బకు బి‌ఆర్‌ఎస్ పార్టీకి ఖమ్మంలో అదిరే షాక్ తప్పదు. వాస్తవానికి 2014 ఎన్నికల్లో ఖమ్మంలో 10 నియోజకవర్గాల్లో కలిపి బి‌ఆర్‌ఎస్ కు లక్షా 55 వేల ఓట్లు వచ్చాయి. కానీ తర్వాత వైసీపీ నుంచి ఖమ్మం ఎంపీగా గెలిచిన పొంగులేటి, టి‌డి‌పి నుంచి ఖమ్మం అసెంబ్లీలో ఓడిపోయిన తుమ్మల బి‌ఆర్‌ఎస్ లోకి వచ్చారు. దీంతో 2018 ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ ఒకటే సీటు గెలిచిన దాదాపు 6.74 లక్షల ఓట్లు వచ్చాయి.

అంటే 2014లో టి‌డి‌పికి 4.77 లక్షల ఓట్లు పడ్డాయి. అవి దాదాపు తుమ్మల వల్ల బి‌ఆర్‌ఎస్‌కు వచ్చాయి. అటు వైసీపీకి పడిన ఓట్లు పొంగులేటి వల్ల బి‌ఆర్‌ఎస్‌కు వచ్చాయి. ఇప్పుడు ఆ ఇద్దరు కాంగ్రెస్ వైపు ఉన్నారు. దీంతో ఖమ్మంలో బి‌ఆర్‌ఎస్‌కు ఈ సారి భారీ షాక్ తగిలేలా ఉంది.