సత్తెనపల్లి టీడీపీ ఓ దారికి వచ్చినట్లేనా….!

పల్నాడు జిల్లా సత్తెనపల్లి టీడీపీలో అధిపత్య పోరు నడుస్తోందనేది బహిరంగ రహస్యం. 2014లో అక్కడ పోటీ చేసి గెలిచిన డాక్టర్ కోడెల శివప్రసాదరావు స్పీకర్‌గా ఐదేళ్ల పాటు కొనసాగారు. ఆయితే 2019లో మరోసారి పోటీ చేసిన కోడెల శివప్రసాద రావు ప్రస్తుత మంత్రి అంబటి రాంబాబు చేతిలో ఓడారు. ఆ తర్వాత ఏడాదికే ఆయన ఆత్మహత్య చేసుకుని మృతి చెందారు. అయితే నాటి నుంచి సత్తెనపల్లి నియోజకవర్గం టీడీపీలో ఆధిపత్య పోరు నడుస్తోంది. అందుకు ప్రధాన కారణం కోడెల శివప్రసాద్ కుమారుడు శివరామ్ తీరు సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. తండ్రి అధికారంలో ఉన్న సమయంలో స్థానిక నేతలతో శివరామ్ వ్యవహరించిన తీరు కారణమని విమర్శలు చేశారు. దీంతో నియోజకవర్గంలో శివరామ్ పర్యటనలకు సొంత పార్టీ నేతలే దూరంగా ఉన్నారు. ఒక దశలో శివరామ్ తమకు క్షమాపణ చెప్పాలంటూ ఆందోళన కూడా చేశారు. చివరికి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు స్వయంగా నియోజకవర్గంలో పర్యటించాల్సి వచ్చింది.

దాదాపు నాలుగేళ్ల పార్టు నియోజకవర్గానికి ఇంఛార్జ్‌ను కూడా చంద్రాబాబు నియమించలేదు. దీంతో నా పై పోటీ చేసేది ఎవరో ముందు తేల్చుకోండి అంటూ మంత్రి అంబటి రాంబాబు వ్యంగ్యాస్త్రాలు కూడా వేశారు. చివరికి మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరిన తర్వాత… ఆయనకు సత్తెనపల్లి బాధ్యతలు అప్పగించారు చంద్రబాబు. కన్నా రాకను ఒక వర్గం నేతలు ఆహ్వానించినప్పటికీ… శివరామ్ మాత్రం తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో కన్నాకు సహకరించాలని… లేదంటే చర్యలు తీసుకుంటామని జిల్లా పార్టీ అధ్యక్షులు జీవీ ఆంజనేయులు నోటీసులు కూడా ఇచ్చారు. ఈ సమయంలోనే లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర పల్నాడు జిల్లాలోని మాచర్ల, గురజాల నియోజకవర్గాలు పూర్తి చేసుకుని సత్తెనపల్లి చేరుకుంది. యువనేత పాదయాత్ర సమయంలో నేతల మధ్య తగవులు పార్టీకి చెడ్డ పేరు తీసుకువస్తాయని అంతా భావించారు కూడా. దీంతో ఈ విభేదాలకు బ్రేక్ పెట్టేందుకు స్వయంగా లోకేశ్ యత్నించారు.

సత్తెనపల్లి నియోజకవర్గంలో కేవలం ఒకరోజు మాత్రమే లోకేశ్ పాదయాత్ర చేశారు. ఈ సమయంలో ముందుగా నియోజకవర్గానికి చెందిన కన్నా లక్ష్మీనారాయణ, కోడెల శివరామ్‌తో పాటు ఇతర ముఖ్య నేతలతో కూడా లోకేశ్ చర్చించారు. ఈ ఎన్నికల్లో కన్నా లక్ష్మీనారాయణకు ప్రతి ఒక్కరు సహకరించాలని సూచించారు. పార్టీ గెలుపు కోసం కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు లభిస్తుందని హామీ ఇచ్చారు. నేతలు గొడవలు పడితే.. అది పార్టీకే కాకుండా వ్యక్తిగతంగా కూడా నష్టపోతారని హెచ్చరించారు. దీంతో గెలుపు కోసం కష్టపడి పని చేయాలని లోకేశ్ దిశా నిర్దేశం చేశారు. దీంతో లోకేశ్ పాదయాత్రలో ఓ వైపు కన్నా లక్ష్మీనారాయణ, మరో వైపు కోడెల శివరామ్ కలిసి నడవటంతో… తెలుగు తమ్ముళ్లలో కొత్త జోష్ వచ్చినట్లైంది.